కృత్రిమ స్వీటెనర్లతో మధుమేహం ముప్పు

మెల్‌బోర్న్‌, డిసెంబరు 18: లో కేలరీ కృత్రిమ చక్కెర(స్వీటెనర్‌)ను వినియోగించే వారికి చేదు కబురు!! దీన్ని వినియోగించేవారికి టైప్‌-2 మధుమేహం, అధిక బరువు ముప్పు ఉండొచ్చని దక్షిణ ఆస్ట్రేలియా వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అధ్యయనంలో భాగంగా స్వీటెనర్‌ వాడే 5000 మంది ఆరోగ్య ఫలితాలను కొన్నేళ్ల పాటు సేకరించి విశ్లేషించారు. పలు రకాల స్వీటెనర్ల ప్రభావంతో శరీరంలోని గట్‌(హానిచేయని) బ్యాక్టీరియా స్వరూప స్వభావాల్లో మార్పులు జరుగుతున్నట్లు గుర్తించారు. ఆ ప్రభావంతో శరీర బరువు పెరుగుతోందని పేర్కొన్నారు. స్వీటెనర్‌కు అలవాటుపడిన వృద్ధులకు జ్ఞాపకశక్తి తగ్గడం, గుండెపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చన్నారు. బేకరీల ఉత్పత్తుల్లోనూ స్వీటెనర్ల వాడకం అధికంగా ఉంటుంది.