కలిశారంటే పొగ వదలాల్సిందే

స్నేహితులను కలిస్తే 71 శాతం మంది పొగ తాగాల్సిందే.. 
మానాలనుకున్నా కష్టమే 
యువత అలవాట్లను వెల్లడించిన 
యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ విద్యార్థులు 
అలవాటు మానుకోవాలనుకుంటే చెడు స్నేహాలు వదలడమే మంచిని సూచన 

ఆంధ్రజ్యోతి,16-3-2017: పొగతాగరాదని ప్రభుత్వం ఎంత చెప్పినా పట్టించుకునే వారే ఉండరు. కనీసం ధర పెంచితే వాడకం తగ్గిస్తారని భావించినా వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్‌ అన్న గిరీశం మాటలే వీరి చెవికెక్కాయి కానీ.. సినిమా ప్రారంభానికి ముందు వచ్చే పొగాకు వ్యతిరేక ట్రైలర్లు వీరిని మార్చలేకపోయాయని చెప్పొచ్చు. పొగ తాగే అలవాటు మానలేకపోవడానికి స్నేహితులే కారణమని ఆధారాలతో సహా వెల్లడైందిప్పుడు. స్నేహితులు లేదంటే సహచర ఉద్యోగులు పక్కన ఉండి, వారు పొగతాగుతుంటే ఎంతగా తాగకూడదని అనుకున్నా అలవాటు మానకుండా ఉండలేకపోతున్నారని హైదరాబాద్‌, కోల్‌కాతాలో చేసిన అధ్యయనంలో వెల్లడైనట్టు యూనివర్శిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ విద్యార్థులు దినా బొర్జెక్వోస్కీ, జులియా సెన్‌చెన్‌ పేర్కొన్నారు. పొగతాగే అలవాటు మానుకోవాలంటే ముందు చెడు స్నేహాలను వదిలేయడమే మంచిదని వారు సలహా ఇచ్చారు.
 
పెరుగుతున్న వినియోగం
పొగాకు ఉత్పత్తుల వినియోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దేశంలో ప్రతి రోజూ 2500 మంది పొగాకు ఉత్పత్తుల కారణంగా చనిపోతుంటే కొత్తగా 5500 మంది పొగతాగటం అలవాటు చేసుకుంటున్నారు. మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. కొత్తగా ధూమపానం అలవాటు చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది యువకులతో పాటు మహిళలు సైతం ఉండటం. 15 సంవత్సరాలు దాటిన యువతీ,యువకులు ఇటీవల కాలంలో పొగాకు ఉత్పత్తులను తీసుకోవటం పెరుగుతుందని మరికొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇదే క్రమంలో పొగాకు ఉత్పత్తులను తీసుకున్న వారి సంఖ్య పెరుగుతూ పోతే 2050 నాటికి ఇప్పుడు ప్రతి సంవత్సరం మరణిస్తోన్న 10 లక్షల మందికి అదనంగా మరో 16 లక్షల మంది తోడవుతారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పొగాకు వ్యతిరేక దినోత్సవాలు, ఆరు బయట పొగ తాగడంపై నిషేధాలు... ఇలా ఎన్ని నిబంధనలున్నా, పొగాకు ఉత్పత్తుల ప్యాక్‌లపై హెచ్చరికలు జారీ చేసినా తగ్గేదే లేదంటున్నారు పొగరాయుళ్లు. పొగతాగితే అనారోగ్యం బారినపడతామని తెలుసు. కానీ అలవాటు మానుకోలేకపోతున్నామనే వారే అధికంగా నగరంలో కనిపిస్తున్నారిప్పుడు. అసలు సిగరెట్‌ తాగటానికి మానసిక పరిస్థితులే కారణమన్నది వైద్యుల అభిప్రాయం. టీనేజ్‌లో ఫ్యాషన్‌గా పొగతాగడం ప్రారంభించి దానిని అలవాటుగా మార్చుకునే వారే అధికంగా కనబడతారని కన్సల్టెంట్‌ చెస్ట్‌ ఫిజీషియన్‌ వెంకటేశ్వరరావు అన్నారు. పొగతాగడం వల్ల కలిగే అనర్థాలు తెలిసినా అలవాటు మానుకోలేకపోవడానికి స్నేహితులు కూడా కారణమేనని అన్నారు. మేరీల్యాండ్‌ యూనివర్శిటీ విద్యార్థులు సైతం ఇదే చెబుతున్నారు. తమ స్నేహితులు, సహచర ఉద్యోగులు ఉన్నప్పుడు 71 శాతం మంది అధికంగా పొగతాగుతున్నారని, ఒంటరిగా ఉన్నప్పుడు వీరి సంఖ్య 46.4 శాతం మాత్రమే ఉంటుందని, కుటుంబసభ్యులతో ఉన్నప్పుడు కేవలం 40 శాతం మంది మాత్రమే పొగతాగుతున్నారని కూడా ఆ అధ్యయనంలో వారు వెల్లడించారు.
 
నిషేధం సమర్ధవంతంగా అమలు చేయాలి 
సాధారణంగా మనం ఏదైనా ఓ అంశాన్ని చూసినప్పుడు మనలో దాని పట్ల ఆసక్తి కూడా అంతేస్థాయిలో పెరుగుతుంది. రోడ్డు మీద పానీపూరి బండి దగ్గర ఎవరైనా తింటున్నప్పుడు, లేదంటే బిర్యానీ సెంటర్‌ వైపు నుంచి వెళుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనసులాగుతుంది. అదే తరహాలో పొగరాయుళ్లకు సైతం ఎవరైనా పొగతాగితే అప్పటి వరకూ నిద్రాణంగా ఉన్న వారి కోరిక జడలు విప్పుకుంటుందంటున్నారు సిటిజన్స్‌ హాస్పిటల్‌ క్ల్లినికల్‌ సైకాలజిస్ట్‌ అనితా అరె. వాస్తవం కూడా ఇదేనన్నది అధ్యయనాలు చెబుతున్నాయి. పొగాకుపై నిషేధాన్ని సమర్ధవంతంగా అమలు చేయాల్సి ఉందని మేరీల్యాండ్‌ యూనివర్శిటీ విద్యార్థులు బొర్జెకోవ్‌స్కీ, జులియా సెన్‌ చెన్‌ చెబుతున్నారు. లేబొరేటరీ అధ్యయనాల ప్రకారం దృష్టి లేదంటే వాసన ఆధారంగా మనసులో కలిగే ఉద్విగ్నతలు కార్డియోవాస్క్యులర్‌ యాక్టివేషన్‌ను పెంచుతాయి. దానితో పాటుగా రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం పెరిగి అది పొగతాగేందుకు ప్రోత్సాహాన్నిస్తుందని తేలింది. డీ ఎడిక్షన్‌ కేంద్రాలకు వచ్చి వ్యసనాలను పూర్తిగా మానేసిన వారు కేవలం నాలుగు శాతానికే పరిమితం కావడానికి ఇదే కారణమన్నది డాక్టర్ల మాట. 
-ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ పొగతాగే అలవాటు మానేందుకు డాక్టర్లు అందిస్తున్న సూచనలు

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనే మనోస్థైర్యం ఉండాలి. అది మాత్రమే అలవాట్లను మాన్పిస్తుంది. 
వ్యాయామాలు చేయడం తప్పనిసరి. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఒత్తిడి తగ్గించి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
సరైన ఆహారం తీసుకోవాలి. వ్యసనాలకు దూరమైనప్పుడు శరీరం మార్పును అంగీకరించడానికి తగిన రీతిలో సిద్ధం కావాలంటే శక్తి అవసరం. ఇందుకోసం పచ్చి కూరగాయలైన బ్రొకొల్లీ, స్పినాచ్‌ వంటివి తీసుకోవడం మంచిది. మెగ్నీషియం వీటిలో అధికంగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన విశ్రాంతి లభిస్తుంది. 
పాలు, గుడ్లు లాంటి వాటిలో ట్రిప్టోఫాన్‌ అధికంగా ఉంటుంది. ఇది సెరోటోనిన్‌ ఉత్పత్తి కావడానికి దోహదం చేస్తుంది. ఒత్తిడి నుంచి త్వరగా బయటపడటానికి దోహదపడుతుంది. పాలు, గుడ్లు లాంటివి ఇష్టం లేకపోతే విటమిన్‌ సీ అధికంగా ఉండే నారింజ, మామిడి, జామ, ఫైనాఫిల్‌, బొప్పాయి లాంటివి తీసుకోవచ్చు 
అన్నిటి కన్నా ముఖ్యమైనది పొగతాగే చోటకు అసలు వెళ్లకూడదు. పార్టీల్లాంటి చోటకు వెళ్లాల్సి వచ్చినా పొగతాగే చోటైతే బయటకు వచ్చేయడమే మంచిది. 


స్నేహితుల ప్రోద్భలం చాలా ఉంటుంది.. 
నలుగురు పొగతాగుతున్నారంటే.. పొగతాగే అలవాటున్న వారికి అది ఓ క్లూగా పనిచేస్తుంది. ఎలాగంటే.. కాఫీ వాసన చూడగానే కాఫీ తాగాలని అనిపించినట్టు. చెడిపోవాలన్నా, బాగుపడాలన్నా స్నేహితుల ప్రోద్భలం చాలా ఉంటుంది. అందుకే ఎవరైనా చెడు అలవాట్లను మానుకోవాలని వస్తే వీలైనంతగా స్నేహితులకు దూరంగా ఉండమని చెబుతుంటాం. చుట్టూ పొగతాగే వారు ఉన్నప్పుడు నియంత్రించుకోవడం చాలా కష్టం. తల్లిదండ్రులు లేదంటే భార్య ప్రోద్భలంతో అలవాటు మానడానికి వచ్చామని ఎవరైనా అన్నారంటే వారు ఆ అలవాట్లకు దూరం కావడం కాస్త కష్టమే !! 

- డాక్టర్‌ అనితా అరె, 
క్లినికల్‌ సైకాలజిస్ట్‌, 
సిటిజన్స్‌ హాస్పిటల్‌