తళతళలాడే దంతాల కోసం!!

06-11-2017: ఈ మధ్య కాలంలో చాలా మందికి పళ్ల మీద ఎనామిల్‌ పోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది. కూల్‌డ్రింక్స్‌, ఎక్కువగా టీ, కాఫీలు తాగడం, ఎక్కువగా యాంటీ బయాటిక్స్‌ తీసుకోవడం వంటివి పళ్లు పసుపు రంగులోకి మారడానికి కారణమవుతాయి. అయితే దీని కోసం డాక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లోనే దీనికి చక్కని పరిష్కార మార్గం ఉంది.

టూత్‌పేస్ట్‌తో బ్రష్‌ చేసుకోవడం రొటీన్‌. కానీ ఈ సారి వంటసోడా ట్రై చేయండి. ఎందుకంటే ఇది కూడా పళ్లు తళతళా మెరిసేలా చేస్తుంది. రెండు స్పూన్ల బేకింగ్‌ సోడా పౌడర్‌ను గ్లాసు నీళ్లలో కలిపి, పళ్లను తోముకుంటే మంచిది. ఇలా వారానికి కనీసం మూడు సార్లు చేసి చూడండి.
యాపిల్‌ సిడాల్‌ వెనిగర్‌లో కూడా నోటిని శుభ్రపరిచే లక్షణాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉన్న ఎసిటిక్‌ యాసిడ్‌. దీన్ని నోట్లో వేసుకుని పుక్కిలించి ఉమ్మేయాలి. అయితే ఇది పళ్లను తెల్లగా చేయడమే కాకుండా, నోటిలో ఉన్న బ్యాక్టీరియాను కూడా పోగొట్టే బ్లీచింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
పళ్లను శుభ్రపరచడానికి ఆయిల్‌ పుల్లింగ్‌ కూడా దోహదపడుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని పుక్కిలించి, కాసేపటి తర్వాత ఉమ్మేయాలి.