ఇంట్లోనే డెంగ్యూ నిర్ధారణ

1-10-15

డెంగ్యూ వ్యాధి విస్తరిస్తోందన్న వార్తల నేపథ్యంలో వంట్లో కాస్త నలతగా ఉన్నా వైద్య పరీక్షా కేంద్రాలకు పరిగెత్తే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఓ చిన్న పరీక్షతో ఇంట్లోనే డెంగ్యూ నిర్ధారణ చేసుకోవచ్చని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రాథమిక స్థాయిలో వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఈ పరీక్షలో పాజిటివ్‌గా తేలినా.. వ్యాధి ప్రారంభ దశలో ఉండడం వల్ల ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుందని వివరించారు. టోర్నిక్వెట్‌ టెస్ట్‌గా వ్యవహరించే ఈ పరీక్ష.. వైద్యులు బీపీ చూసే విధానాన్ని పోలి ఉంటుందని చెప్పారు. ఈ కిట్‌లోని పట్టీ (బ్యాండేజ్‌)ని భుజం ప్రాంతంలో అతికించి కొన్ని నిమిషాలపాటు అలాగే ఉంచాలని తెలిపారు. పట్టీని తీసేసి ఆ ప్రాంతంలో ఎరుపు రంగు మచ్చలను లెక్కించాలని చెప్పారు. వీటి సంఖ్య 20 కంటే ఎక్కువైతే డెంగ్యూ పాజిటివ్‌ అని నిర్ధారణ అయినట్లేనని వివరించారు. అయితే ఈ టెస్ట్‌ స్ర్కీనింగ్‌ కోసమే ఉద్దేశించినదని వారు స్పష్టం చేశారు. దీంతో చీటికీమాటికి ఆస్పత్రుల చుట్టూ తిరిగే ఇబ్బందిని తొలగించుకోవచ్చన్నారు. ఈ పరీక్షను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించిందని తెలిపారు.