చిగుళ్ల వ్యాధికి సర్జరీ అవసరమా?

10-07-13

 
మన దేశంలో నూటికి 90 మంది చిగుళ్ల వ్యాధితో బాధపడుతున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. కానీ, ఈ వ్యాధి గురించి మనలో చాలామందికి పూర్తి అవగాహన లేదు. చిగుళ్ల వ్యాధి ఎలా వస్తుంది? మన దైనందిన జీవితంలో మనం తినే పదార్థాల మీద అంతా ఆధారపడి ఉంటుంది. రోజూ ఉదయమే బ్రష్‌ చేసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. సరిగ్గా పళ్లు తోముకోకపోవడం వల్ల పళ్లు గారకట్టి, దాని మీద సూక్ష్మ క్రిములు చేరతాయి. వాటి రసాయనిక చర్య వల్ల ఆమ్లాలు, ఎంజైమ్స్‌ విడుదలై, పళ్ల చిగుళ్లలోకి చేరతాయి. ఫలితంగా పళ్ల చుట్టూ ఉండే ఎముక  కరగడం ప్రారంభిస్తాయి. ఆ కారణంగానే చిగురు వాయడం, రక్తం కారడం, చీము కారణం పట్టడం వంటివి చోటు చేసుకుంటాయి. ఇవన్నీ దంత సమస్యలకు కారణమవుతాయి.
 
వ్యాధి లక్షణాలు
 ముందుగా చిగుళ్ల నుంచి రక్తం వస్తుంది. ఒక్కోసారి దానంతటదే రక్తం కారచ్చు. లేదా పళ్లు తోముకుంటున్నప్పుడు కారవచ్చు. ఏదైనా కొరికినప్పుడు కూడా రక్తం కారే అవకాశం ఉంది. 
 కమంగా చిగుళ్లు వాయడం మొదలవుతుంది. బొప్పి లాగా క ట్టే అవకాశం ఉంది. చీము కారుతుంది. తినేటప్పుడు ఉప్పగా అనిపిస్తుంది.
 నోటి దుర్వాసన, పళ్ల మధ్యలో సందులు, పళ్లు కదలడం, పళ్లు పక్కకు, కిందికి జారడం వంటివి జరుగుతాయి.
అయితే, చాలామందిలో నొప్పి కనిపించదు. అందువల్ల చిగుళ్ల సమస్యను పట్టించుకోకుండా వదిలేస్తారు. 
 మామూలుగా 14 సంవత్సరాలు, ఆ పైన వయసు గలవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. పళ్లు పాచి పడితే ఇది తొందరగా వస్తుంది. అయితే, వంశపారంపర్యంగానూ, రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లా, షుగర్‌ వ్యాధి ఉండడం వల్లా ఈ చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధి, కీళ్ల వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారిలో కూడా చిగుళ్ల వ్యాధి కనిపిస్తుంటుంది. అంతేకాక, గర్భిణీ స్ర్తీలలో, ఎక్కువగా ధూమపానం చేసేవారిలో, మానసిక వ్యాధులు ఉన్న పిల్లల్లో, మానసిక ఒత్తిడి, టెన్షన్‌, మానసిక కుంగుబాటు, జీర్ణకోశ సంబంధ వ్యాధులు ఉన్నవారిలో ఇటువంటి వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
గర్భిణీ స్ర్తీలలో చిగుళ్ల వ్యాధి వస్తుందా?
ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. స్ర్తీలు గర్భం ధరించినప్పుడు గర్భాన్ని కాపాడడానికి శరీరం అనేక హార్మోన్లను విడుదల చేస్తుంది. ఆ సమయంలో పళ్ల చుట్టూ పాచి చేరుతుంది. ఆ పాచి మీద ఉన్న సూక్ష్మక్రిముల ప్రభావం వల్లా, హార్మోన్ల ప్రభావం వల్లా చిగుళ్ల నుంచి రక్తం కారడం ప్రారంభమవుతుంది. అది అలా కొనసాగి, చివరికి చిగుళ్లు వాయడం, ఉబ్బడం, చీము కారడం, కాయలు కట్టడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీనిని గనుక అశ్రద్ధ చేస్తే, నెలలు నిండక ముందే ప్రసవించడం లేదా గర్భస్రావం కావడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
గుండె జబ్బులు వస్తాయా?
చిగుళ్ల వ్యాధులకు సకాలంలో చికిత్స చేయని పక్షంలో అది గుండె జబ్బులకు దారి తీసే ప్రమాదం కూడా ఉంది. 
 చిగుళ్ల వ్యాధిని కలగజేసే బ్యాక్టీరియా కొన్ని రకాల పదార్థాలను వదులుతాయి. ఇవి రక్త కణాల మీద పనిచేస్తాయి. క్రమంగా అవి రక్త కణాలు మూతపడేటట్టు చేస్తాయి. ఫలితంగా ముందుగా గుండెకు రక్త ప్రసారం తగ్గి గుండె పోటు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
 తరచూ దంత పరీక్షలు అవసరం. ఎందుకంటే పాచి మీద ఉండే సూక్ష్మక్రిములు మనం తీసుకునే ఆహారంలో కలిసి,  శరీరంలోని రక్తంలో కలిసిపోయి, గుండెకు చేరి, రుమాటిక్‌ ఫీవర్‌, బ్యాక్టీరియల్‌ ఎండోకార్డిటిస్‌ అనే ప్రాణాంతక వ్యాధుల్ని కలగజేసే ప్రమాదం ఉంది. 
షుగర్‌ వ్యాధిగ్రస్తులకు వస్తుందా?
షుగర్‌ వ్యాధి వల్ల వ్యాధి నిరోధక శక్తి కొద్దిగా తగ్గుతుంది. మన శరీరంలో జరిగే మరమ్మతు వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఫలితంగా మన శరీరంలో ఏ భాగమైనా అస్వస్థతకు గురయ్యేందుకు ఆస్కారముంటుంది. అందులో చిగుళ్ల వ్యాధి కూడా ఒకటి.  
 ఈ వ్యాధి వల్ల ఎన్ని మందులు వాడినా షుగర్‌ అదుపులోకి రాకపోవచ్చు. ప్రతి షుగర్‌ వ్యాధిగ్రస్తుడూ చిగుళ్లు పరీక్షించుకోవడం ద్వారా, ఈ వ్యాధిని నివారించుకుంటూ, షుగర్‌ వ్యాధిని అదుపు చేసుకోవచ్చు. 
 షుగర్‌ వ్యాధి గ్రస్తుల్లో చిగుళ్లలో గ్లూకోజ్‌ శాతం ఎక్కువగా ఉండడం వల్ల సూక్ష్మక్రిములకు ఎక్కువగా అనుకూలిస్తుంది. దానివల్ల త్వరగా ఎముక అరగడానికి అవకాశం ఉంటుంది. 
 నోటి ని శుభ్రంగా తోముకోకపోవడం వల్ల పంటి చుట్టూ పాచి పడుతుంది. ఫలితంగా చిగుళ్లు వదులవుతాయి. పాచి మీద ఉండే బ్యాక్టీరియా గొంతులోకి కూడా పోయి, ఊపిరితిత్తులు వ్యాధులకు గురవుతాయి. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంతాల్ని చెకప్‌ చేయించుకోవడం అవసరం. అలాగే దీర్ఘకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నవారు తప్పకుండా చిగుళ్లకు ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకోవాలి.
జీర్ణకోశ వ్యాధులు వస్తాయా?
 పళ్లు శుభ్రంగా తోముకోకపోవడం వల్ల పాచి పట్టి, బ్యాక్టీరియా పెరిగి, జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల తరచూ దంత పరీక్షలు, చిగుళ్ల పరీక్షలు చేయించుకోవాలి. బ్రష్‌ను మూడు నెలలకో, ఆరు నెలలకో ఒకసారి మార్చేస్తుండాలి. 
   చిగుళ్ల వ్యాధి లేక దంతాల సమస్య కనిపించగానే వెంటనే దంత వైద్యుల్ని సంప్రతించడం చాలా అవసరం. లేని పక్షంలో శరీరమంతా దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుంది. తాజా పరిజ్ఞానంతో సర్జరీ అవసరం లేకుండా, లేజర్‌ సహాయంతో నాన్‌ సర్జికల్‌ వైద్యం, పీడియోస్కాన్‌ ద్వారా వైద్యం ఆచరణలోకి వచ్చాయి. అందువల్ల తరచూ తప్పనిసరిగా దంత వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంది.
 
 
డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ నాగుబండి
ఎండిఎస్‌(పిరియడాంటిక్స్‌)
నాగుబండి లేజర్‌ అండ్‌ ఇంప్లాంట్‌ డెంటల్‌ హాస్పిటల్‌, ఖమ్మం
ఫోన్‌ : 98480 95594