ఒంట్లో చక్కెర నిల్వలు పడిపోతే..

10-08-2017: మా నాన్న గారికి పదిహేనేళ్లుగా టైప్‌-2 మధుమేహం ఉంది. ఇటీవలి కాలంలో ఒకటి రెండుసార్లు లో-షుగర్‌తో కళ్లు తిరిగి పడిపోయాడు. ఇది మాకు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి మళ్లీ మళ్లీ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో చెబుతారా?

- ఎస్‌. వేణు, ఇబ్రహీంపట్నం.
 
రక్తంలో చక్కెర, అతి తక్కువ స్థాయికి 5 మి.గ్రా/డిఎల్‌ కంటే తక్కువ స్థాయికి పడిపోవడాన్ని హైపోగ్లైసీమియా అంటారు. శరీరంలో ఇన్సులిన్‌ పరిమాణం మోతాదు కంటే ఎక్కువైనప్పుడు... రక్తంలో చక్కెర శాతం పడిపోతుంది. ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ తీసుకునే వారు, ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపించే ట్యాబ్లెట్లు తీసుకునే వారు అప్పుడప్పుడు ఈ హైపోగ్లైసీమియా సమస్యకు గురవుతుంటారు. సగటున చూస్తే టైప్‌-1 డయాబెటిస్‌ ఉన్న వారికి వారానికి ఒకటి రెండు సార్లు హైపోగ్లైసీమియా రావడం సహజమే.
 
కానీ, టైప్‌-2 డయాబెటిస్‌ రోగులకు మాత్రం హైపోగ్లైసీమియా రావడం చాలా అరుదు. ఈ సమస్య రావడానికి ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ గానీ, ట్యాబ్లెట్లను గానీ, ఎక్కువ మోతాదులో తీసుకోవడం ఒక కారణం. ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ లేదా ట్యాబ్లెట్ల డోసు తీసుకున్న ఆహారంతో గానీ, చేస్తున్న వ్యాయమాంతో గానీ పొంతన లేకపోవడం కూడా ఇందుకు కారణం. హైపోగ్లైసీమియా సమస్య ఒకసారి వస్తే, దానికి కారణమేమిటో తెలుసుకోవడం చాలా అవసరం. ఆ కారణమేదో తెలిస్తే ఆ పరిస్థితి మరోసారి రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. రక్తంలో చక్కెర నిలువలు బాగా తగ్గిపోయినప్పుడు కనిపించే లక్షణాల్లో కొన్ని రోగితో పాటు ఇతరులకు కూడా తెలుస్తాయి. కొన్నేమో తనకు మాత్రమే తెలుస్తాయి. చేతులు వణకడం, నీరసం, చెమటలు పట్టడం, అసహనం, చిరాకు, నిద్రమత్తు, కోపం, మొండితనం వంటి లక్షణాలు తనకే కాకుండా ఇతరులకు కూడా తెలుస్తాయి.
 
గుండెదడ, దిగులు, ఆందోళన, ఆకలిగా అనిపించడం, తడబాటు, చూపులో మసకతనం, ఒకే వస్తువు రెండుగా కనిపించడం, మూతి, చేతివేళ్లు తిమ్మిరిగా అనిపించడం, తలనొప్పి, నిద్రలో ఏడుపు, పీడకలలు రావడం వంటి లక్షణాలు రోగికి మాత్రమే తెలుస్తాయి. ఏమైనా, మధుమేహం ఉన్నవారు చాక్లెట్లు, గ్లూకోజ్‌ బిస్కట్లు లేదా పంచదార వంటి తీపి పదార్థాలు ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. హైపోగ్లైసీమియా లక్షణాలు కనిపించగానే ఒకటి రెండు స్వీట్లు చప్పరిస్తే శరీరంలో వెంటనే చక్కెర శాతం పెరుగుతుంది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, ఒక్కోసారి అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఏర్పడుతుంది.
- డాక్టర్‌ డి. జె. కార్తిక్‌, జనరల్‌ ఫిజీషియన్‌