మధుమేహంతో మహిళలకే ఎక్కువ ముప్పు

పురుషులతో పోలిస్తే వారిలో గుండె విఫలమయ్యే ప్రమాదం ఎక్కువ..
టైప్‌-1 బాధిత పురుషుల కన్నా స్త్రీలలో గుండెవైఫల్యం 41% అధికం
ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడి

న్యూయార్క్‌, జూలై 20: మధుమేహానికి గుండె వైఫల్యానికి సంబంధం ఉందని వైద్యనిపుణులకు చాలాకాలంగా తెలుసు. కానీ.. ఆ ప్రభావం పురుషుల్లో కంటే మహిళల్లో గణనీయంగా ఎక్కువని యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌లోని ‘జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌హెల్త్‌’ పరిశోధకులు చెబుతున్నారు. 

మరీ ముఖ్యంగా టైప్‌-1 మధుమేహం వచ్చిన పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె వైఫల్య ప్రమాదం 47 శాతం ఎక్కువని వారి అధ్యయనంలో తేలింది. అదే టైప్‌-2 మధుమేహ బాధితులైతే మాత్రం పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆ ముప్పు 9ు ఎక్కువట. 1966 జనవరి నుంచి 2018 నవంబరు నడుమ గతంలో జరిగిన 14 అధ్యయనాల ఫలితాలను విశ్లేషించి వారు తమ పరిశోధన పత్రాన్ని రూపొందించారు. ఆ పత్రం డయాబెటాలజియా జర్నల్‌లో ప్రచురితమైంది.
 
‘‘సాధారణంగా మధుమేహం లేని మహిళలతో పోలిస్తే మధుమేహ బాధిత మహిళల్లో గుండె వైఫల్యం ముప్పు ఎక్కువ’’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాన్‌ పీటర్స్‌ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. 1980లో ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య 10.8 కోట్లు ఉండగా.. 2014 నాటికి అది 42.2 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో.. మధుమేహం బారిన పడకుండా ఉండేలా జీవనశైలిని మార్చుకోవాలని పరిశోధకులు సూచించారు.
 
పౌష్టికాహారం తిని, తరచుగా వ్యాయామం చేస్తే మధుమేహం ముప్పు చాలా వరకూ తగ్గిపోతుందని శాన్‌ పీటర్స్‌ పేర్కొన్నారు. ఇంతకీ మధుమేహ బాధితుల్లో గుండెవైఫల్యం ఎందుకు ఏర్పడుతుందనే ప్రశ్నకు.. సంతృప్తికరమైన సమాధానం లేదు. ఆ అంశంపై పరిశోధన సాగిస్తున్నామని పీటర్స్‌ తెలిపారు.
 
మధుమేహ బాధితులు చేయకూడనివి
ధూమపానం, మద్యపానం అలవాటుంటే మానేయాలి. మహిళలకు ఈ అలవాటు ఉంటే వారికి మధుమేహం మరింత ప్రమాదం.
శరీరంలో కొవ్వు స్థాయులను పరీక్షించుకోవాలి. కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్త పడాలి.
రక్తంలో చక్కెరస్థాయులను పెంచే ఆహారపదార్థాలను తీసుకోవద్దు.
చేయాల్సినవి
పౌష్టికాహారం తీసుకోవాలి.
అధిక రక్తపోటు సమస్య ఉంటే దాన్ని అదుపులో ఉంచుకోవాలి.
నిత్యం వ్యాయామం చేయాలి. బద్ధకంగా ఒకేచోట కూర్చోకుండా చురుగ్గా ఉండాలి.