మందబుద్ధికి కారణమయ్యే వైరస్‌

02/12/14

గ్రాహణశక్తికి దోహదపడే జన్యుకణాలను మార్చడం ద్వారా మనుషులను మందబుద్దులుగా చేసే ఓ కొత్త వైరస్‌ను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. క్లోరోవైరస్‌ ఏటీసీవీ-1 గా వ్యవహరించే ఈ వైరస్‌ సహజంగా జలాశయాల్లో ఏర్పడే నాచు, నీటిలోపల పెరిగే మొక్కలలో కనిపిస్తుందని వారు చెప్పారు. ఈ మేరకు నెబ్రస్కా, జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా.. ఆరోగ్యవంతులైన 92 మంది వలంటీర్లలో ఈ వైరస్‌ జాడలను పసిగట్టేందుకు పరీక్షలు నిర్వహించారు.

ఇందులో 40 మందిలో ఏటీసీవీ-1 వైరస్‌ ఆనవాళ్లను కనుగొన్నామని వారు చెప్పారు. ఈ నలభైమంది వలంటీర్లు కంటి చూపునకు సంబంధించి జరిపిన పరీక్షలో మిగతా వారితో పోల్చితే పది శాతం వెనకబడి ఉన్నారని, దీనికి కారణం వైరసేనని వివరించారు. కాగా, ఈ వైరస్‌ను ప్రయోగశాలలోని ఎలుకలోకి ప్రవేశపెట్టి ఆపై దానిని ఓ బోనులో బంధించినట్లు తెలిపారు. సాధారణ ఎలుకలతో పోలిస్తే బోనులో నుంచి బయటపడేందుకు ఈ ఎలుక కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుందని వారు వివరించారు.