అంధులు నాలుకతో చూడొచ్చు!

ఆంధ్రజ్యోతి, 30-06-2015: అంధులకు దారి చూపడంలో సాయపడేందుకు దృశ్యాన్ని విద్యుత్‌ సంకేతాలుగా మార్చే కొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. ఈ పరికరాన్ని నాలుకతో రుచిచూసి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. బ్యాటరీతో పనిచేసే ఈ పరికరంలో కెమెరా అమర్చిన కళ్లజోడుతో పాటు మరో చిన్న పరికరం ఉంటుంది. బ్రెయిన్‌పోర్ట్‌ వి100 గా వ్యవహరిస్తున్న ఈ పరికరానికి అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిసే్ట్రషన్‌ ఇటీవలే అనుమతిచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అంధులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. కళ్లజోడుకు అమర్చిన కెమెరా ఎదురుగా ఉన్న దృశ్యాలను రికార్డు చేసి బ్రెయిన్‌పోర్ట్‌కు పంపిస్తుంది. కెమెరా పంపిన దృశ్య తరంగాలను ఈ పరికరం విద్యుత్‌ సంకేతాల రూపంలోకి మార్చి మరో చిన్న పరికరానికి పంపిస్తుంది. ఈ బుల్లి పరికరంలోని ఎలకో్ట్రడ్లు విద్యుత్‌ సంకేతాలను నాలుకకు అందిస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు. వైబ్రేషన్ల రూపంలో అందే సంకేతాల ద్వారా అంధులు తమ ఎదురుగా ఉన్న వస్తువులు, వాహనాలను సులభంగా గుర్తించవచ్చని చెప్పారు. అంతేకాదు ఆ వస్తువులు లేదా వాహనాలు కదులుతున్నాయా.. స్థిరంగా ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చని వివరించారు. కాగా, ఏడాదిపాటు జరిపిన ప్రయోగంలో పాల్గొన్న వలంటీర్లలో 69 శాతం మంది ఈ ఓరల్‌ డివైజ్‌తో ఎలాంటి దుష్పరిణామాలు లేవని పేర్కొనగా.. ఒకరిద్దరిలో నాలుకపై మంట వంటి చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినట్లు వివరించారు. త్వరలో దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు బ్రెయిన్‌పోర్ట్‌ ఆవిష్కర్త వికాబ్‌ కంపెనీ వివరించింది.