లైటు వెలుగుతో దోమకాటుకు చెక్‌

 10 నిమిషాల కాంతితో 2 గంటలపాటు రక్షణ
రంగు మార్చుతున్న మలేరియా దోమ
మారుతున్న వేళలు.. మందులకు నిరోధకత
వాషింగ్టన్‌, బెర్లిన్‌, జూన్‌ 18: విద్యుత్ దీపాల వెలుగు మలేరియా వ్యాప్తిని తగ్గిస్తోందా.. దోమ కాటును, తద్వారా మలేరియాను తప్పించుకోవడానికి లైటు తోడ్పడుతోందా.. అంటే శాస్త్రవేత్తలు అవుననే జవాబిస్తున్నారు. లైటు వెలుగులో ఓ పది నిమిషాల పాటు ఉంటే ఈ దోమల సామర్థ్యం తగ్గిపోతోందని తాజా అధ్యయనంలో తేలిందట! వేగంగా ఎగిరే శక్తిని ఈ కాంతి హరించివేస్తుందని, కాటు వేసే శక్తి కూడా వాటికి ఉండడంలేదని యూనివర్సిటీ ఆఫ్‌ నోట్రె డేమ్‌ పరిశోధకులు తెలిపారు. ఈ పది నిమిషాల కాంతి ప్రభావం వాటిపై దాదాపుగా రెండు గంటల పాటు ఉంటోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రతీ రెండు గంటలకు ఓసారి లైటు వెలుగును ప్రసరించేలా చేస్తూ దోమకాటునుంచి, వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.
 
ఆహారాన్వేషణ వేళల్లో మార్పు..
మలేరియా కారక దోమ అనోఫిలిస్‌ గ్యాంబి మస్కిటో సాధారణంగా రాత్రివేళల్లోనే కుడుతుందని వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గిల్స్‌ డఫీల్డ్‌ తెలిపారు. రాత్రివేళల్లో దోమ తెరలు, మస్కిటో కాయిల్స్‌, ఫిల్లర్స్‌ తదితర సాధనాలతో దోమకాటు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటాం.. ఈ నేపథ్యంలో అనోఫిలిస్‌ దోమ రూటు మార్చుకుంటోందని ఆయన హెచ్చరిస్తున్నారు. దోమల నివారణకు ఉపయోగించే వివిధ క్రిమి సంహారక మందులకు నిరోధకత పెంచుకుంటోందన్నారు. రాత్రివేళల్లో మాత్రమే ఆహారాన్వేషణ జరిపే ఈ దోమ తన సమయాన్ని మార్చుకుంటోంది. సాయంకాలం పూట, తెల్లవారు జామున ఆహారం కోసం బయలుదేరుతోంది. రాత్రిపూట దోమ కాటును తప్పించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాం.. కానీ పొద్దుపోయిన తర్వాత, తెల్లవారుజామున వీటిని ఉపయోగించే అవకాశం తక్కువని డఫీల్డ్‌ తెలిపారు. దీనిని అనోఫిలిస్‌ అవకాశంగా తీసుకుంటోందని వివరించారు. మలేరియా నిర్ధారణకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంప్రదాయ పద్ధతులకన్నా మెరుగైన రక్తపరీక్షను అభివృద్ధి చేసినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో వ్యాధి నిర్ధారణ మరింత వేగంగా, కచ్చితంగా చేయవచ్చని మ్యూనిచ్‌ టెక్నికల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వివరించారు. సాధారణ పరిస్థితులలో వ్యాధి నిర్ధారణలో తీవ్ర జాప్యం, ఫలితాలలో కచ్చితత్వం లోపించడం మలేరియా ప్రబలడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.