పాదాలకు ప్రత్యేక రక్షణ తప్పదు

21/05/14

 
మధుమేహం ఉన్నప్పుడు పాదాలను జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ చాలామంది ఈ విషయం పట్టించుకోరు.  మధుమేహం ఉన్నవారిలో ఒకసారి పుండు పుడితే మానడం అంత త్వరగా జరిగే పని కాదు. మధుమేహానికి సంబంధించిన పాదాల సమస్యల్లో 50శాతం ఈ నిర్లక్ష్య ధోరణి వల్లే వస్తున్నాయని అధ్యయనాలు చెబుతన్నాయి. మధుమేహాన్ని నియంత్రించడం కోసం క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకోవడం ఎంత అవసరమో ప్రతి రోజూ కాళ్లను పరిశీలించుకోవడం, రక్షణ సూత్రాలు పాటించడమూ అంతే అవసరం.
 
పదేళ్లకు పైగా మధుమేహం ఉన్నవారిలో సహజంగానే కాళ్లకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతుంటాయి. ప్రధానంగా కాళ్లలోని నరాలు, రక్తనాళాలు దెబ్బతింటాయి. వీటికి తోడు శరీరంలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. ఈ మూడింటి ఫలితంగానే పాదాల సమస్యలు ఏర్పడి ‘డయాబెటిక్‌ ఫుట్‌’ వ్యాధిగా మారుతుంది. అంటే పాదాలకు మధుమేహ సమస్య ఏర్పడుతుందన్నమాట.
రాత్రిపూట నిద్రలో కాళ్లు మంటగా అనిపించడం ఈ డయాబెటిక ఫుట్‌లోని ప్రధాన లక్షణం. ఈ సమస్య కారణంగా కాళ్లలో నరాలు దెబ్బతినటం వల్ల పాదాల్లో స్పర్శ తగ్గిపోతుంది. అలాంటి సమయంలో రోగి అనుభవాలు విచిత్రంగా ఉంటాయి. వాళ్లకు దూది మీద నడుస్తున్నట్టో లేదా ఇసుక మీద నడుస్తున్నట్టుగానో అనిపిస్తుంది. అంతేకాదు, అప్పుడప్పుడూ ముళ్ల మీద నడిచినంత బాధగా కూడా ఉంటుంది. గుండు సూదులు గుచ్చినట్టుగా అనిపించడం, చీమలు పాకుతున్నట్టు అనిపించడం, ఎక్కువగా తిమ్మిర్లు రావడం, కాలి చెప్పులు జారిపోతుండటం... ఇలాంటి అనేక సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. 
అయితే నరం మీద ఉండే మైలిన్‌ అనే పూత, నరం లోపల సంకేతాలను అటూ ఇటూ చేరవేసే ’యాక్సోప్లాజమ్‌’ పదార్థం పోవడం... మధుమేహ బాధితుల్లో నరాలు దెబ్బతినడానికి ప్రధాన కారణాలు. దీనివల్లే సంకేతాలకు అంతరాయం ఏర్పడుతుంది. సాధారణంగా నరాలు పని చేయడానికి ఎంతో కొంత శక్తి అవసరం. అందుకోసం ప్రతి నరానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు పనిచేస్తాయి. ఈ రక్తనాళాలు దెబ్బతినటం వల్లనే నరాలు సరిగా పనిచేయలేని స్థితిలోకి జారుకుంటాయి. ఫలితంగా కాళ్లకు స్పర్శ తగ్గుతుంది. దెబ్బ తగిలినా సరే, దాని తీవ్రత, బాధ పెద్దగా అర్థం కాదు. దాంతో వారిలో అశ్రద్ధ మొదలవుతుంది. పైగా దశాబ్ద కాలంగా మధుమేహంతో బాధపడే వాళ్లలో రక్తంలో కొవ్వు, చక్కెర నిల్వలు ఎక్కువగా ఉంటాయి గనక, సహజంగానే రక్తనాళాలు సన్నబడతాయి. దీనికితోడు రక్తనాళాల గోడలకు కొవ్వు పేరుకుపోయి కాళ్లకు రక్తం సరఫరా తగ్గిపోతుంది. ఎక్కువకాలం రక్తంలో నిలిచిపోయే చక్కెర వివిధ నాళాలతో, కణజాలంతో చర్యలు జరిపి వాటిని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా రక్తాన్ని సరఫరా చేసే గుండెకు కాళ్లు చాలా దూరంలో ఉంటాయి. కాబట్టి కాళ్లకు రక్తం అందే పరిమాణం తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి పరిణామాలన్నీ కలిసి పాదంలో మధుమేహ సమస్యను మరింత జటిలం చేస్తాయి.
ఎలా గుర్తించాలి?
కాళ్లలో రక్త ప్రసరణ తగ్గుతోందా? సరిగానే ఉందా? అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి చీలమండలం దగ్గర రక్తపోటు ఎలా ఉంది? మోచేతి దగ్గర రక్తపోటు ఎలా ఉంది? అనే విషయాలను కొలిచి నిర్ధారించుకోవాలి. చేతుల్లో ఉండే రక్తపోటు కంటే కాళ్లలో ఉండే రక్తపోటు తక్కువగా ఉండకూడదు. దీన్ని కొలవడానికి ‘డాప్లర్‌’ అనే ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. దానితో రక్తనాళాల్లోని పీడనం, రక్త వేగాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ పరికరం అందుబాటులో లేకపోతే వైద్యుల దగ్గరుండే సాధారణ మిషన్ల సహాయంతో కూడా రక్తసరఫరా వేగాన్ని కొలువవచ్చు. ప్రతి సంవత్సరం డాప్లర్‌ పరీక్ష చేయించుకుంటూ రక్తప్రసరణ ఎలా ఉందో తెలుసుకోగలిగితే కాళ్లలో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. అసలు మొదట్లోనే ఈ విషయాన్ని తెలుసుకోగలిగితే పాదాల్లో ఏర్పడే మఽధుమేహాన్ని సులభంగా నివారించవచ్చు.
ఇన్సులిన్‌ అవసరమే....
మధుమేహ రోగుల శరీరంపై పుండు ఏర్పడి త్వరగా మానకుంటే అది నయం అయ్యే వరకూ ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ తీసుకోవడం ముఖ్యం. అలా చేస్తే గాయం త్వరగా మానే అవకాశం ఉంటుంది. గాయమైనప్పుడు విశ్రాంతిగా ఉంటారు కాబట్టి ఆ సమయంలో శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టే ఇన్సులిన్‌ తీసుకోవడం చాలా అవసరం. 
ప్రత్యేక చెప్పులు ఎందుకంటే....
మధుమేహం దీర్ఘకాలంగా ఉన్నప్పుడు పాదాలపై చర్మం మరీ పలుచగా తయారవుతుంది. పైగా కాళ్లకు స్పర్శ సరిగా తెలియదు. కాబట్టి పాదాలకు సరైన రక్షణ అవసరం. అందుకే మధుమేహ బాధితులు సున్నితమైన చెప్పులు వాడటమే మంచిదని వారికోసం ప్రత్యేకమైన పాదరక్షలు తయారు చేశారు కొందరు నిపుణులు. ఈ ప్రత్యేకమైన పాదరక్షల్లో మూడు భాగాలుంటాయి. కింద తేలికైన, దుృఢమైన పాలియురెధెన్‌ సోల్‌ వాడుతారు. దీనివల్ల మేకులు, ముళ్ల వంటివి గుచ్చుకునే అవకాశం ఉండదు. రెండో రకం... పాదం చెప్పుకు ఆనుకునే భాగంలో మైక్రోసెల్‌ పాలిమర్‌, మైక్రోసెల్‌ రబ్బర్‌ ఇన్‌సర్ట్‌ వాడుతారు. దీనివల్ల పాదంపై ఒత్తిడి తగ్గుతుంది. ఇక, మూడోది లెదర్‌గానీ, కుట్టుగానీ పాదానికి తగలకుండా పైనంతా క్రాస్‌లింక్‌ పాలిమర్‌ షీట్‌తో లైనింగ్‌ ఇస్తారు. దీనివల్ల పాదానికి పైనా, కిందా ఎక్కడ కూడా రాపిడి లేదా గరకుదనం తగలదు. వీటన్నిటికీ తోడు కాలు గాయాలపాలవకుండా, పుండు పడకుండా చూసుకుంటే మరింత బాగుంటుంది.