వణికిస్తాయ్‌..జాగ్రత్త!

  • సీజన్‌ మార్పు..పొంచి ఉండే వ్యాధులు
  • జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యనిపుణులు

వర్షాకాలం వెళ్ళి శీతాకాలం వచ్చే రోజుల్లో వాతావరణ మార్పులు కలిగి ప్రజలు అనారోగ్యాల పాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల చలి తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో ప్రజలు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే వ్యాధుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు పాలకొల్లు ఆరోగ్య విస్తరణాధికారి గుడాల హరిబాబు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జ్వరాలు వంటి వ్యాధులు వస్తే తీసుకోవలసిన నివారణ చర్యలను గురువారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 

మలేరియా
మలేరియా అనే వ్యాధి అనాఫిలిస్‌ జాతికి చెందిన ఆడదోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈవ్యాధి కలిగిన రోగిని కుట్టి రక్తం పీల్చుకుంటుంది. ఆదోమ ఇతర ఆరోగ్య వంతులను మళ్ళీ కుట్టినప్పడు వారికి 10 -15రోజుల తరువాత జ్వరం వస్తుంది. 
లక్షణాలు : తీవ్రమైన చలి జ్వరంతో ప్రారంభవుతుంది. తలనొప్పి, ఒంటినొప్పులు, వణుకుతో కూడిన చలి రావడం, చెమటలు పట్టడం ఉంటుంది. 
నివారణ: మలేరియా జ్వరం వచ్చినట్టు అనుమానం వస్తే తక్షణమే దగ్గరలో ఉన్న వైద్యుల వద్దకు వెళ్ళి చికిత్స పొందాలి. వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. 
తీసుకోవలసిన జాగ్రత్తలు : ఇంటి పరిసరాల్లో గుంతలు, గోతులు ఉండరాదు. ఉంటే వాటిలో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి బయట పడుకునే వారు దోమ తెర ఏర్పాటు చేసుకోవాలి. ఇంటిపైకప్పులో ఉన్న నీళ్ళట్యాంకులు, కూలర్స్‌ వంటి వాటిలో, నీటి తొట్టెల్లో దోమలు పెరగకుండా చూసుకోవాలి. 

చికున్ గున్యా
చికున్ గున్యా వ్యాధిని గునియా జ్వరము అని అంటా రు. చికున్ గున్యా వ్యాధి ఎడిస్‌ అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. 
లక్షణాలు : చలి జ్వరం. తలనొప్పి, వాంతులు, కీళ్ళ నొప్పు ఉంటాయి. 
వ్యాధి నివారణ : నీళ్ల ట్యాంకులు, ఇతర నిల్వ పాత్రలపై మూతలు తప్పనిసరిగా ఉంచాలి. చికెన్ గున్యా జ్వరం లక్షణాలు కనిపించిన తక్షణమే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. కనీసం పది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. 


డెంగీ జ్వరం
డెంగీ జ్వరం ఆర్పోవైరస్‌ జాతికి చెందిన వైరస్‌ క్రిమి వల్ల వస్తుంది. ఈవైరస్‌ అతి సూక్ష్మమైనది. కంటికి కనిపించదు. ఈవైరస్‌ ఎయిడిస్‌ ఈజిస్ట్‌ జాతి దోమ ద్వారా రోగగ్రస్తుల నుంచి ఆరోగ్య వంతులకు సంక్రమిస్తుంది. ఈదోమను టైగర్‌ దోమ అనికూడా పిలుస్తారు. ఈదోమలు సాధారణంగా పగటి పూటనే మనుష్యులను కుడతాయి. ఈదోమలు కట్టిన తర్వాత 5నుంచి 8 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. 
లక్షణాలు : ఉన్నట్టుండి జ్వరం ఉధృతంగా వస్తుంది. తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా నొసటపై తలనొప్పి ఉంటుంది. కంటిలోపల నొప్పి వచ్చి కంటి కదలికలను తగ్గిస్తుంది. కన్ను కదిలినప్పుడు నొప్పిగా ఉంటుంది. కండరాలు, కీళ్లనొప్పి కూడా ఉంటుంది. 
వ్యాధి నివారణ : పైలక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి వెళ్ళి చికిత్స పొందాలి. ఈవ్యాధికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు.