మహమ్మారి మలేరియా

ఆంధ్రజ్యోతి, 25-04-2017: ప్రస్తుతం మలేరియాను నివారించటానికి మందు అందుబాటులో లేదు. క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఒక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇది అందుబాటులోకి రావటానికి మరో పదేళ్లు పడుతుంది.
 
ప్రొటీన్లను అడ్డుకుంటే.. 
మలేరియా పరాన్నజీవులు మనిషి ఎర్ర రక్త కణాలలోకి ప్రవేశించి నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఆ తర్వాత కొన్ని రకాల ప్రొటీన్లను విడుదల చేస్తాయి. వీటి వల్ల ఎర్ర రక్త కణాలు బలహీనపడతాయి. పరాన్నజీవుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతుంది. బర్నెట్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తాజాగా చేసిన పరిశోధనల్లో ఈ ప్రొటీన్లను అడ్డుకోవటం ద్వారా మలేరియాను నివారించవచ్చని తేలింది.
 
2.12 కోట్ల మందికి.. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) గణాంకాల ప్రకారం- 2015లో ప్రపంచవ్యాప్తంగా 2.12 కోట్ల మందికి మలేరియా సోకింది. వీరిలో 4.18 లక్షల మంది మరణించారు. దక్షిణ ఆసియాలో మొత్తం మలేరియా కేసుల్లో 70 శాతం భారతలోనే నమోదు అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం- ప్రపంచ జనాభాలో 40 శాతం మందికి మలేరియా సోకే అవకాశముంది.
 
2014లో 
మన దేశంలో 11 లక్షల కేసులు నమోదు అయ్యాయి. 562 మంది మరణించారు. 
2016లో 
మన దేశంలో మలేరియాను పూర్తిగా నివారించటానికి నేషనల్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ మలేరియా ఎలిమినేషన్‌ (ఎన్‌ఎఫ్‌ఎంఈ) అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
1100 కోట్ల రూపాయల నష్టం.. 
ఈ కార్యక్రమంలో భాగంగా సేకరించిన సమాచారం ప్రకారం 2012లో మన దేశ ఆర్థిక వ్యవస్థకు మలేరియా వల్ల 194 కోట్ల డాలర్ల (దాదాపు 1100 కోట్ల రూపాయలు) నష్టం వచ్చింది.
 
తాజాగా.. 
మలేరియా ప్రొటీన్‌ నుంచి తయారు చేసిన మందు ద్వారా బ్లాడర్‌ క్యాన్సర్‌ తగ్గే అవకాశముందని ఇటీవలే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ తరహా క్యాన్సర్‌ వస్తే కిమోథెరపీ కూడా పనిచేయదు.