అందమైన నవ్వు కోసం స్మైల్‌ డిజైనింగ్‌

ఆంధ్రజ్యోతి,19-12-13
నవ్వులో అందం ఉంటే నలుగురికి నచ్చుతుంది. నవ్వు అందంగా ఉంటే అందరికీ నచ్చుతుంది. అసలు నలుగురిలో నవ్వగలిగే ధైర్యం ఉండాలంటే.. పలు వరస అందంగా ఉండాలి. పరోక్షంగా అందమైన నవ్వుకు మూలం అందమైన పలువరసే. అది లేనప్పుడే నవ్వుకు అందం కొరవడుతుంది. ఇప్పటికీ పలు వరస కరెక్టుగా లేదని నవ్వును దాచుకునేవారెంతోమంది ఉన్నారు. యువతలో ఈ ఆత్మన్యూనత భావం ఎక్కువగా కనిపిస్తోంది. అలాంటి వారిలో ఇన్‌ఫియార్టీని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి స్మైల్‌ డిజైనింగ్‌ చికిత్స అందుబాటులోకి వచ్చిందని అంటున్నారు డాక్టర్‌ శ్రీనివాస్‌. స్మైల్‌ డిజైనింగ్‌ గురించి ఆయన చెబుతున్న వివరాలు. 

అందమైన చిరునవ్వు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఏదో ఒక కారణం వల్ల అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. దంతాలు ఎగుడు దిగుడుగా ఉండటం వల్లనో, పళ్ల మధ్య సందులు ఎక్కువగా ఉండటం వల్లనో, పళ్ల రంగు మారడం వల్లనో ఈ సమస్య చూస్తూ ఉంటాం. దీనివల్ల చాలా మంది నలుగురిలో ఉన్నప్పుడు సరిగా నవ్వలేకపోవడం, నవ్వడానికి ఇబ్బంది పడటం, నవ్వేటప్పుడు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకోవడం చేస్తారు. ఆధునిక విధానాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ స్మైల్‌ డిజైనింగ్‌ చికిత్స ద్వారా చాలా తక్కువ సమయంలో అందమైన చిరునవ్వును సొంతం చేసుకోవచ్చు.

రంగు మారిన దంతాలు: ఫ్లోరోసిస్‌ వల్లకానీ, కాఫీ,టీలు ఎక్కువగా తాగడం వల్లకానీ, పొగ తాగడం ఎక్కువగా అలవాటు ఉండటం వల్లకానీ, పళ్ల రంగు మారడం జరుగుతుంది. దీనివల్ల నవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా రంగు మారిన పళ్లు తిరిగి సాధారణ రంగు రావడానికి ‘బ్లీచింగ్‌ చికిత్స’ ఉంటుంది. దీని ద్వారా పళ్లు తిరిగి సాధారణ పళ్ల రంగుకు మారే అవకాశం ఉంటుంది.
పళ్ల మధ్య సందులు: కొంతమందికి పళ్ల మధ్య సందులు కొద్దిగా ఏర్పడి, రోజులు గడుస్తున్నకొద్దీ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ కారణం వల్ల కూడా నవ్వడానికి ఇబ్బంది ఉండటమే కాకుండా, మాట స్పష్టత కూడా తగ్గుతుంది. దీనికి కాంపోసిట్‌ మెటీరియల్‌ ఉపయోగించి ఆ సందులు కనిపించకుండా చికిత్స చేస్తారు. వెనీర్స్‌ ఉపయోగించి కూడా సందులు మూసి వేయవచ్చు.

ఎగుడు దిగుడుగా ఉన్న దంతాలు: కొందరిలో పళ్లు ఎగుడు దిగుడుగా ఉండి అనేక ఇబ్బందులు కలిగిస్తాయి. నలుగురిలో నవ్వడానికి ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. అంతేకాదు పళ్లను శుభ్రం చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. దీనికి దీర్ఘకాలిక ఆర్థోచికిత్స అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సమస్యను ఆర్థోచికిత్సతో సరిచేయవచ్చు. కానీ అంతకంటే తక్కువ సమయంలో పళ్ల ఎగుడు దిగుడు సమస్యను పరిష్కరించడానికి స్మైల్‌ డిజైనింగ్‌ ఉపయోగిస్తారు. ఇందులో ఎత్తుగా ఉన్న భాగాన్ని తొలిగించి, అవసరమైతే ముందు పళ్లు అన్నింటికీ రూట్‌కెనాల్‌ చికిత్స చేసి కాప్‌లు  పెట్టేస్తారు. ఇది శాశ్వత చికిత్స.

చిగురు ఎక్కువగా కనిపిస్తే?: కొంతమంది నవ్వేటప్పుడు చిగురు భాగం ఎక్కువగా కనిపిస్తుంటుంది. దానికి కూడా స్మైల్‌ డిజైనింగ్‌ ద్వారా మంచి చికిత్స ఉంది. స్మైల్‌ డిజైనింగ్‌తో చిగురు భాగం తక్కువగా కనిపించేలా చేస్తారు.ఇదే కాకుండా బాగా పొడవుగా ఉన్న పళ్లను కూడా తగ్గించి ముఖాకృతికి సరిపోయే విధంగా చేస్తారు. 
ఫిక్స్‌డ్‌ దంతాలు: పళ్లు లేనిచోట పక్కనున్న పళ్ల సపోర్ట్‌తో పెట్టించవచ్చు. ఈ విధానంలో పళ్లు లేని భాగానికి రెండు వైపులా ఉన్న పళ్ల మీద క్యాప్‌ వస్తుంది. దాని సపోర్ట్‌తో పళ్లు లేని చోట కూడా పళ్లు పెట్టవచ్చు. ఇలా పెట్టిన పళ్లు కూడా పక్కనున్ను పళ్ల రంగులోనే ఉంటాయి. అంతే కాకుండా మామూలు పళ్లలాగే వాటిని కూడా అన్ని విధాలా ఉపయోగించుకోవచ్చు.
 
డాక్టర్‌ శ్రీనివాస్‌ ఎండీఎస్‌,
స్టార్‌ డెంటల్‌
సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి
ఫోన్‌: 7416 105 105, 
        90300 854 56