దంతరక్షణలో అపోహలెన్నో....

ఆంధ్రజ్యోతి, 02-08-2015: పిండి పదార్థాలు తినడం వల్లే దంతాలు పాడవుతాయా? దంతాలకు స్కేలింగ్‌ మంచిది కాదా? లాంటి అపోహలు చాలామందిలో ఉన్నాయి. ఉదాహరణకు స్కేలింగ్‌ దంతాలకు మంచిది కాదని కొంతమంది అంటారు. కానీ అది తప్పు. స్కేలింగ్‌ దంతాల చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. దంతాలపైనుండే పసుపుపచ్చదనాన్ని పోగొడుతుంది. చిగుళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల, స్కేలింగ్‌ వల్ల నోటి దుర్వాసన ఉండదు. అలా్ట్రసోనిక్‌ స్కేలింగ్‌తో దంతాలను క్రమంతప్పకుండా శుభ్రం చేయించుకుంటుండాలి. అవసరానికి మించి స్కేలింగ్‌ చేయకూడదని మరవకండి. అలా చేస్తే దంతాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకొక పెద్ద అపోహ ఏమిటంటే వైటనింగ్‌ వల్ల దంతాలపై నుండే ఎనామిల్‌ దెబ్బతింటుందని చాలామంది నమ్ముతుంటారు. ఇది కూడా అపోహే. అత్యాధునిక పద్ధతైన జూమ్‌ వైటనింగ్‌ దంతాలపై ఉండే మరకలను పోగొడుతుంది. అంతేకాదు దంతాలు తమ సహజమైన తెలుపుదనంతో మెరిసేలా చేస్తుంది. ఇది చాలా సింపుల్‌ విధానం మాత్రమే కాదు ఎంతో సురక్షితమైన విధానం కూడా. ఎందుకంటే బ్లీచింగ్‌ ఏజెంట్స్‌, కెమికల్స్‌ ఇందులో ఉండవు. చక్కెర తినడం వల్లనే దంతక్షయం సంభవిస్తుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇది కూడా కేవలం ఒక అపోహే. ఎందుకంటే బాక్టీరియా వల్ల నోట్లో యాసిడ్లు ఉత్పత్తయి దంతక్షయం సంభవిస్తుంది. చక్కెర వల్లే కాదు పళ్లు, కూరగాయలు, అన్నం, బ్రెడ్‌ వంటి వాటిని తిన్నా కూడా దంతక్షయం సంభవిస్తుంది. దంత సంరక్షణను పాటు ఆమ్లాలున్న ఆహారాన్ని తక్కువ తీసుకుంటే దంతక్షయాన్ని నివారించవచ్చు.