షుగర్‌ ఉన్నవాళ్లు వేసవిలో ఏం చేయాలంటే..

25-05-2019: వేసవి వెతలు మధుమేహులకు ఎక్కువ. ఈ కాలంలో తీసుకునే ఆహారం మొదలు, మందుల వరకూ మధుమేహులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఎండ వేడి, వడగాడ్పుల ప్రభావం నుంచి కాపాడుకుంటూ రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు సమంగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి.
 
మామిడి పండ్లు మితంగా తినవచ్చు: వేసవిలో వచ్చే మామిడి పండ్లు తినాలని మధుమేహులూ ఆశ పడతారు. అయితే మధుమేహం ఉంది కాబట్టి ఈ పండ్లకు దూరంగా ఉండవలసిన అవసరం లేదు. మరీ మగ్గిన పండు కాకుండా దోరగా ఉన్న కొన్ని ముక్కలను తినవచ్చు. మామిడి పండు తిన్న సమయంలో ఇతర కార్బొహైడ్రేట్లు తగ్గించుకోవాలి. వైద్యుల సూచన తీసుకోవడమూ అవసరమే! మామిడి పండుకు బదులు రసం తాగుదాం అనుకోకూడదు. అలాగే మిల్క్‌షేక్‌ కూడా తాగకూడదు. పళ్లరసాలు, మిల్క్‌షేక్‌లలో పీచు పదార్థం ఉండదు. పైగా గ్లూకోజ్‌ స్థాయుల్లో తీవ్ర ఒడిదుడుకులు కలుగజేస్తాయి. శరీర బరువునూ పెంచుతాయి. కాబట్టి మామిడి పడ్లరసం, చెరుకురసం లాంటివి తాగకూడదు.
 
డయాలసి్‌సలో ఉంటే: మూత్రపిండాల సమస్యలు ఉన్నా, డయాలసిస్‌ తీసుకుంటున్నా, తక్కువ పొటాషియం ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇలాంటి వారు పొటాషియం ఎక్కువగా ఉండే మామిడి పండు తినే విషయంలో వైద్యుల సలహా తప్పక తీసుకోవాలి. కొబ్బరి నీరు తాగినా పొటాషియం, గ్లూకోజ్‌ స్థాయిలు పెరిగిపోతాయి. కాబట్టి వైద్యులను సంప్రతించకుండా వీటిని తీసుకోకూడదు.
 
మందులు భద్రంగా: ఎలాంటి మందులైనా చల్లని, పొడి వాతావరణంలో, ఎండ నేరుగా సోకకుండా జాగ్రత్త చేయాలి. అయితే వేసవిలో ఇన్సులిన్‌ మందుల ప్రభావం తగ్గకుండా ఉండాలంటే, వాటిని ఫ్రిజ్‌లో భద్రపరచాలి. ఒకవేళ ప్రయాణం చేయవలసివస్తే, మందుల షాపుల్లో దొరికే ఐస్‌ప్యాక్స్‌, లేదా ఐస్‌ క్యూబ్‌లు నింపిన థర్మాస్‌ ఫ్లాస్క్‌లో మందులు తీసుకుని వెళ్లవచ్చు. కొంతమంది కారులోనే మందులను
వదిలేస్తూ ఉంటారు. కానీ ఎండ వేడిమి పెరిగిపోతున్న వేసవి నెలల్లో కార్లలోని ఎయిర్‌ కండిషనర్లు సక్రమంగా పని చేయక మందులు
ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
 
పాదాలు జాగ్రత్త: వేసవిలో చెప్పులు లేకుండా నడవడం మరింత ప్రమాదకరం. వేడిగా ఉన్న నేల మీద నడవడం వల్ల అరికాళ్లు బొబ్బలు, పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇవి మధుమేహులకు అంత త్వరగా మానవు. అప్పటికే రక్తనాళాలు దెబ్బతిని, డయాబెటిక్‌ న్యూరోపతి మందులు వాడుతున్నవారికి ఇలా జరిగితే తీవ్ర పరిమాణాలు తప్పవు. కాబట్టి ఆలయాలు లాంటి చెప్పులు ధరించే వీలు లేని ప్రదేశాల్లో సైతం మందపాటి సాక్స్‌లు ధరించి నడవాలి.
 
ఓ.ఆర్‌.ఎస్‌ వద్దు: వేసవిలో డీహైడ్రేషన్‌ బారిన పడితే మధుమేహులు ఓ.ఆర్‌.ఎస్‌ తాగకూడదు. దానిలో గ్లూకోజ్‌ ఉంటుంది కాబట్టి దానికి బదులుగా శుభ్రమైన ఫిల్టర్‌ నీరు మాత్రమే తాగాలి.

వేడి లేని చోట వ్యాయామం: వేసవిలో సాయంత్రం వేళ వేడి తగ్గిన తర్వాత మాత్రమే ఆరుబయట వ్యాయామాలు చేయాలి. లేదా ఎయిర్‌ కండిషనర్‌ ఉన్న గదుల్లో, జిమ్‌లో వ్యాయామాలు చేయవచ్చు.

అలాకాకుండా వేడి వాతావరణంలో వ్యాయామాలు చేస్తే, డీహైడ్రేషన్‌తో పాటు, అలసట, కండరాలు తిమ్మిరెక్కడం, వడదెబ్బకు గురవడం లాంటి సమస్యలు తప్పవు.
 
వెంట తీసుకెళ్లాల్సినవి: వేసవి సెలవుల్లో భాగంగా ఊర్లకు వెళ్లే సమయంలో గ్లూకోమీటరు స్ట్రిప్స్‌, లాన్‌సెట్స్‌, ఇన్సులిన్‌, సూదులు మొత్తం సెలవులకు సరిపడా వెంట తీసుకెళ్లాలి. విమానాశ్రయాల్లో కస్టమ్స్‌, సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తకుండా సరైన స్టాంప్‌ కలిగిన మెడికల్‌ ప్రిస్ర్కిప్షన్‌ వెంట ఉంచుకోవాలి.
 
ఉపవాసాల్లో: ఉపవాసాలు ఉండే మధుమేహులు ఉపవాసాలకు కొద్ది వారాల ముందు నుంచే అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత వైద్యులను సంప్రతించి, నోటి ద్వారా తీసుకునే మందులు, లేదా ఇన్సులిన్‌ మోతాదులను తదనుగుణంగా మార్చుకోవాలి. రోజులో ఉపవాసాన్ని విరమించిన సమయంలో డీహైడ్రేషన్‌కు గురి కాకుండా తగినన్ని ద్రవాలు తీసుకోవాలి. ముతక బియ్యం, తక్కువ కొవ్వు కలిగిన పాలు, గోధుమపిండి రొట్టెలు తీసుకోవాలి. బిరియాని, హలీం లాంటి వంటకాలు పరిమితంగా తినాలి.
 
డాక్టర్‌ రవి శంకర్‌ ఎరుకులపాటి, సీనియర్‌ ఎండోక్రైనాలజిస్ట్‌,
అపోలో హాస్పిటల్స్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.