మెరిసే పళ్ల కోసం..

మీ పళ్లు బలంగా ఉంటేనే దేన్నయినా కరకరా నమిలేయగలరు. అదే దంత సమస్యలు ఉంటేనో.. ఏది నోట్లో పెట్టుకోవాలన్నా భయమేస్తుంది. మరి, పళ్లు గట్టిగా ఉండాలంటే..అందరికీ తెలిసిన విషయమే అయినా.. రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేసుకునేవారు అతితక్కువట. ఈ విషయం పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకని మీరు ఉదయం పూట ఒకసారి, రాత్రి పడుకునే ముందు మరొకసారి తప్పక బ్రష్‌ చేసుకోండి. అదే మీ పళ్లకు సగం బలం.

చాలామంది రాత్రిపూట టీవీలు వీక్షిస్తూనో, ఇంటర్‌నెట్‌ బ్రౌజ్‌ చేస్తూనో చాక్లెట్లు తినేస్తుంటారు. ఎన్ని తిన్నామన్న లెక్క కూడా ఉండదు. ఆ తరువాత అలాగే పడుకుంటారు. ఇలా చేస్తే పళ్లు పాడవుతాయి. తిన్న తరువాత కనీసం ఒక గ్లాసు మంచి నీళ్లతో నోరు పుక్కిలించడం మరువొద్దు.కాల్షియం కలిగిన పండ్లు ఆరోగ్యానికే కాదు. పళ్లకు కూడా బలవర్ధకమైన ఆహారం. తరచూ వాటిని తింటే.. పైపళ్లు, కిందిపళ్లు బలంగా తయారవుతాయి.కొందరైతే నెలల తరబడి టూత్‌బ్ర్‌షను మార్చరు. కనీసం రెండు మాసాలకు ఒకసారైన బ్రష్‌ను మారిస్తేనే ఉత్తమం. మీ పళ్లకు సరిపడే బ్రష్‌ను కొనుగోలు చేయండి. కుటుంబ సభ్యులందరు ఒకే రకమైన బ్రష్‌లు కాకుండా.. ఎవరికి ఏది సరిపడుతుందో దాన్నే తీసుకోండి. కొన్ని బ్రష్‌లు సాఫ్ట్‌గా, మరికొన్ని హార్డ్‌గా ఉంటాయి. 

హోటళ్లకు వెళ్లినప్పుడు వేడి వేడి పదార్థాలు తిన్న వెంటనే చల్లటి పదార్థాలు తింటుంటారు. ఇలా చేస్తే పళ్లపైన ఉండే ఎనామిల్‌ దెబ్బతింటుంది. తద్వార హాని తలెత్తుతుంది.

అప్పుడప్పుడు చెరుకుగడల్లాంటివి తినండి. గట్టిగా ఉండే పండ్లను సైతం కొరుక్కుని తినండి. ఇలాచేస్తే పళ్లు గట్టిపడతాయి. జ్యూస్‌లు తగ్గిస్తే బెటర్‌.

రోజూ తెల్లటి టూత్‌పేస్ట్‌ వాడే బదులు.. వారంలో రెండుసార్లు ఆయుర్వేద వన మూలికలతో తయారు చేసిన పళ్లపొడులను వాడటం అలవాటు చేసుకోండి. 

ఎప్పటి నుంచో వాడుతున్న వేపపుల్ల కూడా భేషైనది. నెలకు ఒకసారైనా తాజా వేపపుల్లతో పళ్లు తోమండి. ఇవన్నీ తెలిసినవే అయినా.. క్రమం తప్పకుండా చేస్తే.. పళ్లు గట్టిగా మారతాయి. వయసు మీద పడినా అంత తర్వగా ఊడిపోవు. దంతసమస్యలూ దరిచేరవు.
పండ్లు తింటే పంటికి చేటు!
రోజుకొక్క యాపిల్‌ తింటే డాక్టర్‌ అవసరం ఉండదని ఒక సర్వే.. కానీ, అదే పండు మిమ్మల్ని దంత వైద్యుడి దగ్గరకు పంపే అవకాశమూ ఎక్కువే ఇది కొత్త సర్వే.. పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని మన అభిప్రాయం.. ఆరోగ్యానికి మంచిదే అయినా.. పండ్లు తింటే దంతాలు పాడవుతాయని సరికొత్త అధ్యయనంలో తేలింది. ఐదుగురిలో నలుగురు దంత వైద్యులు ఇదే మాట చెబుతున్నారు. 458 మంది దంత వైద్యులను దీనిపై అధ్యయనం చేయగా ఈ విషయాన్ని వెల్లడించారు. పండ్లు తినడం ద్వారా పంటిపై ప్లేక్‌ పేరుకుపోయి ఇనామెల్‌ పాడవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా యాపిల్స్‌ మన పళ్లకు చాలా చేటు చేస్తాయని చెబుతున్నారు. యాపిల్స్‌ వల్ల చిగుళ్లు కరాబవుతాయని హెచ్చరిస్తున్నారు. దంత సమస్యల్లో పండ్ల రసాల పాత్ర ఉంటుందని అంటున్నారు.