బొప్పాయి రసంతో డెంగీ వ్యాధికి విరుగుడు

ఆంధ్రజ్యోతి, 12-10-13: జుహూ విలే పార్లేలోని ఒక నర్సింగ్‌ హోమ్‌లో ఆరేళ్ల అర్చన డెంగీ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది. అప్పటికే సుమారు ఏడు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసిన తల్లితండ్రులు కుమార్తె ఆరోగ్యం గురించి తల్లడిల్లిపోతున్నారు. ఆ అమ్మాయి రక్తంలోని ప్లేట్‌లెట్‌లు పడిపోకుండా ఉండడానికి పిఎక్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తున్న డాక్టర్లు కూడా ఆ అమ్మాయి బతుకుతుందో లేదో చెప్పలేని స్థితిలో ఉన్నారు. అప్పటికి పది రోజుల నుంచి చికిత్స జరుగుతున్నా ఎక్కడా మెరుగుదల కనిపించకపోవడంతో తల్లితండ్రుల్లో కంగారు ఎక్కువైంది. 

పక్క గదిలోనే తన భార్యకు శ్వాసకోశ సంబంధమైన వ్యాధికి వైద్యం చేయిస్తున్న ఓ వ్యక్తి వీళ్లను గమనిస్తూనే ఉన్నాడు. మొదట్లో ఆయన ఎక్కడా కల్పించుకోలేదు. తన గొడవలో తాను ఉన్నాడు. కానీ, ఒక రోజున తన పక్కనే దిగాలుగా కూర్చుని ఉన్న అర్చన తండ్రిని మాటల్లోకి దించాడు. అతనికి విషయం తెలిసింది. ‘‘నేను మీ అమ్మాయికి డెంగీ వ్యాధి తగ్గే ఉపాయం చెబుతాను, చేస్తారా?’’ అని అడిగాడు. అర్చన సరేనన్నాడు. ఆయన బయటికి వెళ్లిపోయి ఓ గంట తరువాత తిరిగి వచ్చాడు. రాగానే అర్చన దగ్గరికి వెళ్లి ఓ చిన్న గ్లాసులో తెచ్చిన ద్రావకాన్ని ఆమె గొంతులో పోశాడు. 
 
 అర్చన తల్లితండ్రులికి భయం వేసింది. డాక్టర్లు చూస్తే తమను నర్సింగ్‌ హోం నుంచి గెంటేసే ప్రమాదం ఉందని వాళ్లు భయపడ్డారు. కాస్సేపటికి డాక్టర్‌ వచ్చి అర్చనను పరీక్షించాడు. ప్లేట్‌లెట్లు పెరిగాయి! ఆయన ఆశ్చర్యపోయాడు. ‘‘మీ అమ్మాయి చికిత్సకు స్పందిస్తోంది. ప్లేట్‌లెట్లు పెరిగాయి’’ అని సంతోషంగా చెప్పాడు. అర్చన తండ్రికి ఆ పక్క గదిలోని వ్యక్తి మీద నమ్మకం కుదిరింది. అతను మూడు రోజుల పాటు వరుసగా అర్చన నోట్లో పసరు (ద్రావకం) పోశాడు. అంతే! అర్చన లేచి కూర్చుంది. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ‘‘ఆమె విషయంలో ఏదో అద్భుతం జరిగింది. నిజానికి మేం ఆశలు వదిలేసుకున్నాం’’ అని వాళ్లు అర్చన తండ్రికి చెప్పారు.
 
 అర్చన తండ్రి ఆ పక్క గది వ్యక్తితో మాట్లాడి ఆ పసరు గురించి తెలుసుకున్నాడు. అర్చనను ఇంటికి తీసుకు వచ్చిన తరువాత ఆయన ఆ పసరు రహస్యాన్ని బయటపెట్టాడు. ఇ-మెయిల్‌ ద్వారా తన స్నేహితులందరికీ ఈ పసరు గురించి తెలియజేశాడు. తన మెసేజ్‌ని వీలైనంతమందికి పంపించాలని కూడా ఆయన సూచించాడు. ఇంతకూ ఆ పసరు బొప్పాయి ఆకుల రసం! డెంగీ వ్యాధిని నివారించగలిగింది బొప్పాయి కాయ, బొప్పాయి ఆకులు. బొప్పాయి రసంతో కూడా డెంగీని నివారించవచ్చు. 
 
 బొప్పాయి కాయ మనిషికి ప్రకృతి అందించిన కానుక. దాన్ని వీలైనప్పుడల్లా తింటూ ఉండడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరానికే కాదు, మనసుకు కూడా ఎంతో మంచిది. బొప్పాయిని తరచూ తిన్నవారికి రాళ్లు తిన్నా జీర్ణమవుతాయి. త్వరగా వయసు మీద పడదు. చర్మం ముడతలు పడడాన్ని నివారిస్తుంది. శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. పుంసత్వానికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే, అతి వేగంగా తగ్గిపోతాయి. ఆటలకు, ఆటల పోటీలకు వెళ్లే ముందు బొప్పాయి ముక్కలు తిని వెడితే, శరీరంలో చివరి క్షణం వరకూ శక్తి, సత్తువ ఉంటాయి. 
 
 ఇక ఇది శరీరానికి అవసరమైన సి, ఇ విటమిన్లను అందజేస్తుంది. ఫలితంగా శరీరానికి కేన్సర్‌ సోకదు. కేన్సర్‌ కణాలను పెరగనివ్వదు. ఒంట్లో నొప్పులు, గాయాలు, రక్తస్రావాలు, బొబ్బలు, పుళ్లు, కీళ్లనొప్పులు వగైరాలు తగ్గాలన్నా, వ్యాధుల నుంచి వేగంగా కోలుకోవాలన్నా బొప్పాయి ముక్కలే సరైన మందు. రక్తాన్ని, చర్మాన్ని, దంతాలను, జీర్ణకోశాన్ని, ఊపిరితిత్తుల్ని, గుండెను క్షణాల్లో శుభ్రం చేస్తుంది. బొప్పాయిలోని పీచు పదార్థం కొలెస్టరాల్‌ని అతి త్వరగా కరగిస్తుంది. గుండె జబ్బుల్ని దగ్గరికి రానివ్వదు. ఉదయమే తింటే శరీరానికి చాలా మంచిది.