పిల్లల దంత సమస్యలకు సరైన వైద్యం

ఆంధ్రజ్యోతి,12-12-13

పిల్లలు నవ్వితే ముద్దుగా ఉంటారు.  పలు వరుస బాగుంటే మరింత అందంగా కనిపిస్తారు. అయితే పిల్లల్లోనూ దంత సమస్యలు ఉంటాయి.  ఆ సమస్యలు పట్టించుకోకపోతే వారి అందమైన  నవ్వు కాస్తా ఆకారం లేకుండా పోతుంది. పెద్దవాళ్లు కాస్త శ్రద్ధ పెడితే చాలు, తమ  పిల్లలకు అందమైన పలువరుసను, ఆహ్లాదకరమైన నవ్వును  ప్రసాదించినవారవుతారు. 

 

ఎదిగే వయసులో పిల్లలకు నోటిలో వచ్చే మార్పులు, దవడ, ఎముకలకు సంబంధించిన సమస్యలు, దంతాల ఎదుగుదలలో లోపాలు కనిపించడం సాధారణమే. దీనికి తోడు పిల్లలు బాగా ఇష్టపడే జంక్‌ఫుడ్స్‌, చాక్లెట్స్‌, కూల్‌డ్రింక్స్‌ నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. సరైన సమయంలో నోటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోతే అది దంత సమస్యలకు దారి తీస్తుంది. నోట్లో వేలు పెట్టుకోవడం పిల్లల్లో సాధారణం. ఈ అలవాటు వల్ల కూడా దంత సమస్యలు వస్తాయి.
సాధారణ దంత సమస్యలు: పిప్పిపళ్లు, చిగుళ్ల జబ్బులు, పాలపళ్లు సరైన సమయంలో ఊడకపోవడం, ఎత్తు పళ్లు, ముఖానికి దెబ్బలు తగలడం వల్ల వచ్చే సమస్యలు.
పిప్పిపళ్లు, చిగుళ్ల జబ్బులు: దాదాపు 82శాతం మంది పిల్లలు పిప్పిపళ్లు, చిగుళ్ల జబ్బులతో బాధపడుతుంటారు. పిల్లలు తీసుకునే ఆహారం, సరిగా బ్రష్‌ చేసుకోకపోవడం వంటి అనేక అంశాల వల్ల ఈ సమస్య వస్తుంటుంది. పిల్లలు బాగా ఇష్టపడి తినే స్వీట్లు, జంక్‌ఫుడ్‌ తాలుకు అవశేషాలు దంతాల మధ్య ఇరుక్కుపోయిన కారణంగా బ్యాక్టీరియా లక్షల సంఖ్యలో పెరిగి అది దంత సమస్యలకు కారణం అవుతుంది. ఈ బ్యాక్టీరియా చక్కెర పదార్థాలతో కలిసి నోటిలో కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. దీంతో పంటిలోరంధ్రాలు ఏర్పడతాయి. అది పిప్పిపళ్లకు దారితీస్తుంది.

ఈ పిప్పిపళ్లు మొదటి దశలో ఇబ్బంది పెట్టకపోయినా, రంధ్రాలు పెద్దవి అవుతున్న కొద్దీ ఇన్ఫెక్షన్‌ వచ్చి నొప్పి మొదలవుతుంది. సరైన సమయంలో చికిత్స చేయించకపోతే ఇన్ఫెక్షన్‌ ఎముక వరకు చేరవచ్చు. దాంతో మున్ముందు రావలసిన శాశ్వత దంతాలు పాడయ్యే ప్రమాదం ఉంది.

పళ్లల్లో చిక్కుకున్న ఆహారం సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల దంతాలకే కాకుండా చిగుళ్లకు కూడా సమస్యలు వస్తాయి. నోట్లో విపరీతంగా పెరిగిపోయిన బ్యాక్టీరియా, ఆహార పదార్థాలతో కలిసి ప్లాక్‌, క్యాలికులస్‌(గార)గా చిగుళ్ల చివర్లలో చేరుతుంది. దీని వల్ల చిగుళ్లవాపు, చిగుళ్ల నుండి రక్తస్రావం, నోటి దుర్వాసన వంటి సమస్యలు రావచ్చు. చిన్న వయసులోనే చిగుళ్ల జబ్బు వస్తే పిల్లలు జీవితకాలం దృఢమైన పళ్లు లేక ఇబ్బంది పడవలసి రావచ్చు.

చికిత్స: నోటిలో రంధ్రాలకు ఫిల్లింగ్‌తో పాటు సమస్యను బట్టి రకరకాల ప్రత్యేక చికత్సలు అందుబాటులో ఉన్నాయి. 
ఎత్తుపళ్లు, సమస్యలు: ఎత్తుపళ్ల వల్ల పిల్లలు ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ఈ సమస్య  ఎదిగే వయసులోనే మొదలవుతుంది.
కారణాలు: చాలా వరకు వంశపారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి గానీ, ఇద్దరికీ గానీ ఎత్తు పళ్లు ఉంటే పిల్లల్లో కూడా 70 శాతం వచ్చే అవకాశం ఉంది. 

నోట్లో వేలు పెట్టుకోవడం, పెదవులు కొరకడం, నాలుకతో పళ్లు ముందుకు తోయడం, నోటితో గాలి పీల్చడం వంటివి దీనికి కొన్ని కారణాలు. అప్పుడే ఎదుగుతున్న దవడ ఎముకలు ఒత్తిడి పడుతున్న వైపు ఒరిగిపోతాయి. ఈ కారణంగానే పై దురలవాట్లు ఉన్న పిల్లల్లో దవడ ఎముకల ఆకృతి మారిపోయి ఈ సమస్య వస్తుంది. ఎత్తు పళ్ల సమస్యను ఎదిగే వయసులోనే సరిచేయడం సులభం. చికిత్స ఫలితాలు కూడా నూరు శాతం ఉంటాయి.

పాళ్లు పళ్లు సరైన సమయంలో ఊడకపోవడం: సాధారణంగా పాలపళ్లు ఊడిపోవడానికి ప్రతి పంటికీ ఒక సమయం ఉంటుంది. శాశ్వత దంతం తయారై బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పాలపన్ను ఊడుతుంది. అవి ఊడిన 3-4 నెలల్లో శాశ్వత దంతం వచ్చేస్తుంది. ఏ కారణం వల్లనైనా పాలపన్ను ఊడకపోతే, శాశ్వత పన్ను దాని స్థానంలో కాకుండా ముందుకో, వెనకకో వస్తుంది. అందువల్ల అవసరాన్ని బట్టి చికిత్స చేయించాలి. ఇలాంటి సమస్యలున్నప్పుడు ఎక్స్‌రే సహాయంతో పాలపళ్లు, శాశ్వత దంతాలను, శాశ్వత దంతాలు చిక్కుకుపోయిన తీరును తెలుసుకోవచ్చు.
ముఖానికి దెబ్బలు తగలడం వల్ల వచ్చే సమస్యలు: పిల్లలు ఆటలు ఆగుకునేటప్పుడు లేదా గొడవలు పడి పోట్లాడుకున్నప్పుడు  ముఖానికి దెబ్బలు తగలడం సాధారణం. కొన్నిసార్లు పళ్లు విరగవచ్చు, ఊడిపోవచ్చు. దెబ్బలు తగిలినప్పుడు చికిత్స వెంటనే చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే పలువరుస షేపు మారడం, పళ్లపై గుర్తులు మిగిలిపోవడం వంటివి జరగవచ్చు. అందుకే పన్ను విరిగినా, ఊడినా వెంటనే ఆ ముక్కను మంచినీటిలో ఉంచి దంత వైద్యులను కలవాలి.

డాక్టర్‌ సురేష్‌, ఎండీఎస్‌.
స్టార్‌ డెంటల్‌
సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి
7416 105 105, 90300 854 56