ఆన్‌లైన్‌ ఆరోగ్య వేదిక

03-08-2017: అల్లం రసం, తేనె కలుపుకుని తాగితే దగ్గు తగ్గుతుంది. పరగడుపునే తులసి ఆకులు తినటం ఆరోగ్యకరం...ఇలాంటి ఆరోగ్య సూత్రాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. అయితే వీటిలో దేన్ని పాటించాలో, ఏ చిట్కా ఫలితాన్నిస్తుందో అర్థం కాక అయోమయంలో పడిపోతూ ఉంటాం. ఇలాంటి సంశయాలకు చెల్లు చీటీ రాయాలనుకున్న కొందరు కేరళ వైద్యులు అందుకోసం ఏకంగా ఓ ఫేస్‌బుక్‌ పేజీనే క్రియేట్‌ చేసేశారు. .‘ఇన్‌ఫో క్లినిక్‌’ ఫేస్‌బుక్‌ పేజీతో ప్రజల ఆరోగ్య సందేహాలను నివృత్తి చేస్తున్న కేరళ యువ వైద్యుల వివరాల్లోకి వెళ్తే..

కేరళలో వర్షాకాలం వచ్చిందంటే లెక్కలేనన్ని నీటి సంబంధ వ్యాధులు విజృంభించేస్తాయి. వాటిలో ఒకటి డెంగ్యూ.
 
ఈ వ్యాధికి కేరళ ప్రజలు ఓ వంటింటి చిట్కాను ప్రయోగిస్తూ ఉంటారు. బొప్పాయి ఆకుల రసం తాగటం ద్వారా డెంగ్యూ వల్ల రక్తంలో తగ్గిన ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చనేది అక్కడి ప్రజల నమ్మకం. ఈ నమ్మకానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకపోయినా అందరూ ఆచరిస్తున్నారు కదా అని ఆఖరుకి వైద్య వృత్తిలో ఉన్న వాళ్లూ అదే బాట పట్టారు. దాంతో తగిన చికిత్స అందక వ్యాధి తీవ్రమై ఆస్పత్రులకు పరుగులెత్తే రోగుల సంఖ్య పెరిగిపోయింది. ఇందుకు అసలు కారణాన్ని కనిపెట్టిన కొందరు యువ వైద్యులు ఇలాంటి పిచ్చి నమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో ‘ఇన్‌ఫో క్లినిక్‌’ అనే ఓ ఫేస్‌బుక్‌ పేజీని తయారు చేశారు. దీన్లో డెంగ్యూకు అనుసరిస్తున్న వైద్యం నిరాధారమైనదని, అందుకు మెడికల్‌ జర్నల్స్‌, శాస్త్రీయ అధ్యయనాలను ఆధారాలుగా చూపారు. దాంతో ఆ పోస్ట్‌కు ఆదరణ పెరిగింది. ఆఖరుకు రాష్ట్ర ఆరోగ్య విభాగంలోని ఇన్‌స్పెక్టర్లు కూడా తమ ఈ యువ వైద్యులు నిరూపించిన విషయాన్ని పాఠాలతో కలిపి చెప్పటం మొదలుపెట్టారు.
 
 
అర్థంలేని నమ్మకాలకు చెల్లు చీటీ
డెంగ్యూ వ్యాధికి బొప్పాయి వైద్యం నిరాధారమైనదని నిరూపిస్తూ ఈ యువ వైద్యులు రాసిన ఫేస్‌బుక్‌ పేజి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్త ప్రజలెందరికో చేరింది. ఇప్పటిదాకా దీన్ని కొన్ని వేల మంది షేర్‌ చేశారని, వందల్లో కామెంట్లు వచ్చాయని, ఆ పేజీకి అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న కోళిక్కోడ్‌లోని ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో ఉద్యోగిని ‘షిమ్మా అజీజ్‌’ మీడియాకు చెప్పింది. గతేడాది అక్టోబరు 11న ప్రారంభమెన ఇన్‌ఫో క్లినిక్‌ ప్రస్తుతం సాధారణ ప్రజలకు ఆరోగ్యం, వ్యాధులు, వాటికి వైద్య చికిత్సల గురించి ఎన్నో అనుమానాలను తీర్చే వేదికగా నిలిచింది.
 
వైద్యులే అడ్మినిస్ట్రేటర్లు
ఇన్‌ఫో క్లినిక్‌ మరో అడ్మిన్‌ అయిన కొట్టాయం ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌ లెక్చరర్‌ పి.ఎ్‌స.జినేష్‌ ‘ఇన్‌ఫో క్లినిక్‌’ ప్రారంభానికి కారణం వివరిస్తూ...‘చాలా చోట్ల టీకాలు, ఆధునిక వైద్యాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. అలాంటి అర్థంలేని నమ్మకాల్ని పాటించటం ప్రజల ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి మా వంతుగా ప్రజల్ని ఎడ్యుకేట్‌ చేయటం కోసం సోషల్‌ మీడియాను ఎంచుకున్నాం’ అని చెప్పాడు. మొదట్లో ఈ పేజిని నలుగురు, ఐదుగురు డాక్టర్లు మాత్రమే సందర్శించేవారు. ఇప్పుడు ఐదుగురు అడ్మిన్లు, పాతిక మంది డాక్టర్లతో మధ్య చర్చలు, వ్యాసాలతో పేజి ఎందరో ప్రజల అనుమానాలను నివృత్తి చేసే స్థాయికి ఎదిగింది.
 
36 మంది ఫాలోవర్లు, 35 వేల లైకులు
‘ఇన్‌ఫో క్లినిక్‌’లో ఓ అంశం గురించిన సమాచారం పోస్ట్‌ చేసేముందు దానికి సంబంధించిన వైద్యపరమైన అంశాల గురించి వైద్యులంతా చర్చించుకుంటారు. తమ దగ్గరున్న సమాచారాన్ని క్రాస్‌ చెక్‌ చేసుకుంటారు. వాదనలు, ప్రతివాదనలు సాగుతాయి. ఫలితంగా తాము చెప్పదలుచుకున్న అంశం తుది రూపు సంతరించుకున్న తర్వాతే వైద్యులు ఆ విషయాన్ని ఫేస్‌బుక్‌లో పెడుతుంటారు. ఈ వైద్య బృందానికి ప్రజల నుంచి రకరకాల వ్యాధుల గురించి సందేశాలు వస్తూ ఉంటాయి. వాటికి సమాధానాలు కూడా రాస్తూ ఉంటారీ యువ వైద్యులు. ప్రస్తుతానికి ఇన్‌ఫో క్లినిక్‌లో వైద్యులు వారానికి 3 పోస్టులు పెడుతున్నారు. 36 వేల మంది ఫాలోవర్లతో, 35 వేల లైక్‌లతో ‘ఇన్‌ఫో క్లినిక్‌’ ప్రజల్లో ఆరోగ్య చిట్కాల పట్ల ఉన్న భ్రమల్ని పటాపంచలు చేస్తూ వేగంగా మరింత ముందుకు దూసుకుపోతోంది.