పలువరుస పక్కాగా!

04-06-2018: ముఖం అందంగా కనిపించాలంటే పలువరుస హెచ్చుతగ్గులు లేకుండా ఉండాలి. ఒకవేళ పెరిగే క్రమంలో దంతాలు హెచ్చుతగ్గుల్లో పెరిగినా వాటిని సరిచేసే వీలుంది. అదే... ‘ఆర్థోడాంటిక్స్‌’! ఈ చికిత్సా విధానంలో పలువరుసను రకరకాల పద్ధతుల్లో సరిచేసి చూడముచ్చటగా కనిపించేలా చేయొచ్చు.

 
ఆర్థోడాంటిక్స్‌ అన్ని విధాలుగా సురక్షితమైన చికిత్సా విధానం. అయినా ఈ చికిత్సా విధానం గురించి కొన్ని అపోహలు ఉంటున్నాయి. వాటిని ఒకసారి పారదోలే ప్రయత్నం చేద్దాం!
 
ఆటలు ఆడొచ్చు, పాటలు పాడొచ్చు: దంతాలకు క్లిప్స్‌ వేయించుకుంటే బాగా నొప్పి పెడతాయనే ఓ అపోహ ప్రచారంలో ఉంది. కానీ ఇది నిజం కాదు. 20 ఏళ్లకు ముందు ఎత్తు పళ్లను స్టీలు తీగలు చుట్టి సరిచేసేవారు. ఆ పద్ధతిలో నొప్పి ఉండడం సహజం. కానీ ఇప్పుడు ఈ విధానంలో ఎన్నో మార్పులొచ్చాయి. నికెల్‌ టైటానియం, టి.ఎం.ఎ లాంటి లోహాలతో తయారైన తీగలతో చికిత్స చేస్తే నొప్పి ఉండదు.
 
క్లిప్స్‌ పెట్టుకుంటే బడికెళ్లే పిల్లలకు ఇబ్బందనీ, చదివేటప్పుడు క్లిప్స్‌ అడ్డు పడుతుంటాయని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కూడా అపోహే! క్లిప్స్‌ వల్ల ఆటలు ఆడేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
 
అలాగే క్లిప్స్‌ పెట్టుకుంటే ఆహారం నమిలేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఎముకలు, గట్టి పదార్థాలు మినహా అన్నీ హాయిగా నమిలి తినొచ్చు. అలాగే క్లిప్స్‌ పెట్టుకుంటే మాట స్పష్టంగా రాకపోవడం అనేది కూడా ఉండదు. క్లిప్స్‌ బిగించడం కోసం నాలుగు దంతాలు తీస్తారనీ, దాని వల్ల కళ్లు దెబ్బ తింటాయనీ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ క్లిప్స్‌ కోసం దంతాలను తొలగించరు. క్లిప్స్‌ వాడకం వల్ల దంతాలు దెబ్బతినవు.
 
అయితే క్లిప్స్‌ బిగించి ఉన్నప్పుడు దంతాలు శుభ్రం చేసుకునే సమయంలో ప్రత్యేక పద్ధతులు పాటించాలి. తిన్న వెంటనే నీళ్లతో పుక్కిలించడం, రోజుకి రెండు సార్లు దంత ధావనం తప్పనిసరి.
 
ఖర్చు తక్కువే!: మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో దంతాలకు అమర్చే క్లిప్స్‌ చికిత్స చౌకైనదే! ఆర్థోడాంటిక్స్‌ చికిత్స నిడివి రెండు ఏళ్లపాటు ఉంటుంది. ఇంత సమయాన్ని వెచ్చించగలిగితే దంత సౌందర్యాన్ని శాశ్వతంగా పొందే వీలుంది. అర్థోడాంటిక్స్‌కు సుమారు 25 వేల రూపాయలు ఖర్చవుతుంది.
 
ఈ చికిత్సతో వృద్ధులకు మేలు!: దంతాల అవసరం వృద్ధులకే ఎక్కువ. వృద్ధాప్యంలో ఎగుడుదిగుడుగా తయారయ్యే దంతాల కారణంగా, వాటిని శుభ్రపరుచుకోవడం కష్టమై, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్లు వేధిస్తాయి. ఈ ఇన్‌ఫెక్షన్ల కారణంగా దంతాలు వదులై ఊడిపోతూ ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే దంతాలు బలంగా ఉండాలి. ఇందుకోసం ఎత్తు పళ్లు, వంకర పళ్లు, విరిగిపోయిన పళ్లకు వృద్ధులు నిరభ్యంతరంగా చికిత్స చేయించుకోవచ్చు.
 
రకరకాల క్లిప్స్‌
చూడడానికి ఎబ్బెట్టుగా కనిపించకుండా ఉండే రంగురంగుల క్లిప్స్‌ ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. తెలుపు రంగు, పారదర్శకమైన క్లిప్స్‌ పెట్టుకుంటే వాటిని అమర్చుకున్నట్టు ఎవరూ కనిపెట్టలేరు.
 
క్లిప్స్‌ చికిత్స వల్ల దంతాలు అందంగా కనిపించడంతోపాటు, వ్యాధులూ దరి చేరకుండా ఉంటాయ. దంతాలు పటిష్టంగా కూడా ఉంటాయి కాబట్టి అన్ని ఆహార పదార్థాలూ తినగలుగుతారు. దాంతో ఆరోగ్యమూ నిక్షేపంగా ఉంటుంది.

డాక్టర్‌ ఎన్‌.కె.ఎస్‌ అరవింద్‌,

ఆర్థోడాంటిస్ట్‌ అండ్‌ డెంటల్‌ క్లినిక్‌ సంచాలకులు
ఫోన్‌: 9573780006
వెబ్‌సైట్: draravinds.com