26-02-2018: నోరు, జీర్ణవ్యవస్థకు ముఖ ద్వారం. అందుకే నోటినోని ఏ భాగం వ్యాధిగ్రస్తమైనా దాని ప్రభావం, మన జీర్ణవ్యవస్థ మీద తప్పనిసరిగా పడుతుంది. చిగుళ్ల మీద పుండ్లు ఏర్పడి బ్యాక్టీరియాతో వ్యాధిగ్రస్తమై చీము పట్టినా, పళ్లల్లో రంద్రాలు ఏర్పడినా, పళ్లు పుచ్చిపోయినా, ఇలా నోటిలోని ఏ భాగంలో అల్సర్లు ఏర్పడినా జీర్ణవ్యవస్థ అంతా కలుషితమవుతుంది. దీనికి తోడు నోటిలో లాలాజలం సరిగా స్రవించకపోయినా, లాలాజలంలో వివిధ జీర్ణ రసాయనాలు సరైన నిష్పత్తిలో లేకపోయినా, జీర్ణశక్తి కుంటుపడుతుంది.
శస్త్రచికిత్స లేకుండానే.....
నాలుక కింద, బుగ్గల లోపలి భాగంలో, చిగుళ్లమీద, గొంతులో నోటిలో ఎక్కడైనా ఒక చోట గానీ, ఎక్కువ చోట్ల గానీ ఏర్పడే పుండ్లను అల్సర్లు అంటారు. ఇతర వైద్య విధానంలో వీటన్నింటికీ యాంటీబయాటిక్స్ వాడతారు. వ్యాధి యాంటీబయాటిక్స్‌కు లొంగనప్పుడు, నయం చేసే మరో మార్గమేదీ లేదనిపించినప్పుడు శస్త్ర చికిత్సకు సిద్ధమవుతారు. అయితే శస్త్రచికిత్సల వల్ల దంతాలను స్థిరంగా ఉంచే చిగుళ్లు కిందికి జారిపోతాయి. ఈ క్రమంలో చిగుళ్లను, పళ్లను, పట్టి ఉంచే పునాది ఎముకలు మరింత బలహీనపడే అవకాశం ఉంది. చిగుళ్లను, ఎముకలను తమ తమ ఔషధాలతో కాపాడలేనప్పుడు ఇక శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమనుకుంటారు. అయితే సకాలంలో మూలికా వైద్యులను సంప్రదిస్తే, ఈ శస్త్ర చికిత్సల అవసరమే ఉండదు.
పంటినొప్పి కాస్త తీవ్రం కాగానే ఆ పన్నును తీసివేసే విధానాన్నే చాలా మంది అనుసరిస్తున్నారు. లేదా రూట్ కెనాల్ చికిత్సలు చేస్తున్నారు. అయితే ఈ రూట్ కెనాల్ చికిత్సల వల్ల అనేక రుగ్మతలు వస్తున్నట్లు పశ్చిమదేశాల వైద్యులే ఒప్పుకున్నారు. ప్రత్యేకించి, గుండె, మూత్రపిండాలు, కాలేయం, గాల్‌బ్లాడర్ (పిత్తాశయం) వీపు, మెడ, భుజం నొప్పులు, కొన్ని రకాల చర్మ వ్యాధులు ఈ రూట్‌కెనాల్ చికిత్సల వల్లే వస్తున్నట్లు వారు గుర్తించారు. అయితే, మూలికా వైద్యం పూర్తిగా భిన్నమైనది. ఇది, పంటి చిగుళ్ల, పంటి ఎముకల వ్యాధులను పూర్తిగా నయం చేయడమే కాకుండా, చిగుళ్ల సమస్యలు, దంత వ్యాధులు అసలే ఉత్పన్నం కాకుండా చేసే ఔషధాలు ఈ మూలికా వైద్యంలో ఉన్నాయి.
ఈ వ్యాధుల వెనుక
నిజానికి, చిగుళ్ల సమస్యలు, దంత వ్యాదులు తలెత్తడానికి గల అసలు కారణం మన ఆహార పానీయాల అలవాట్లు, దంత దావనం, నోటి ప్రక్షాళనలోని లోపాలే కారణం. రాత్రి నిద్రపోయే ముందు బ్రష్ చేసుకోకపోవడం, ఔషధ మిళిత మౌత్‌వాష్‌లతో పుక్కిలించడం మాట అలా ఉంచి, సాధారణ నీళ్లతోనైనా నోరు శభ్రం చేసుకోకపోవడం మౌలిక కారణాలుగా ఉంటున్నాయి. దీనివల్ల ఆహార పదార్థాల అవశేషాలు, పళ్ల మధ్య ఇరుక్కుపోయి కుళ్లడం, ఇవన్నీ దంతాలు, చిగుళ్లు తరుచూ వ్యాధిగ్రస్తం కావడానికి కారణమవుతున్నాయి.
ఇవీ జాగ్రత్తలు
చిగుళ్లు, దంతాలు వ్యాధిగ్రస్తం కాకుండా ఉండడానికి, ఆహారం, ఇతర పానీయాలు తీసుకున్న ప్రతిసారీ టంగ్ క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోవాలి. దీనికి తోడు చిగుళ్లను వేళ్లతో గట్టిగా నొక్కి, ఆ తర్వాత చిగుళ్లతో పాటు, దంతాలను మిగతా భాగాలను శుభ్రం చేసుకోవడం చాలా అవసరం.
చిగుళ్లు, దంతాల్లో బ్యాక్టీరియా తీవ్రత పెరిగిన ప్పుడు ఇతర వైద్య విధానంలోని ఎంతో శక్తివంతమైన యాంటీబయాటిక్స్ కూడా పనిచేయలేకపోతాయి. అంతిమంగా ఇది దంతక్షయానికి దారి తీస్తుంది.
మూలికావైద్యం
నిజానికి, జామ, బోడతరం, మారేడు, వెలగ, సర్ప సుగంధి, దబ్బ చెట్ల ఆకులు నోటి బ్యాక్టీరియాను నిర్మూలించగలవు. ఈ ఆకుల రసాన్ని ఒక్కోసారి 8 నిమిషాల చొప్పున పుక్కిలిస్తే, రెండు వారాల లోపుగానే నోటిలోని బ్యాక్టీరియా పూర్తిగా న శిస్తుంది.
ఆ తర్వాత చిగుళ్లు, దంతాలు గట్టిపడటానికి, మామిడి, మర్రి, జువ్వి, రావి, మేడి చెట్ల ఆకుల రసాన్ని రోజుకు మూడుసార్లు, ప్రతిసారీ 5 నిమిషాల చొప్పున పుక్తిలిస్తే సరిపోతుంది. మౌలికంగా, దంత సమస్యల వెనుక చాలా వరకు విటమిన్ - సి లోపం ఉంటుంది. నోరు, ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్ బలహీనపడినప్పుడు నోటిలోని భాగాలన్నీ బ్యాక్టీరియా బారిన పడుతుంటాయి. ఆ విటమిన్ లోపాన్ని పూరించుకోవడం ద్వారా ఆ సమస్యల్ని అధిగమించవచ్చు కాకపోతే, అపరిశుభ్రత వల్ల తలెత్తే చిగుళ్లు, దంత వ్యాధులను విటమిన్ - సి నయం చేయలేదు. అలాంటి యాంటీబయాటిక్స్‌కు లొంగని చిగుళ్లు, దంతాల సమస్యలను సైతం మూలికా వైద్యం సమర్థమంతంగా నయం చేస్తుంది.
- డాక్టర్ జి. లక్ష్మణ రావు
మూలికా వైద్యులు, ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్, హైదరాబాద్.