ఆధునిక చికిత్సలతో అందమైన దంతాలు మీ సొంతం

05-12-13

నలుగురిలో సంకోచం లేకుండా మనసారా నవ్వలేకపోతున్నారా? నవ్వేటప్పుడు మీకు తెలియకుండానే చేతిని నోటికి అడ్డంపెట్టుకుంటున్నారా? మీ నవ్వు కన్నా ఇతరుల నవ్వు చాలా బాగుంటుందని అనిపిస్తోందా? దంత సమస్యల మూలంగా డిప్రెషన్‌ పెరిగిపోతోందా? ఆ భయాలేవీ అక్కర్లేదు. ఇప్పుడున్న ఆధునిక చికిత్సా విధానాలతో సులువుగా ఆకర్షణీయమైన దంతాలను సొంతం చేసుకోవచ్చని అంటున్నారు దంతవైద్య నిపుణులు డాక్టర్‌ సురేష్‌.
 
ఆకర్షణీయమైన నవ్వు లేకున్నా, చక్కటి పలువరుస లేకున్నా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇప్పుడున్న ఆధునిక చికిత్సలతో దంతాలను తెల్లగా మిలమిలమెరిసే విధంగా మార్చుకోవ చ్చు. సరైన ఆకృతిలో ఉండేలా చేసుకోవ చ్చు. పలువరుస మధ్య సందులు లేకుండా చేసుకోవచ్చు. ఎలాంటి దంత సమస్యలకైనా ఇప్పుడు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. 
వైటెనింగ్‌/ టూత్‌ బ్లీచింగ్‌
ఇది చాలా సాధారణంగా చేయించుకునే చికిత్స. ఈ చికిత్సలో బ్లీచింగ్‌ జెల్‌, బ్లీచింగ్‌ స్ట్రిప్స్‌, బ్లీచింగ్‌ బెన్‌, లేసర్‌ బ్లీచింగ్‌ అని రకరకాలుగా చేయవచ్చు. తీసుకునే ఆహారపదార్థాలు, పానీయాల వల్ల, నోట్లో ఉండే ఆమ్ల గుణం వల్ల దంతాలు రంగు మారడం, దంతాల మీద చారల్లా ఏర్పడటం జరుగుతుంది. పొగతాగడం, కాఫీ, టీలు తాగడం, కొన్ని రకాల మందులు వాడటం ద్వారా దంతాలు రంగు మారే అవకాశం ఉంటుంది. ఫ్లోరోసిస్‌ వల్ల కూడా దంతాలు రంగు మారతాయి. కారణం ఏదైనా రంగు మారిన దంతాలు ఈ చికిత్సతో సాధారణ రంగుని సంతరించుకుంటాయి. దంతాల ఆకృతిని సరిదిద్దడంలో కొంత భాగం పైపొరని తొలగించి పళ్లు ఆకర్షణీయంగా కనిపించేటట్టు చేయవచ్చు. ఈ పద్ధతిలో బాగా పెద్దగా ఉన్న దంతాలను, పొడవు ఎక్కువగా ఇబ్బందిగా అనిపిస్తున్న దంతాలను ముఖానికి సరిపోయే విధంగా తీర్చిదిద్దవచ్చు. 
బాండింగ్‌
ఇందులో పంటి రంగులో ఉండే కాంపోసిట్‌ అనే పదార్థాన్ని ఉపయోగించి దంతాలపై పొరలాగా వేసి గట్టిపడ్డాక పాలిష్‌ చేయడం జరుగుతుంది. 
డెంటల్‌ బ్రిడ్జెస్‌
ఇందులో దంతాలు లేని చోట కృత్రిమ దంతాలను అమర్చడం జరుగుతుంది. ఇందుకోసం పక్క దంతాల సహాయం తీసుకోవడం జరుగుతుంది. ఇవి చూడటానికి సహజమైన దంతాల మాదిరిగానే ఉండటం కాకుండా నమలడానికి కూడా ఉపయోగపడతాయి. ఊడిపోయిన దంతాలను, ప్రమాదవశాత్తు కోల్పోయిన దంతాలను ఈ ప్రక్రియలో తిరిగి అమర్చుతారు. 
 
వెనీర్స్‌ 
ఈ ప్రక్రియలో సన్నటి పొరలాగా పన్నుపై భాగంలో బాండింగ్‌ విధానంలో అమర్చడం జరుగుతుంది. ఇది రంగుమారిన పళ్లను సాధారణ రంగులో మార్చడానికి, దంతాల మధ్యన ఉన్న సందులను సరిచేయడానికి ఉపయోగపడుతుంది. ఈ చికిత్సను రెండు సిట్టింగ్స్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి సిట్టింగ్‌లో దంతాల కొలత లను అచ్చుల ద్వారా తీసుకుని ల్యాబ్‌కు పంపించడం జరుగుతుంది. ల్యాబ్‌లో కొలతలకు సరిపడా దంతాలను తయారుచేస్తారు. రెండవ సిట్టింగ్‌లో వాటిని అమర్చడం జరుగుతుంది. 
చిగురు సరిచేయడం 
కొంతమందిలో నవ్వినపుడు చిగురు ఎక్కువగా కనిపిస్తుంది. కాస్మెటిక్‌ డెంటల్‌ చికిత్స ద్వారా చిగుళ్లను సరిచేసి నవ్వినపుడు ఎక్కువగా కనిపించకుండా చేయవచ్చు. 
బైట్‌ రిక్లమేషన్‌ 
వయసు పైబడుతున్న కొద్దీ దంతాలు అరగడం సహజంగా జరుగుతుంది. అయితే బాగా ఎక్కువగా దంతాలు అరగడం వల్ల పొడవు త గ్గిపోతాయి. దీంతో ముఖపరిమాణం తగ్గి, నవ్వినపుడు ఇబ్బందిగా ఉంటుంది. అనవసరమైన ముడతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ చికిత్సలో బైట్‌ని పెంచి ముఖపరిమాణం సరిచేసి అనవసర ముడతలు పోగొట్టడం జరుగుతుంది. 
క్రౌన్స్‌ (కృత్రిమదంతాలు)
పన్నుకు ఒక తొడుగు మాదిరిగా తొడగడం జరుగుతుంది. సరియైన ఆకృతి లేని దంతాలను సరిచేయడంలో, బలహీనంగా ఉన్న దంతాన్ని కాపాడటానికి, విరిగిన పన్నును సరిచేయడానికి ఈ చికిత్స ఉపయోగపడుతుంది. ప్రమాదంలో కోల్పోయిన దంతాలను అమర్చడానికి, డెంటల్‌ ఇంప్లాంట్స్‌ను అమర్చడానికి, రూట్‌కెనాల్‌ చేసిన దంతాలకు బలానివ్వడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. 
ఎనామిల్‌ షేపింగ్‌
దంతాలలో 3 పొరలుంటాయి. బయటకు కనిపించే పొరను ఎనామిల్‌ అంటారు. ఈ ఎనామిల్‌ను సరైన ఆకృతిలో తయారుచేస్తారు. దంతాలు ఒకదానిపై మరొకటి ఉన్నట్లయితే ఈ ప్రక్రియ ద్వారా సరిచేయవచ్చు. విరిగిన దంతాలకు, అందవికారంగా ఉన్న దంతాలను సరిచేయడానికి ఈ ప్రక్రియ బాగా ఉపకరిస్తుంది. 
ఇంప్లాంట్స్‌
ఇంప్లాంట్‌ అంటే కృత్రిమ వేరు భాగాన్ని అమర్చడం. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నది. ఇంప్లాంట్‌లో 3 భాగాలుంటాయి. 1) టైటానియం మెటల్‌ స్ర్కూ. దీన్ని దవడ ఎముకలో అమర్చుతారు. 2) దీనిపై చిగురుకు అంటుకుంటూ ఉండే ఆధారిన్నిచ్చే భాగం. 3) దీనిపై కృత్రిమ దంతాన్ని అమర్చుతారు. ఈ ఇంప్లాంట్స్‌ను ఒక్క దంతాన్ని అమర్చడానికి, మొత్తం దంతాల సెట్‌ను అమర్చడానికి ఉపయోగిస్తారు. ప్రక్రియ పూర్తికావడానికి ఆరునెలల సమయం పడుతుంది. ఈ చికిత్సలతో ఎలాంటి దంత సమస్యలైన దూరమై ఆకర్షణీయమైన నవ్వు సొంతం అవుతుంది. 
 
 
డాక్టర్‌ సురేష్‌ ఎమ్‌డీఎస్‌
స్టార్‌ డెంటల్‌
సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి
ఫోన్స్‌ : 7416 105 105 
         90300 854 56