ముడతలు వదిలించే స్కిన్‌ ట్రీట్‌మెంట్స్‌

23/08/14

మన శరీరంలో అతి పెద్ద ఆర్గాన్‌ చర్మం. మనం తినే ఆహారం, వాతావరణం, జీవన విధానాల ప్రభావం చర్మంపైనే ఎక్కువగా ఉంటుంది. సరైన జాగ్రత్తలు పాటించకపోతే చర్మానికి పటుత్వాన్నిచ్చే కొల్లాజెన్‌ ఉత్పత్తి తగ్గి ముడతలు ఏర్పడతాయి. అయుతే ఎన్ని చిట్కాలు పాటించినా ఆ ఫలితం తాత్కాలికమే! శాశ్వత ఫలితం దక్కాలంటే మాత్రం నిపుణుల పర్యవేక్షణలో యాంటీ రింకిల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సిందే! 

లేజర్‌ స్కిన్‌ రీసర్ఫేసింగ్‌
ఈ యాంటీ రింకిల్‌ ట్రీట్‌మెంట్‌లో ప్రధానంగా కార్బన్‌ డయాక్సైడ్‌ లేజర్స్‌ను ఉపయోగిస్తారు. చర్మపు కనెక్టివ్‌ టీష్యూ ప్రొటీన్‌ అయిన కొల్లాజెన్‌ సూర్యరశ్మికి, కాలుష్యానికి దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న కొల్లాజెన్‌ను రిపేర్‌ చేసి ఉత్పత్తిని వేగవంతం చేయటానికి లేజర్‌ స్కిన్‌ రీసర్ఫేసింగ్‌ ట్రీట్‌మెంట్‌ చక్కగా ఉపకరిస్తుంది. పైగా ఈ చికిత్స వల్ల చర్మపు పై పొరలు దెబ్బతినవు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందాలంటే కార్బన్‌ డయాక్సైడ్‌ లేజర్‌ స్కిన్‌ రీసర్ఫేసింగ్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి. ఒకటి లేదా రెండు సెషన్లలో పూర్తయ్యే ఈ ట్రీట్‌మెంట్‌ ఫలితం దాదాపు 8 నుంచి 10 ఏళ్లపాటు ఉంటుంది.
రింకిల్‌ ఇంజెక్షన్స్‌
సర్జరీతో పనిలేకుండా యూత్‌ఫుల్‌ లుక్‌ తెప్పించాలంటే రింకిల్‌ ఇంజెక్షన్స్‌ తీసుకోవాలి. వీటి వల్ల ముడతలు పడిన చర్మం చక్కటి పటుత్వంతో నిగారిస్తుంది. హైల్యురోనిక్‌ యాసిడ్‌ కలిగి ఉంటే రింకిల్‌ ఇంజెక్షన్‌ ఇవ్వటం వల్ల కొల్లాజెన్‌ ఫిల్లింగ్‌ ఎఫెక్ట్‌ రావటంతోపాటు కొల్లాజెన్‌ ఉత్పత్తి కూడా మెరుగవుతుంది. ఎక్కువ శాతం ఫిల్లర్స్‌ కేవలం ఒక ఏడాది అంతకంటే ఎక్కువ కాలంపాటు నిలిచి ఉండే ఫలితాన్నే ఇస్తాయి. కానీ ఒక్క ఆర్టిఫిల్‌ అనే ఫిల్లర్‌ ఇంజెక్షన్‌ మాత్రమే శాశ్వత ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఫిల్లర్‌ ఇంజెక్షన్స్‌ వల్ల రియాక్షన్స్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో చర్మం కింద బుడిపెలు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఈ చికిత్స చేయించుకోవాలి. 
యాంటీఆక్సిడెంట్స్‌
ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయగల స్కిన్‌ కేర్‌ న్యూట్రియెంట్స్‌ యాంటీఆక్సిడెంట్స్‌. ఈ పోషకాలను సరైన సమయంలో చర్మానికి అందించటం ద్వారా ఫ్రీ ర్యాడికల్స్‌ చర్మానికి హానికలిగించేలోపే వాటిని న్యూట్రలైజ్‌ చేయవచ్చు. ప్రస్తుతం ఈ చికిత్స కోసం పవర్‌ఫుల్‌ యాంటీఆక్సిడెంట్స్‌గా కాఫీ బెర్రీని ఉపయోగిస్తున్నారు. ఈ కాఫీ బెర్రీ ఎక్స్‌ట్రాక్ట్‌ ఎటువంటి స్కిన్‌ అలర్జీ, రియాక్షన్‌ లేకుండా చర్మంపైని ముడతలు, గీతల్ని మటుమాయం చేయగలదు. 
విటమిన్‌ ఎ
విటమిన్‌ ఎ నుంచి సేకరించిన రెటినాయిడ్స్‌ చర్మపు ముడతల్ని నివారించటంలో సమర్థమైనవిగా వైద్యులు కనిపెట్టారు. ఇవి కొల్లాజెన్‌ బ్రేక్‌డౌన్‌ను అరికట్టి కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. అందుకే రెటినాల్‌ ఉండే రెటీన్‌ ఎ లేదా రినోవా అనే యాంటీ ఏజింగ్‌ స్కిన్‌ క్రీమ్స్‌ను కాస్బటాలజిస్ట్‌లు సూచిస్తూ ఉంటారు. రెటినాల్‌ కలిగిఉన్న క్రీమ్‌ను వారానికి మూడు రోజులపాటు 24 వారాలపాటు వాడితే మంచి ఫలితాలు సాధించవచ్చని డెర్మటాలజిస్ట్‌లు ప్రయోగాల ద్వారా నిరూపించారు. ఫిల్లర్‌ ఇంజక్షన్లు, సర్జరీలు, లేజర్‌ ట్రీట్‌మెంట్లంటే ఇష్టపడని వారు నిర్భయంగా రెటినాల్‌ లోషన్‌ను వాడి చర్మపు ముడతల్ని తొలగించుకోవచ్చు.