దంతాలు లేని వారి పాలిటి వరం

ఆంధ్రజ్యోతి, 21/03/2013: డెంటల్‌ ఇంప్లాట్స్‌ చేయించుకోవాలన్న ఆలోచన ఉన్నా, చాలా మంది మనసులో ఎన్నో సందేహాలు మొదలవుతాయి. ఇంప్లాంట్స్‌ను దంతాల చిగుర్లలోకి ప్రవేశపెట్టడమే అందుకు కారణం. ఇంప్లాంట్స్‌ను శరీర వ్యాధినిరోధక శక్తి తిరస్కరించదా? ఇంప్లాంట్స్‌ వల్ల ఇన్‌ఫెక్షన్‌ సమస్యలేవీ తలెత్తవా? అసలు ఈ ఇంప్లాంట్స్‌ ఎంతకాలం ఉంటాయి? వంటి ప్రశ్నలెన్నో సహజంగానే వారిలో అంకురించవచ్చు. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇస్తున్నారు వైద్యనిపుణులు డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ నాగుబండి. 

డెంటల్‌ ఇంప్లాంట్స్‌ అంటే ఏమిటి? 
కట్టుడు దంతాలు, బ్రిడ్జిదంతాలు మాత్రమే అందుబాటులో ఉన్న రోజుల్లో వాటి ద్వారా ఎంతో మంది పలురకాల అవస్థలకు గురయ్యారు. ఈ విధానాల్లో పక్కదంతాలకు తీగ బిగించి అమర్చిన దంతాలు ఒక్కోసారి గొంతులోకి జారి ప్రాణాపాయ పరిస్థితి కల్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే దంత వైద్యశాస్త్రం ఒక అడుగు ముందుకేసి డెంటల్‌ ఇంప్లాంట్స్‌ను తయారు చేసింది. అప్పటిదాకా ఉన్న కృత్రిమ దంతాలను రోజూ తీసి, మళ్లీ పెట్టుకోవలసిన అవసరం ఉండేది. కొన్ని రకాల కృత్రిమదంతాల వరుసను పర్మనింట్‌ ఫిక్సింగ్‌ అని చెప్పినా వాటిఓతనూ కొన్ని ఇబ్బందులు ఉండేవి. అందుకే ఈ సమస్యలేవీ లేని రీతిలో వచ్చినవే అత్యాధునిక దంతాలు డెంటల్‌ ఇంప్లాంట్స్‌. సహజమైన దంతాలకు ఉండే దంతపు వేరు లాంటిదే కృత్రిమంగా తయారు చేసి ముందుగా దాన్ని దంతాన్ని అమర్చవలసిన స్థావరం లోకి ప్రవేశపెడతారు. ఇది పునాదిలా ఉపయోగపడుతుంది.ఆ పునాది ఆధారంగానే దంతాన్ని అమరుస్తారు. అలా అమర్చడానికి ముందు పక్కనున్న దంతాన్ని అరగదీయడం గానీ, , లేదా ఆ దంతాన్ని సపోర్టుగా తీసుకోవడం గానీ ఆ అవసరమే ఉండదు.

ఇంప్లాంట్స్‌ను వేటితో తయారు చేస్తారు? 
డెంటల్‌ ఇంప్లాంట్స్‌ ప్రధానంగా టైటానియంతో తయారవుతాయి. ఇవి ఇప్పటికీ విదేశాల నుంచే వస్తున్నాయి. టైటానియం దంతాలు ఇవి సహజదంతాలంత దృఢంగా ఉంటాయి. వీటిని అమర్చడ వల్ల ఇమ్యూనిటీ రిజెక్షన్‌ గానీ, ఇన్‌ఫెక్షన్ల సమస్యగానీ, ఏమీ ఉండదు.
 
వయోపరిమితి ఉందా? 
డెంటల్‌ ఇంప్లాంట్స్‌ పెట్టుకోవడానికి వయోపరిమితి అంటూ ఏదీ లేదు. ఏ వయసు వారికైనా ఇంప్లాట్‌ విధానం ద్వారా దంతాలు కట్టవచ్చు. ఏవో ఒకటి రెండు దంతాలు అని కాదు పైన, కింద రెండు వరుసల్లోనూ ఇంప్లాట్స్‌ పెట్టుకోవచ్చు.

మధుమేహం ఉంటే? 
మధుమేహం ఉన్నవారికి కూడా నిస్సంకోచంగా డెంటల్‌ ఇంప్లాట్స్‌ పెట్టుకోవచ్చు.కాకపోతే, ఇంప్లాంటేషన్‌ చేసే సమయంలో మధుమేహం పూర్తిస్తాయిలో నియంత్రణలో ఉండడం చాలా అవసరం. ఆ మాటకొస్తే జీవితాంతం మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. ఇంప్లాంట్స్‌తో సంబంధం లేకుండా చూసినా మధుమేహం నియంత్రణలో లేనివారు ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ. అందుకు మధుమేహం మాత్రలకే పరిమతమైపోకుండా ఆహార వ్యాయామాల విషయంలోనూ జాగ్ర త్తలు పాటించడం అవసరం.
 
ఇంప్లాంట్స్‌ అమర్చుకోవలసిన చోట ఎముక అవసరం పడుతుందా? 
ఇంప్లాంట్స్‌ వేయడానికి ఎముక అవసరమే. అయితే బాగా సరిపోయే ఎముకలేనప్పుడు కృత్రిమంగా ఎముకను తయారు చేసి ఇంప్లాంట్స్‌ వేసుకోవచ్చు.
 
ఇంప్లాంట్స్‌ ఎవరు వేస్తారు? 
మనదేశంలో ఇంప్లాంటాలజీ డిగ్రీ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. అయితే ఇంప్లాంట్స్‌ అమరికపై ఫెలోషిప్‌ కోర్సు గానీ ట్రెయినింగ్‌ కోర్సుగానీ చేసిన వారు ఈ ఇంప్లాంటేషన్‌ చేయడానికి అర్హులు. స్పెషల్‌ ఎముక లేనప్పుడు ఎముకను అమర్చే విధానంలో త ర్ఫీదు పొందిన వారైనా ఈ ఇంప్లాంటేషన్‌ చేయవచ్చు.
 
ఇంప్లాట్స్‌ ఫెయిల్‌ అవుతాయా? 
ఇంప్లాంటేషన్‌ అనేది పూర్తిగా సర్జికల్‌ ప్రొసీజర్‌. క్వాలిఫైడ్‌ కాని వారు ఈ ఇంప్లాంట్స్‌ వేసినప్పుడు ఫెయిల్‌ అయ్యే అవకాశం ఉంది. క్వాలిఫైడ్‌ వ్యక్తులు ఈ ఇంప్లాంట్స్‌ వేస్తే ఫెయిల్‌ అయ్యే అవకాశం ఉండదు. ఇకపోతే ఇంప్లాంట్స్‌ చేయించుకున్న బహుకొద్ది మందిలో రిజెక్ట్‌ అయ్యే అవకాశం ఉంది. ఏమైనా నిపుణులు ఇంప్లాంటేషన్‌ చేస్తే ఈ సమస్య దాదాపు ఉండదు.
 
ఇంప్లాంట్స్‌ వేసిన తరువాత ఎన్ని రోజులకు దంతాలు అమరుస్తారు? 
ఇంప్లాంట్స్‌ పలురకాలుగా ఉంటాయి. ఎముకల నాణ్యతను బట్టి కూడా విషయం ఆధారపడి ఉంటుంది. ఇమ్మీడియేట్‌ లోడింగ్‌ ఇంప్లాంట్స్‌ వేసుకున్నప్పుడు టెంపర్‌వరీ ఫిక్సెస్‌ ఇచ్చి ఆ తరువాత రెండుమూడు వారాల్లో పర్మనెంట్‌ దంతాలు అమర్చే అవకాశం ఉంది. ఒకవేళ డిలేడ్‌ లోడింగ్‌ వేసినప్పుడు 45 నుంచి 90 రోజుల కాల వ్యవధిలో దంతాలు బిగించే అవకాశం ఉంది. అయితే కేసును బట్టి కూడా ఈ కాల వ్యవధి మారుతూ ఉంటుంది.
 
ఇంప్లాంట్స్‌ శాశ్వతమా? 
ఎంతకాలం ఉంటాయనేది ఎక్కువగా వాటి విషయంలో ఎంత జాగ్రత్తపడతామన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. దాదాపు 20 నుంచి 30 ఏళ్లదాకా పాడవకుండా ఉండిపోయిన ఇంప్లాట్స్‌ కూడా ఉన్నాయి. 

డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ నాగుబండి 
ఎండిఎస్‌ (పిరియడాంటిక్స్‌) 
నాగుబండి లేజర్‌ అండ్‌ ఇంప్లాంట్‌ డెంట ల్‌ హాస్పటల్‌, ఖమ్మం 
ఫోన్‌: 9848095594
www.nagubandidentalhospital.com