‘కుంభకర్ణ నిద్ర’కు కారణం ఇదే...

17-4-15

 

ఈ కాలంలోనూ కుంభకర్ణుల్లా నిద్రపోయే వాళ్లూ ఉన్నారు. మన ఇళ్లలోనే ఎక్కువ సేపు నిద్రగానీ పోతే వెంటనే ఇంట్లో ఏంటి ఆ కుంభకర్ణుడి నిద్ర అంటూ అరుపులు వినిపించడం చూస్తుంటాం! ఏదైతేనేం గానీ.. కుంభకర్ణ నిద్రకు మాత్రం పరిశోధకులు కారణం కనుగొన్నారు. మన శరీరంలో ఆకలిని నియంత్రించే మెదడులోని ‘హైపోథాలమస్‌’ గ్రంథికి వాపు రావడమేనని తేల్చారు. ‘ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎండోక్రైనాలజీ, మెటబాలిజం’ అనే జర్నల్‌లో దీని గురించి ప్రచురించారు. మెదడులో కణతులు, క్షయ వంటి వ్యాధుల వల్ల లేదంటే తలకు గాయాలవడం మూలంగా దానికి వాపు వస్తుందని, దానిని నయం చేయొచ్చని ఈ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్‌ ఓం జె. లఖానీ చెప్పారు. ఆయన ఢిల్లీలోని సర్‌ గంగా రాం ఆస్పత్రిలో ఎండోక్రైనాలజిస్టు! అచ్చం కుంభకర్ణుడి లక్షణాలే కలిగిన ఓ యాభై ఏళ్ల రోగికి చికిత్స చేయడం ద్వారా ఈ విషయం తెలిసిందన్నారు. అతడూ రోజు మొత్తం నిద్ర పోయేవాడని.. లేవగానే తిండి గురించి అరచి.. గీ పెట్టేవాడని చెప్పారు. ఆ లక్షణాలకు కారణం ఆ గ్రంథిలో వాపు అని, ఆ వాపునకు బ్రెయిన్‌ ట్యూమర్‌ కారణం అని తెలుసుకున్నామని చెప్పారు. 

కణతిని తొలగించడం ద్వారా గ్రంథిని సాధారణంగా చేయగలిగామని, ఆ తర్వాత అతడు కోలుకున్నాడని లఖానీ చెప్పారు. అయితే అంతకుముందు దానికి కారణం హైపోథైరాయిడిజం (థైరాయిడ్‌ గ్రంథి లోపం) అని అధ్యయనాలు చెప్పినా.. ఊబకాయం కలిగించే ఈ లోపం ఒక్కదాని వల్లే అతినిద్ర సమస్య రాదని, ఆకలి తగ్గిపోదని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. అంతేగాక.. కుంభకర్ణుడు నిద్రలోంచి లేవగానే 2000 కుండల వరకూ నీళ్లు తాగేవాడని రామయణంలో ప్రతీతి.. అయితే అధిక దాహం.. మధుమేహ వ్యాధికీ చిహ్నం అని వైద్యులు చెబుతున్నారు. దాదాపు 30 శాతం మంది రోగుల్లో ఈ లక్షణాలు కనిపించాయంటున్నారు. కాగా, ఇంకో విషయమేంటంటే.. కుంభకర్ణుడి అలసట.. బడలికలకు కారణం.. తక్కువ మెటబాలిక్‌ రేట్‌, గ్రోత్‌ హార్మోన్‌, థైరాయిడ్‌ తదితర హార్మోన్ల లోపమే కారణమంటూ విశ్లేషిస్తున్నారు.