ఎత్తుపళ్లతో ఇబ్బందిగా ఉంది!

05-07-2018: నా వయసు 19 ఏళ్లు. నాకు పై పళ్ల వరుస ఎత్తుగా ఉంది. పెదాలు పూర్తిగా మూసుకోకపోవడం వల్ల ముందు పళ్లు బయటికి కనపడతాయి. ఎక్కడ ఎవరితో మాట్లాడాలన్నా, ఏ ఫంక్షన్లకు వెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ కారణంగా నాలో ఒక తెలియని ఆత్మన్యూనతా భావం స్థిరపడింది. భవిష్యత్తులో కెరీర్‌ పరంగా కూడా వెనకబడిపోతానేమోని దిగులుగా ఉంది. పళ్లు సరిచేసే ప్రక్రియ గురించి నాకు తెలుసు. అయితే ఆ సరిచేసే క్రమంలో రెండు దంతాలు తీసేస్తారని దాని వల్ల కంటి చూపు దెబ్బ తింటుందని చాన్నాళ్ల క్రితమే కొందరు చె ప్పారు. అదే నా మనసులో ఉండిపోయి అడుగు ముందుకు వేయలేకపోయాను. కానీ, రోజురోజుకూ ఈ పళ్ల సమస్య నన్ను మానసికంగా కుంగదీస్తోంది. అసలు దంతాలు తీసివేయడం ద్వారా చూపు దెబ్బతినడం వాస్తవమేనా? లేక ఇదొక అపోహేనా? ఆ వివరాలు తెలియచేయండి.
- జి. మనోజ, మెడ్చల్‌

ఎత్తు పళ్లు ఉండడం అనేది ఒక సర్వసాధారణ సమస్య. ఆ విషయంలో మీరు ఇంతగా మదనపడాల్సిన అవసరంలేదు. తలిదండ్రులకు ఎత్తు పళ్లు ఉన్నప్పుడు వారి పిల్లల్లో కూడా కొంత మందికి ఎత్తుపళ్లు వచ్చే అవకాశం ఉంది. లేదా బాల్యంలో అస్తమానం నోట్లో వేళ్లు పెట్టుకునే అలవాటు ఉన్న కారణంగా కూడా కొంత మందికి చిగుళ్లు పైకిలేచి ఎత్తు పళ్లు రావచ్చు. ఇలాంటి పిల్లలకు ఓ 15 ఏళ్లు వచ్చిన తర్వాత పళ్ల మీద ఆర్థోడాంటిక్‌ క్లిప్‌ (బ్రేసెస్‌) వేసి, ఎత్తు పళ్లను లోపలికి జరిపే అవకాశం ఉంది. ఈ ప్రొసీజర్‌ పూర్తి కావడానికి 12 నుంచి 18 మాసాలు పట్టవచ్చు. అయితే నెలకొకకసారి ఆ క్లిప్‌ను మెల్లమెల్లగా బిగదీయాల్సి ఉంటుంది. ఇది డాక్టర్‌ పర్యవేక్షణలో జరగాలి. ఈ చికిత్సలో పళ్లు తీసివేయడ ం అనేది, పళ్ల మధ్య సందులేమీ లేనప్పుడే అవసరం. అవసరమైన మేరకు సందులు ఉంటే అలా తీసేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ పెద్దగా సందులేమీ లేకపోతే ఇరువైపులా ఒక్కో పన్ను చొప్పున తీసేయాల్సి ఉంటుంది. ఆ తొలగించిన ఖాళీలోకి ఎత్తు పళ్లను జరపడం జరగుతుంది. అయితే పళ్లను తీసివేయడం వల్ల కనుచూపు తగ్గుతుందనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి వేరే ఏ కారణంగానో కనుచూపు తగ్గితే ఇది పన్ను తీసేయడం వల్లే జరిగిందని భ్రమిస్తారు. వాస్తవానికి పన్ను తీసేయడానికీ, కంటి చూపు తగ్గడానికీ ఏ సంబంధమూ లేదు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఆ చికిత్సకు సిద్ధం కావడానికి ప్రయత్నించండి.

 
- డాక్టర్‌ పి. బాల్‌ రెడ్డి
ఓరల్‌ అండ్‌ మాక్సిలో ఫేషియల్‌ డెంటల్‌ సర్జన్‌
కార్తీక్‌ కాస్మటిక్‌ డెంటల్‌ సెంటర్‌
నారాయణ గూడ, హైదరాబాద్‌