మెరిసే దంతాల కోసం...

ఆంధ్రజ్యోతి: మీ దంతాలు పసుపు పచ్చగా ఉన్నాయా? తెలుపు పళ్ళ కోసం రకరకాల పేస్టులు వాడినా ఫలితం లేదా? దంతాలపై ఉండే పసుపు పచ్చటిరంగు పోవటానికి ఏమైనా మంత్రముందా అని ఆలోచిస్తున్నారా? మంత్రాలైతే లేవు కానీ మనకు అందుబాటులో కొన్ని పళ్ళు, మొక్కలు ఉన్నాయి. వాటి మిశ్రమాలని ఉపయోగిస్తే మీ దంతాలు తెల్లగా మెరిసిపోతాయి కూడా. దంతాలపై పసుపు పచ్చటి రంగు (గార) పేరుకుపోవటానికి జన్యుప్రభావం, ఆరోగ్య శుభ్రత లేకపోవటం, ఆహారపు అలవాట్లు, వయసు ఇలా పలు కారణాలుంటాయని చెప్పవచ్చు. ఇక దంతాలపై ఉండే పసుపుపచ్చటి రంగుని పోగొట్టాలంటే ఇవి వాడి చూడండి.

బేకింగ్‌ సోడా

దంతాలు కాంతివంతం చేయటానికి బేకింగ్‌ సోడా మంచి ఉపకారి. మీరు వాడే టూత్‌పేస్టులో అర టీ స్పూన్‌ బేకింగ్‌ సోడా కలిపి బ్రష్‌ చేయాలి. లేకుంటే చేతివేలిపై నాలుగుచుక్కలు నీళ్ళు పోసి అర టీ స్పూన్‌ బేకింగ్‌సోడాని అద్ది దంతాలు తోముకోవాలి. దీనివల్ల చక్కని ఫలితం ఉంటుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి.

నిమ్మపండు

నిమ్మపండులో బ్లీచింగ్‌ కారకాలుంటాయి. ఇది పసుపు పచ్చటి పళ్ళపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. నిమ్మపండు తొక్కని దంతాలపై రుద్దటం లేదా నీళ్ళలో నిమ్మరసాన్ని కలిపి తరచూ తాగటం వల్ల దంతాల్లో షైనింగ్‌ వస్తుంది.

ఆపిల్‌ పండు

ఆరోగ్యప్రదాయిని ఆపిల్‌ పండు దంతాల విషయంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ పండులోని కొన్నిరకాల ఆమ్ల గుణాలవల్ల దంతాలపై ఉండే పసుపుపచ్చ రంగు ఊహించని విధంగా మాయమవుతుంది. అందుకే రోజుకో ఆపిల్‌ పండు తినండి.

స్ట్రాబెర్రీ

దంతాలని మెరిసేట్లు చేయాలంటే స్ట్రాబెర్రీ వెరీ గుడ్‌ అంటున్నారు నిపుణులు. స్ట్రాబెర్రీని ముద్దగా చేసి రోజు మార్చి రోజు రాత్రి పూట దంతాల్ని బ్రష్‌ చేయటం వల్ల ఆశించిన ఫలితం వస్తుంది.

ఉప్పు

మీ టూత్‌ పేస్ట్‌లో ఉప్పు ఉందా? అని టీవీ ప్రకటనలు గుప్పిస్తుంటాయి టూత్‌పేస్టు కంపెనీలు. అంటే ఉప్పు ప్రాధాన్యత ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఉప్పు ఆహారంలో రుచికోసం వాడటమే కాకుండా,  దంతాలపై ఉండే మురికి, సూక్ష్మజీవుల్ని అంతమొందించి తెలుపు రంగును తీసుకువచ్చే ఔషధం కూడా.

తులసి

తులసి ఆకులు దంతాలపై ఉండే పాచిని తుదముట్టిస్తుంది. తులసి ఆకుల్ని గ్రైండ్‌ చేసి పేస్టు చేసుకోవాలి. రోజే టూత్‌బ్రష్‌ సహాయంతో దంతాలు శుభ్రపరచుకుంటే ఊహించని ఫలితం కనిపిస్తుంది.

నారింజ

ఆరెంజ్‌ తొక్క దంతాల శుభ్రానికి ఓరేంజ్‌లో ఉపయోగపడుతుంది. ఇందులో కాల్షియం, విటమిన్‌ సి పుష్కలంగా ఉండటం చేత నోటిలో ఉండే బాక్టీరియాని కూడా అంతమొందిస్తుంది. వారానికి మూడుసార్లు నారింజ తొక్కతో దంతాల్ని శుభ్రం చేసుకోవటం వల్ల తెలుపురంగు వస్తుంది.