చిరునవ్వు మెరవాలంటే..

25-06-2018: మల్లెపువ్వులాంటి చిరునవ్వుతో ఎదుటివారిని ముగ్ధులను చేయొచ్చు. అలాంటి చిరునవ్వులు ఒలికించాలంటే మీ దంతాలు ముత్యాల్లా మెరవాలి. మరి దంతాలు ముత్యాల్లా మెరవాలంటే...
 
యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌ బాగా పనిచేస్తుంది. ఇది మంచి హోమ్‌ రెమిడీ. దీంతో బ్రెష్‌ చేసుకోవడం వల్ల దంతాలు తళతళలాడడమేగాక దృఢంగా కూడా ఉంటాయి. చార్‌కోల్‌లోని యాంటాక్సిడెంట్లు దంతాల మధ్య ఉన్న పాచిని తొలగిస్తాయి.
డెయిరీ ఉత్పత్తులు ముఖ్యంగా పాలు దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిల్లోని కాల్షియం, ఫాస్ఫర్‌సలు కావలసినంత మినరల్స్‌ను అందిస్తాయి. అందుకే బ్రెష్‌ చేసుకునే ముందు టూత్‌పేస్టుపై కొద్దిగా పాలపొడి చల్లి తోముకుంటే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయాలి.
బేకింగ్‌సోడా, నిమ్మరసం రెండూ దంతాలను మెరిసేట్టు చేస్తాయి. కాఫీ, టీ, కేఫినేటెడ్‌ డ్రింక్స్‌ తాగడం వల్ల దంతాల మీద పసుపుపచ్చని మచ్చలు ఏర్పడతాయి. బేకింగ్‌ సోడా ఈ మచ్చలను పోగొట్టి దంతాలను మెరిసేలా చేస్తుంది. నిమ్మలో విటమిన్‌-సి ఉంటుంది. ఇది కూడా దంతాలను మెరిసేలా చేస్తుంది. చిటికెడు బేకింగ్‌సోడా, కొన్ని చుక్కల నిమ్మరసం టూత్‌బ్ర్‌షపై వేసి, దంతాలకు పట్టించి ఒక నిమిషం అలాగే ఉంచి, ఆ తర్వాత శుభ్రం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయాలి.
రాతిఉప్పు, నిమ్మరసం, టూత్‌పేస్టుల మిశ్రమాన్ని బ్రెష్‌పై వేసుకుని దంతాలకు పట్టించి ఒక నిమిషం అలా వదిలేసి తర్వాత శుభ్రంగా కడగాలి. రాతిఉప్పులో యాంటీ బాక్టీరియల్‌ గుణాలతో పాటు ఐరన్‌, మెగ్నీషియం, కాల్షియంలు కూడా ఉన్నాయి. ఇవి దంతాలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి.
అర టీ స్పూను యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను ఒక గ్లాసునీళ్లలో కలిపి పుక్కిలిస్తే దంతాలు మెరుస్తాయి. ఇది క్లిన్సింగ్‌ ఏజెంట్‌గా పనిచేయడమేగాక, దంతాలలోని బాక్టీరియాను నిర్మూలిస్తుంది. దంతాలపై ఏర్పడిన మచ్చలను పోగొడుతుంది.