ఇలా చేస్తే ముత్యాల పలువరుస మీదే!

ఆంధ్రజ్యోతి,21/06/14
నవ్వు నాలుగు విధాలా స్వీటే! నవ్వు మరింత మధురంగా ఉండాలంటే నవ్విన ప్రతిసారీ తెల్లని పలువరుస తళుక్కుమనాలి. అప్పుడే దరహాసం రెట్టింపు ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ కొన్ని ఆహారపు అలవాట్ల కారణంగా దంతాలు సహజ మెరుపుని కోల్పోతూ ఉంటాయి. తిరిగి వాటిని అసలు రంగుకి తెప్పించటం కోసం అప్పుడప్పుడూ కొన్ని చిట్కాలు పాటిస్తూ ఉండాలి. 

టూత్‌ వైటెనింగ్‌ ట్రీట్‌మెంట్‌లో మాలిక్‌ యాసిడ్‌ అనే రసాయనాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది యాపిల్స్‌లో సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి యాపిల్స్‌ తరచూ తింటూ ఉంటే దంతాలు తెల్లబడతాయి.
కరకరలాడే కూరగాయలు నమిలినా ఇదే ఫలితం దక్కుతుంది. క్యారెట్‌, దోసకాయ ముక్కలను తరచుగా నములుతూ ఉండాలి.
నోట్లో ఇరుక్కుని ఉండిపోయే పదార్థాల వల్ల కూడా దంతాలు తెల్లదనాన్ని కోల్పోతాయి. కాబట్టి ఆహారం తిన్న తర్వాత నోటిని ఎక్కువ నీళ్లతో పుక్కిలించాలి.తాజా స్ట్రాబెర్రీ గుజ్జును దంతాలపై రుద్దుకుంటే పళ్లు తెల్లబడతాయి. ఈ పళ్లలో గాఢమైన యాసిడ్స్‌, సుగర్స్‌ ఉంటాయి. కాబట్టి రుద్దుకున్న వెంటనే టూత్‌బ్రష్‌తో పళ్లు శుభ్రం చేసుకోవాలి. లేదంటే దంతాల ఎనామిల్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది.

కొన్ని చుక్కల నిమ్మరసంలో చిటికెడు ఉప్పు కలిపి బ్రష్‌తో దంతాలపై రుద్దుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులపాటు చేస్తే ఫలితం కనిపిస్తుంది. అయితే నిమ్మరసంతో రుద్దుకున్న వెంటనే మళ్లీ టూత్‌పేస్ట్‌తో దంతాలు శుభ్రపరుచుకోవాలి. లేదంటే నిమ్మరసం లోని సిట్రిక్‌ యాసిడ్‌ వల్ల దంతాల ఎనామిల్‌ దెబ్బతినే అవకాశం ఉంది.

ఎండు ద్రాక్ష తినటం వల్ల నోట్లో లాలాజలం ఎక్కువ ఊరుతుంది. దాంతో పళ్ల మీద గార ఏర్పడకుండా ఉంటుంది.
ఎనామిల్‌ను దృడపరిచే ఫాస్ఫరస్‌, కాల్షియంలు పాలు, పెరుగుల్లో ఉంటాయి. కాబట్టి పాలు, పెరుగు తీసకుంటూ ఉంటే దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
చిటికెడు బేకింగ్‌ సోడాకు అంతే పరిమాణంలో ఉప్పు, నీళ్లు కలిపి ఒక నిమిషంపాటు బ్రష్‌తో దంతాలు రుద్దుకోవాలి. తర్వాత బేకింగ్‌ సోడా వాసన వదిలేవరకూ నోరు నీటితో పుక్కిలించాలి. ఇలా వారానికి రెండు సార్లు మాత్రమే చేయాలి. 
 బేకింగ్‌ సోడా, నిమ్మరసం కలిపి బ్రష్‌ చేసినా దంతాలు తెల్లబడతాయి.
హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, నీళ్లు సమపాళ్లలో కలిపి మౌత్‌ వాష్‌గా ఉపయోగిస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే దంతాలు తెల్లబడతాయి.‘ క్సైలిటాల్‌’ న్యాచురల్‌ స్వీటెనర్‌. ఇది ఉండే చూయింగ్‌ గమ్‌ను నమలటం వలన నోట్లో లాలాజలం ఎక్కువగా తయారై గార చేరకుండా ఉంటుంది.