మధుమేహ రోగులకు శుభవార్త

గాయమైనా భయపడక్కరలేదు
త్వరగా నయం చేసే బ్యాండేజ్‌ తయారీ
మద్రాసు ఐఐటీ శాస్త్రవేత్తల ఘనత
ఆంధ్రజ్యోతి, 08-05-2018: కాలిపైనో.. చేతిపైనో చిన్న దెబ్బ తగిలినా మధుమేహ రోగులకు ప్రమాదమే! అది తగ్గేదాకా ఆందోళనే. ఎందుకంటే.. సామాన్యులకు పది రోజుల్లో తగ్గే గాయాలు మధుమేహ రోగులకు తగ్గటానికి రెట్టింపు సమయం పడుతుంది. కొన్నికొన్నిసార్లు చిన్న చిన్న గాయాలే పెరిగి ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. మధుమేహ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనటానికి మద్రాసు ఐఐటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన బ్యాండేజ్‌ను తయారుచేశారు. ఈ బ్యాండేజ్‌ను కట్టుకుంటే గాయం మానటానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఈ తరహా బ్యాండేజ్‌ను తయారుచేయటం మన దేశంలో ఇదే తొలిసారి.
మధుమేహ రోగులలో బ్లడ్‌ గ్లూకోజ్‌ శాతం సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటుంది. షుగర్‌ లెవెల్స్‌ ఎక్కువ కాలంపాటు అలాగే ఉంటే క్రమంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దాని ప్రభావం రక్తప్రసరణపై పడుతుంది. ‘మామూలుగా మనకు గాయం అయినప్పుడు రోగనిరోధక వ్యవస్థ వెంటనే పనిచేయటం మొదలుపెడుతుంది. రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే రక్త ప్రసరణ సరిగ్గా ఉండాలి. అప్పుడే ఆ ప్రాంతంలో కొత్త చర్మం వస్తుంది. మధుమేహ రోగులకు గాయమైతే.. వారిలో రక్తప్రసరణ సరిగ్గా ఉండకపోవడం వల్ల గాయమైన చోట చర్మం ఏర్పడటానికి ఎక్కువ సమయం పడుతుంది. చర్మం ఏర్పడకపోతే గాయం పూర్తిగా నయమయినట్లు కాదు. కొన్నిసార్లు గాయం అయిన ప్రాంతంలో వచ్చే ఇన్‌ఫెక్షన్లు ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తాయి. అప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది’’ అని డాక్టర్‌ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ‘‘ఈ సమస్యను పరిష్కరించడానికి మేమొక వినూత్నమైన పద్ధతి కనిపెట్టాం. గ్రాఫైన్‌ ఆక్సైడ్‌, నానో టెక్నాలజీల మిశ్రమంతో మేము రూపొందించిన బ్యాండేజీ ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొంటుంది’’ అని మద్రాసు ఐఐటీలోని బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ప్రొఫెసర్‌ విఘ్నేశ్‌ ముత్తువిజయన్‌ ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు.
 
తయారీ ఇలా..
మన గాయాలను నయం చేసే శక్తి గ్రాఫైట్‌కు ఉంది. ‘‘దీనినే మేము ఆలంబనగా తీసుకున్నాం. గ్రాఫైన్‌ ఆక్సైడ్‌ను సూర్యరశ్మిలో ఉంచినప్పుడు అందులోని గ్రాఫైన్‌ శాతం తగ్గుతుంది. దీనిని మేము సిసిలియం అనే మరో ద్రావకంతో కలిపాం. ఈ రెండింటినీ నానో టెక్నాలజీ ద్వారా రూపొందించిన బ్యాండేజీపై పూత పూస్తాం’’ అని తాము రూపొందించిన బ్యాండేజీ గురించి విఘ్నేశ్‌ వివరించారు. ఈ బ్యాండేజీని గాయాలపై కట్టినప్పుడు.. దీనిలో ఉండే రసాయనాలు గాయాన్ని త్వరగా మాన్పటానికి ఉపయోగపడే ఫైబ్రోబాస్ట్‌ కణాలను ప్రేరేపిస్తాయి. దీని వల్ల గాయాలు త్వరగా మాని కొత్త చర్మం ఏర్పడుతుంది.