దంతాలు మెరవాలంటే..

20-4-15,ఆంధ్రజ్యోతి,
ఆహారపుటలవాట్లు, శభ్రత లేమి వల్ల దంతాలు రంగుమారతాయి. తెల్లగా ఉండాల్సిన పలువరుస పసుపు రంగులోకి మారిపోతుంది. దాంతో ముఖాకర్షణ తగ్గుతుంది. దంతాలను తిరిగి మెరిపించాలంటే ఈ చిట్కాలు పాటించాలి.

 
స్ట్రాబెర్రీలు తినండి: స్ర్టాబెర్రీల్లోని మాలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ సిలు దంతాలను తెల్లగా మార్చే గుణాలు కలిగి ఉంటాయి. ఈ పండ్లలోని యాంస్ట్రింజెంట్‌ దంతాల మీద మచ్చలను తొలగిస్తుంది. విటమిన్‌ సి గారను తొలగిస్తుంది. స్ర్టాబెర్రీలను గుజ్జుగా చేసి వారానికి రెండుసార్లు దంతాలను తోముకుంటే దంతాలు క్రమంగా తెల్లబడతాయి. వీటిని తినేటప్పుడు కూడా బాగా నమలితే కూడా అదే ఫలితం దక్కుతుంది.

టీత్‌ ఫ్లాసింగ్‌: బ్రషింగ్‌ కంటే ఫ్లాసింగ్‌ ముఖ్యమైనదని వైద్యులు చెప్తున్నా ఫ్లాసింగ్‌ పట్ల ఎవరూ ఆసక్తి కనబరచరు. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి రెండుసార్లు ఫ్లాసింగ్‌ చేయాలి. ఇలా చేయటం వల్ల దంతాల మధ్య ఇరుక్కునే ఆహార పదార్థాలు తొలగి గార ఏర్పడకుండా ఉంటుంది. పళ్లు తెల్లగా ఉంటాయి.

బేకింగ్‌ సోడా, నిమ్మరసం: బేకింగ్‌ సోడా, నిమ్మరసం మధ్య జరిగే రసాయనిక చర్య ఫలితంగా దంతాలు తెల్లబడతాయి. ఈ రెండిటిని కలిపి వారానికోసారి బ్రష్‌తో అద్దుకుని దంతాలు రుద్దుకోవాలి. పదే పదే వాడితే దంతాల మీద ఎనామిల్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి వారానికి ఒక్కసారే ఉపయోగించాలి. బేకింగ్‌ సోడా, నిమ్మరసాలను కలిపి దంతాలకు పట్టించి ఒక నిమిషం తర్వాత బ్రష్‌తో సున్నితంగా రుద్దుకుని కడిగేసుకోవాలి. నిమిషంకంటే ఎక్కువ సమయంపాటు ఈ మిశ్రమాన్ని దంతాల మీద ఉంచకూడదు.

కరకరలాడే పళ్లు, కూరగాయలు: యాపిల్స్‌, క్యారెట్స్‌, చెరకులను తరచుగా తింటూ ఉండాలి. వీటి వల్ల దంతాల మీద పేరుకున్న గార, మచ్చలు వదిలిపోతాయి. ఈ పళ్లలోని యాసిడ్లు దంతాలను తెల్లగా మారుస్తాయి. యాపిల్స్‌లోని మాలిక్‌ యాసిడ్‌ దంతాలను శుభ్రం చేసి మెరిసేలా చేస్తుంది.
ఆయిల్‌ పుల్లింగ్‌: ఆర్గానిక్‌ ఆయిల్‌ను నోట్లోకి తీసుకుని 15 నుంచి 20 నిమిషాలపాటు పుక్కిలించి ఉమ్మేయాలి. తర్వాత నోటిని శుభ్రంగా కడిగి 3 గ్లాసుల నీరు తాగాలి. నూనెను పుక్కిలించేటప్పుడు దంతాల మధ్య నుంచి నూనె వెళ్లేలా నాలుకను కదిలించాలి. అలా నోరు మొత్తం నూనెను తిప్పుతూ దంతాలన్నిటికీ తగిలేలా పుక్కిలించాలి. 
బత్తాయి తొక్కతో: ప్రతిరోజూ రాత్రి నిద్రకుముందు బత్తాయి తొక్కతో దంతాలు రుద్దుకున్నా ప్రయోజనం ఉంటుంది. ఇలా కొన్ని వారాలపాటు క్రమంతప్పక చేస్తే ఫలితం కనిపిస్తుంది.
హైడ్రోజెన్‌ పెరాక్సైడ్‌: ముందుగా హైడ్రోజెన్‌ పెరాక్సైడ్‌ ఉన్న మౌత్‌వా్‌షతో నోరు పుక్కిలించాలి. లేదా బేకింగ్‌ సోడా, హైడ్రోజెన్‌ పెరాక్సైడ్‌ కలిపి దాంతో బ్రష్‌ చేసుకోవాలి. తర్వాత టూత్‌ పేస్ట్‌తో దంతాలు రుద్దుకుని శుభ్రం చేసుకోవాలి.