‘షుగర్‌’ పెంచని బియ్యం!

 

‘మెరుగైన సాంబ మసూరి’ అభివృద్ధి
సీసీఎంబీ, ఐఐఆర్‌ఆర్‌ సంయుక్త పరిశోధన
వంగడాలన్నింటిలోకీ తక్కువ గ్లైసీమిక్‌ ఇండెక్స్‌
సాధారణ సాంబమసూరిలో 52.9 నుంచి 69 శాతం
కొత్త వంగడంలో కేవలం 50.99 శాతమే
ఆరు రాష్ట్రాల్లో 1.30 లక్షల హెక్టార్లలో సాగు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మధుమేహ బాధితులకు శుభవార్త! ఇష్టమైన వరి అన్నాన్ని తినాలని ఎంత కోరిక ఉన్నా.. షుగర్‌ కారణంగా దాన్ని మానేసి వైద్యులు చెప్పినట్టు జొన్న అన్నమో, జొన్న రొట్టెలో ఇతరత్రా చిరుధాన్యాలతో చేసిన ఆహారపదార్థాలో తీసుకునేవారి చవులను ఊరించే వార్త!! వరి అన్నం తిన్నప్పటికీ షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా పెరగని కొత్తరకం వరి వంగడాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపయోగపడే ఇంప్రూవ్డ్‌ సాంబ మసూరి (ఐఎ్‌సఎం) వరి వంగడాన్ని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌(ఐఐఆర్‌ఆర్‌) సంయుక్తంగా అభివృద్ధి చేసినట్లు సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ కుమార్‌ మిశ్రా తెలిపారు.
 
సోమవారం హైదరాబాద్‌లోని సీసీఎంబీ కార్యాలయంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. సాధారణ సాంబమసూరి రకంలో గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ (జీఐ) 52.9 నుంచి 69 శాతం దాకా ఉంటుందని, కానీ ఐఎ్‌సఎంలో అది కేవలం 50.99 శాతం మాత్రమే ఉంటుందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) తేల్చిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గడ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లలో 1.30 లక్షల హెక్టార్లలో ఐఎ్‌సఎం వంగడాన్ని ప్రయోగాత్మకంగా సాగుచేయగా.. ఎకరాకు 35 నుంచి 37 బస్తాల దిగుబడి వచ్చిందని వెల్లడించారు. ఈ వంగడం రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో సీసీఎంబీ, ఐఐఆర్‌ఆర్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ రమేశ్‌ సొంటి, డాక్టర్‌ అనంతకుమార్‌, డాక్టర్‌ సుబ్బారావు, డాక్టర్‌ బాలచందర్‌ తదితరులు పాల్గొన్నారు.
 
ఇవీ ప్రత్యేకతలు
  • సాధారణ వరితో పోలిస్తే ఐఎ్‌సఎం ప్రత్యేకతలను సీసీఎంబీ చీఫ్‌ సైంటిస్ట్‌ రమేష్‌ సొంటి ‘ఆంధ్రజ్యోతి‘కి వివరించారు.
  • సాధారణ వరి వంగడంలో ఎండాకు తెగులు అతి పెద్ద సమస్య. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు బిహార్‌, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, యూపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ తెగులుతో రైతులు పంటను పెద్దఎత్తున నష్టపోతున్నారు. ఐఎస్‌ఎం రకంలో ఎండాకు తెగులును తట్టుకునే జన్యువును చొప్పించారు. దీంతో ఇది ఎండాకు తెగులను సమర్థంగా ఎదుర్కొంటుంది. ఎండాకు తెగులు అధికంగా వచ్చే ప్రాంతాల్లో రైతులు ఐఎస్‌ఎం రకాన్ని ధైర్యంగా వేసుకోవచ్చు.
  • సాధారణ వరి రకానికి వరి కాండం సన్నగా ఉంటుంది. దీంతో గాలులు అధికంగా వీచినా పంట నష్టం సంభవిస్తుంది. ఐఎస్ఎం రకం వరి కాండం మందంగా ఉంటుంది. దీంతో గాలుల ప్రభావం పంటపై ఉండదు.
  • సాంబమసూరితో పోలిస్తే ఐఎ్‌సఎం రకం 7 నుంచి 10 రోజులు తక్కువగా కోతకు వస్తుంది. విత్తనాలు నేరుగా చల్లడం ద్వారా ఇంకో వారం రోజులు తక్కువ సమయంలో దిగుబడి వస్తుంది.
ఏమిటీ గ్లైసీమిక్‌ ఇండెక్స్‌..?
ఆహారం తిన్న తర్వాత అది ఎంత సేపటికి రక్తంలో చక్కెరగా మారుతుందో తెలిపేదే గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ (జీఐ). మనం తిన్న పదార్థం వేగంగా చక్కెరగా మారితే హైగ్లైసీమిక్‌ ఇండెక్స్‌ ఆహారంగా.. నెమ్మదిగా మారితే లోగ్లైసీమిక్‌ ఇండెక్స్‌ ఆహారంగా పరిగణిస్తారు. వరి అన్నం హైగ్లైసీమిక్‌ ఇండెక్స్‌ ఆహారం. వరితో పోలిస్తే జొన్న లో-జీఐ కలిగి ఉంటుంది. జొన్న కన్నా కొన్ని రకాల చిరుధాన్యాలు ఇంకా మంచివి. అందుకే మధుమేహ బాధితులను అన్నం మానేసి జీఐ తక్కువ ఉన్న ఆహారం తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే.. కొత్త వంగడం లో-జీఐ కలిగి ఉన్నందున రక్తంలోకి షుగర్‌ నెమ్మదిగా విడుదల అవుతుంది. దీంతో మధుమేహం ఉన్నవారు భుజించవచ్చు. దీనిని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు బెంగళూరుకు చెందిన ఒక సంస్థ ఇప్పటికే అనుమతులు పొందిందని, మరిన్ని సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.