భోజనంతో మధుమేహానికి అడ్డుకట్ట

22-11-2018: చక్కెర తీపి జ్ఞాపకమే గానీ వంట్లో షుగర్‌ వస్తే? శరీరానికి తగ్గ బరువు ఉండొచ్చు గానీ ఊబకాయం వస్తే? మానసిక వ్యధే! ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందిని ఈ రుగ్మతలు వేధిస్తున్నాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు తెలుగు రాష్ట్రాల్లో ‘వీరమాచినేని’ డైట్‌కు వచ్చిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ‘దీక్షిత్‌’ పేరుతో ఒక వీరమాచినేని వెలుగులోకి వచ్చారు. మధుమేహం రాకుండా ఉండేందుకు ఆయన సూచించే డైట్‌ను వేల సంఖ్యలో పాటిస్తున్నారు. పదేళ్లుగా ఆయన చేపట్టిన ఉద్యమానికి వివిధ సామాజిక మాధ్యమాల్లోనే కాకుండా వాట్సాప్‌లోనే 250 గ్రూపులు ఉన్నాయి. 37 దేశాల్లో 50వేల మంది ‘దీక్షిత్‌’ డైట్‌ను అనుసరిస్తుండటం విశేషం.
 
ఊబకాయం కూడా మటుమాయం!..
వీరమాచినేని మాదిరే ‘దీక్షిత్‌’ డైట్‌
ఈ వ్యాధుల నియంత్రణకు ఆయనే మహారాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌
 
ఏమిటీ దీక్షిత్‌ డైట్‌?
రక్తంలో ఇన్సులిన్‌ స్థాయి పెరిగితే ఆరోగ్య సమస్యలొస్తాయి. ఆ సమయంలో శరీరం గ్లూకోజ్‌ను శక్తిగా గ్రహిస్తుంది. ఇన్సులిన్‌ స్థాయి పడిపోతే శరీరం శక్తికోసం ఫ్యాటీ యాసిడ్స్‌ను తీసుకుంటుంది. ఇన్సులిన్‌ స్రవాలను నియంత్రించడం సాధ్యం కాదు. కాకపోతే తిన్న తర్వాత ఇన్సులిన్‌ ఎక్కువగా స్రవిస్తుంది కాబట్టి.. తిండిని నియంత్రిస్తే దాని పని పట్టవచ్చు అనేది ‘దీక్షిత్‌’ ఆలోచన. అందుకే ఆయన రోజుకు రెండుసార్లే భోజనం చేయమని చెబుతున్నారు. అందులో ఒకటి బాగా ఆకలి వేసినప్పుడే చేయాలి. రెండు భోజనాల మధ్యలో నీళ్లు, పల్చటి మజ్జిగ, గ్రీన్‌ లేదా బ్లాక్‌ టీ (షుగర్‌ లేకుండా), కొబ్బరి నీళ్లు లేదా ఒక టమోటా తీసుకోవాలని సూచిస్తున్నారు.
 
ఎవరీ దీక్షిత్‌?
దీక్షిత్‌ అసలు పేరు డాక్టర్‌ జగన్నాథ్‌ దీక్షిత్‌. వైద్య విద్యలో 26 ఏళ్ల అనుభవం ఉంది. లాతూర్‌ వైద్య కళాశాలలో క మ్యూనిటీ మెడిసిన్‌ హెచ్‌వోడీ. మహారాష్ట్ర లో షుగర్‌ వ్యాధి నియంత్రణకు చేపట్టిన కార్యక్రమాలకు ఆయనే బ్రాండ్‌ అంబాసిడ ర్‌. వాస్తవానికి డాక్టర్‌ శ్రీకాంత్‌ జిఖర్‌ 19 97-2004 మధ్య ఒక డైట్‌ ప్లాన్‌ సూచించా రు. ప్రస్తుతం ఆయన లేరు. కానీ ఆయన సూచించిన ఆహార నియమాలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు దీక్షిత్‌.

7.4 కోట్లు.. ప్రస్తుతం భారత్‌లో మధుమేహుల సంఖ్య

10 కోట్లు.. 2030 నాటికి టైప్‌-2 షుగర్‌ వచ్చే అవకాశం ఉన్నవారు
3 కోట్లు.. ప్రస్తుతం ఊబకాయంతో బాధపడుతున్న వారు
7 కోట్లు.. 2025 నాటికి పెరిగే ఊబకాయుల సంఖ్య