వ్యాయామమే మందు

ఆంధ్రజ్యోతి(24-10-2016): మధుమేహ వ్యాధిగ్రస్తులంతా ఎంతసేపూ మందుమాత్రలు సరిగా వేసుకుంటున్నామా లేదా? వేళకు ఇన్సులిన్‌ తీసుకుంటున్నామా లేదా అన్నదే చూస్తారు. కానీ, శరీరానికి సరిపడా వ్యాయామం లేకపోతే ఈ మందులు, ఇన్సులిన్‌ నిరుపయోగమైపోతాయనే విషయాన్ని వారిలో చాలా మంది గుర్తించరు. వ్యాయామం వల్ల కలిగే ఇతర ప్రయోజనాల మాట ఎలా ఉన్నా, రక్తంలోని గ్లూకోజ్‌ నిలువల్ని తగ్గించడంలో వ్యాయామం సమర్థవంతంగా వ్యవ హరిస్తుంది. వాస్తవానికి మదుమేహం ఒక వ్యాధి కాదు. మొత్తంగా శరీర జీవక్రియల్లో వచ్చే తే డాలే ఈ వ్యాధికి అసలు మూలంగా ఉంటాయి. జీవక్రియలను తిరిగి ఆరోగ్య స్థితికి తేవడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు వ్యాయామం తప్పనిసరని వైద్య నిపుణులు నొక్కి చెబుతుంటారు. వ్యాయామం వల్ల కలిగే ఇతర ప్రయోజనాల విషయానికొస్తే..

వ్యాయామం రక్తంలోని గ్లూకోజ్‌ను తగ్గిండంతో పాటు చెడు కొలెసా్ట్రల్‌ (ఎల్‌డిఎల్‌)ను కూడా తగ్గిస్తుంది. ఇది పరోక్షంగా గుండె జబ్బులు, పక్షవాత రోగాలను దూరంగా ఉంచుతుంది.

శరీరం బరువు పెరిగే కొద్దీ రక్తంలో గ్లూకోజ్‌ నిలువలు పెరుగుతాయి. వ్యాయామం వల్ల కేలరీలు ఖర్చయి శరీరం బరువు త గ్గడంతో గ్లూకోజ్‌ నిలువలు నియంత్రణలో ఉంటాయి.

ఆహార పానీయాల విషయంలో ఎంత నిష్టగా ఉన్నా, నిద్ర అంటూ కరువైతే అంతా వృధా అవుతుంది. వ్యాయామాల వల్ల నిద్ర బాగా పట్టడంతో శరీర వ్యవస్థ చక్కబడుతుంది.

మానసిక ఒత్తిళ్లు మనిషిని కుంగదీయడమే కాదు. హార్మోన్‌ వ్యవస్థను కూడా తీవ్రంగా దెబ్బ తీస్తాయి. గ్లూకోజ్‌ నిలువలు పెరగడానికి ఇదీ కారణమే. ఒత్తిళ్లను తగ్గించే వ్యాయామం వల్ల హార్మోన్‌ వ్యవస్థ చక్కబడటంతో గ్లూకోజ్‌ నిలువలు కూడా తగ్గుతాయి.

గ్లూకోజ్‌ జీవ క్రియలు అత్యధికంగా జరిగేది కండరాల్లోనే. అందుకే కండరాలు బలహీన పడిన మధుమేహులు ఎన్ని మందులు వాడినా షుగర్‌ నియంత్రణలోకే రాదు. అందువల్ల కండరాల్ని పటిష్టం చేసే వ్యాయామం ఏ రకంగా చూసినా వీరికి తప్పనిసరి.