ఇక ఆకట్టుకునే నవ్వు మీ సొంతం

ఆంధ్రజ్యోతి,30/01/14
నవ్వు అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని కోరుకోని వారు ఎవరుంటారు? అందమైన నవ్వు సొంతం కావాలని, అందమైన పలు వరుస ఉండాలని అందరూ ఆశపడతారు. అయితే ఈ రోజుల్లో అది అసాధ్యమైన పని మాత్రం కానే కాదు. నవ్వును ఆకర్షణీయంగా మార్చుకోవడానికి చాలా పద్ధతులున్నాయి. 

దంతాలను తెల్లగా చేసుకోవడానికి, సరైన ఆకృతిలో మార్చుకోవడానికి, పళ్ల మధ్య సందులు లేకుండా చూసుకోవడానికి, ప్రమాదంలో కోల్పోయిన దంతాలను తిరిగి అమర్చుకోవడానికి, ఎత్తుపళ్లను సరిచేసుకోవడానికి, వంకరటింకరగా ఉన్న పళ్లను సరిచేసుకోవడానికి అనేక చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. 

మెరిసే దంతాల కోసం...
వయసు పెరిగే కొద్దీ కాలంతో పాటు మనం తినే రంగు కలిగిన పదార్థాలు, రసాయనాలు, నోట్లో ఉండే ఆమ్ల గుణం వల్ల దంతాలు రంగు మారడం లేక పైన చారల్లా ఏర్పడటం గమనించవచ్చు. పొగతాగడం ద్వారా, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం ద్వారా, కొన్ని రకాల మందుల వల్ల దంతాలు రంగు మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి దంతాలకు ‘బ్లీచింగ్‌’ అనే ప్రక్రియ ద్వారా రంగును పోగొట్టి దంతాలు తెల్లగా మార్చే వీలుంది. ఈ ప్రక్రియను 2 రకాలుగా చేసుకోవచ్చు. 
1) మీ దంతాలకు తగిన విధంగా తయారుచేసి ఇంట్లోనే చేసుకునేలా ఒక సెట్‌ను తయారు చేసి ఇస్తారు. అయితే ఇది పూర్తికావడానికి 2 నుంచి 4 వారాల సమయం పడుతుంది.

2) ఈ ప్రక్రియను వైద్యుడే చేస్తాడు. 2 లేదా 4 సార్లు గంట చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్లీచింగ్‌ ప్రక్రియ తరువాత దంతాలు తెల్లగా మారతాయి. కానీ దంతాలు అలాగే తెల్లగా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

బాండింగ్‌: దంతాల మధ్యన ఉన్న సందులను సరిచేయడానికి, విరిగిన, రంగు మారిన దంతాలను సరిచేయడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఈ చికిత్సను ఒకేసారి తీసుకోవాల్సి ఉంటుంది. మొదట ఒక ఎట్బంట్‌ను బ్రష్‌తో అప్లై చేసి దానిపైన మనకు దంతం ఏ రంగులో కావాలో ఆ రంగు పదార్థాన్ని అప్లై చేసి గట్టి పడేలా చేయడం జరుగుతుంది. 

వినీర్స్‌: దంతాల మధ్య సందులను పూరించడానికి, చిన్న ముక్కగా విరిగిన దంతాలను సరిచేయడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. దంతాల ఆకృతిని మార్చడానికి కూడా ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఈ చికిత్స కోసం రెండు సార్లు దంతవైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. మొదటి సిట్టింగ్‌లో దంతాల కొలతలను అచ్చు ద్వారా తీసుకుని ల్యాబ్‌కు పంపిస్తారు. ల్యాబ్‌లో కొలతలకు సరిపడా దంతాలను తయారుచేస్తారు. తరువాత వాటిని దంతాలపై అమర్చడం జరుగుతుంది. 

టక్రౌన్స్‌ (కృత్రిమ దంతాలు): పన్నుకు ఒక తొడుగులాంటిది తొడిగే ప్రక్రియ ఇది. దంతాల ఆకృతి సరిచేయడానికి, బలహీనంగా ఉన్న పన్నును కాపాడటానికి, విరిగిన పన్నును సరిచేయడానికి, కోల్పోయిన దంతాలను అమర్చడానికి, డెంటల్‌ ఇంప్లాంట్‌ను అమర్చడానికి, రూట్‌కెనాల్‌ చేసిన దంతాలకు బలాన్నివ్వడానికి ఉపయోగిస్తారు. ఈ చికిత్స కోసం 2, 3 సార్లు దంతవైద్యుడి దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. కృత్రిమ దంతాలలో చాలా రకాలుంటాయి. అవి దంతవైద్యుడి సలహా మేరకు పాటించాలి. 

ఎనామిల్‌ షేపింగ్‌, సరిచేయడం: దంతాలలో 3 పొరలుంటాయి. బయటకు కనిపించే పొరను ఎనామిల్‌ అంటారు. ఈ ఎనామిల్‌ను సరైన ఆకృతిలో తయారుచేస్తారు. ఈ ప్రక్రియను ఒకదానిపై ఒకటి వచ్చిన దంతాలను సరిచేయడానికి, విరిగిన అంద వికారంగా ఉన్న పళ్లను సరిచేయడానికి వాడతారు. 

బ్రీసెస్‌: వంకర పళ్లను, పళ్ల అమరికను చక్కదిద్దడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా చికిత్స చేయడానికి ఏడాది నుంచి 3 ఏళ్ల సమయం పడుతుంది. మొదట పళ్ల మీద బ్రీసెస్‌ పెట్టి తరువాత ఆ బ్రీసెస్‌ మీదుగా ఒక తీగను అమర్చి దానిని నమిలే పళ్లకు అనుసంధానం చేస్తారు. ప్రతి నెలా ఈ తీగను బిగుతుగా చేస్తూ వస్తారు. దీంతో క్రమంగా దంతాల అమరిక బాగవుతుంది. చికిత్స అనంతరం తీగను, బ్రీసెస్‌ను తొలగిస్తారు. మళ్లీ దంతాలు వంకరటింకరగా రాకుండా ఉండేలా ‘రిటైనర్స్‌’ను ఇస్తారు. వైద్యుడి సూచన మేరకు ఎంత కాలం చెప్తే అంత కాలం తప్పకుండా పెట్టుకోవాలి. లేకపోతే దంతాలు మొదటి స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. 

బ్రిడ్జెస్‌: ఊడిపోయిన దంతాలను, ప్రమాదవశాతూ ఊడిపోయిన దంతాలను తిరిగి అమర్చడానికి ఉపయోగిస్తారు. అయితే దంతాన్ని అమర్చడానికి, పక్క దంతాల ఆధారం కావాలి. కాబట్టి అటూ ఇటూ ఉన్న దంతాలచీ ఆధారంగా కోల్పోయిన దంతాన్ని అమర్చుతారు. దీన్నే బ్రిడ్జ్‌ అంటారు. ఇవి శాశ్వత దంతాల మాదిరిగానే అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. 

ఇంప్లాంట్స్‌: కృత్రిమ వేరు భాగాన్ని అమర్చడాన్ని ఇంప్లాంట్‌ అంటారు. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నది. ఇంప్లాంట్‌ను పెట్టాలంటే దవడ ఎముక పరిమితి సరిచూసుకోవాలి. ఇంప్లాంట్‌లో 3 భాగాలుంటాయి. 1) టైటానియం మెటల్‌ స్ర్కూ. దీన్ని దవడ ఎముకలో అమర్చుతారు. 2) చిగురుకు అంటుకుని ఉండి ఆధారానిచ్చే భాగం. 3) దీనిపై కృత్రిమ దంతాన్ని అమర్చుతారు. ఈ ఇంప్లాంట్స్‌ను ఒక్క దంతాన్ని అమర్చడానికి, మొత్తం దంతాల సెట్‌ను అమర్చడానికి ఉపయోగిస్తారు. ఈ చికిత్స పూర్తి కావడానికి దాదాపు 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది. 

చిగుళ్లకు సంబంధించిన చికిత్సలు: ఎగుడు దిగుడుగా ఉన్న చిగుళ్ల వరుసను సరిచేయడానికి, దంతాలు చిన్నగా లేక పొడవుగా అనిపిస్తున్నప్పుడు చిగుళ్లను పైకి లేక కిందకు తేవడం వల్ల దంతాల పొడవును సరిచేయడం జరుగుతుంది. దంతాల అమరిక చిగుళ్ల లోపల ఎలా ఉంటుందో అది సక్రమంగా కనిపించేలా చేయడం జరుగుతుంది. ఈ చికిత్సలన్నింటినీ దంతాల పరిస్థితిని చూసి మీ దంత వైద్యుడు మీకు ఏదైతో సరిపోతుందో దాన్ని మీకు సూచిస్తారు. ఈ చికిత్సలన్నీ నవ్వును అందంగా, ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ఉపయోగపడేవే. అయితే కొన్ని ఖర్చుతో కూడుకున్నవి. కొన్నిటికి ఎక్కువ సమయం పడుతుంది. మీకు ఏ చికిత్స అవసరమవుతుందో దంత వైద్యుడు పరీక్షించి సూచిస్తారు. ఆ మేరకు చికిత్స తీసుకోవడం ద్వారా ఆకర్షణీయమైన పలు వరుసను మీ సొంతం చేసుకోవచ్చు. 
 
డాక్టర్‌ సురేశ్‌ ఎండీఎస్‌
స్టార్‌ డెంటల్‌
సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి
ఫోన్‌ : 7416 105 105, 90300 854 56