చిగుళ్ల వ్యాధులతో చిక్కే సుమా!

14-05-2018: చిగుళ్ల వ్యాధులు గుండె జబ్బులకు దారి తీస్తాయనైతే తెలుసు. కానీ ఇప్పుడు చిగుళ్ల వ్యాధులు అన్నవాహిక కేన్సర్‌కు దారి తీస్తాయనే కొత్త విషయాన్ని బయటపెట్టారు పరిశోధకులు. ‘ కేన్సర్‌ రీసర్చ్‌’ అనే ఒక జర్నల్‌లో ఇటీవల ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ కేన్సర్‌ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న కేన్సర్‌ మరణాల్లో అన్నవాహిక స్థానం ఆరవది. ఈ వ్యాధి చాలా వరకు బాగా ముదిరాకే బయటపడుతుంది.

సాధ్యమైనంత వరకు ఈ వ్యాధిని చాలా మందుగానే గుర్తించే ప్రయత్నం చే యాలి. చిగుళ్ల వ్యాధులకు దారి తీసే బ్యాక్టీరియా రెండు రకాలు వాటిల్లో టానెరెల్లా ఫార్సీథియా అనే బ్యాక్టీరియా ఒకటి. అన్నవాహిక కేన్సర్లకు అతి పెద్ద కారణం ఈ బ్యాక్టీరియాయే. ఇది కాకుండా స్టెప్టోకాకస్‌, నీసేరియా అనే బ్యాక్టీరియాలు కూడా చిగుళ్ల వ్యాధులకు మూలమవుతాయి. కాకపోతే వీటికి అన్నవాహిక కేన్సర్‌ను కలిగించే గుణం చాలా తక్కువ. ఏమైనా నోటిలో బస చేసే బ్యాక్టీరియా గురించిన అవగాహన ఇంకా ఇంకా పెరగాల్సి ఉంది. ఈ అవగాహనే అన్నవాహిక కేన్సర్‌నుంచి ఎంతో కొంత విముక్తం కావడానికి తోడ్పడుతుంది అంటున్నారు పరిశోధకులు. ఎప్పుడో ఏదైనా నమస్య తలెత్తినప్పుడే అని కాకుండా తరుచూ దంత పరీక్షలు చేయించుకోవడం, నిరంతరం చిగుళ్ల శుభ్రత విషయంలో శ్రద్దవహించడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు అధిగమించవచ్చు అని కూడా వారంటున్నారు.