డెంగ్యూ దోమకు చోటివ్వొద్దు

21-11-13

వానాకాలం వచ్చిందంటే డెంగ్యూ జ్వరం ఏ రేంజ్‌లో భయపెడుతుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే డెంగ్యూ జ్వరం వానకాలం వరకే పరిమితమా? ఆ తరువాత దాని పరిణామాలు ఉండవా? అంటే కచ్చితంగా ఉంటుందనీ, సంవత్సరంలో ఏ కాలంలోనైనా డెంగ్యూ జ్వరం వచ్చే పరిస్థితులున్నాయంటున్నారు వైద్య నిపుణులు.
 
ఎయిడెస్‌ ఈజిఫ్లై అనే జాతి దోమ కాటువల్ల శరీరంలో ప్రవేశించే వైరస్‌ వలన వచ్చే జ్వరం డెంగ్యూ . ఈ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రక్తస్రావం, రక్తపోటు పడిపోవటం వంటి లక్షణాలతో మరణం సంభవించవచ్చు. ఏడాది పొడవునా ఏ సమయంలోనైనా డెంగ్యూ రావచ్చు. అయితే వర్షాకాలంలో అధిక అవకాశాలుంటాయి. ఆ తరువాత సమయంలోనూ దాని ప్రభావం కనిపిస్తుంది. ఎయిడెస్‌ ఈజిఫ్లై అనే దోమ కాటు వలన ఒకరి నుండి ఒకరికి డెంగ్యూ వైరస్‌ వ్యాపిస్తుంది. ఈ జాతి దోమ మీద ఉండే నలుపు, తెలుపు చారల వల్ల దీన్ని టైగర్‌ దోమ అని కూడా అంటారు. ఈ దోమ ఇంటి పరిసరాల్లోనే ఉంటుంది. పూల కుండీలు, ఎయిర్‌కూలర్స్‌, పాత టైర్లు, పాత ఖాళీ డబ్బాల వంటి వాటిలో చేరే నీరు ఈ దోమకు ఆశ్రయం. అంటే మన పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటమంటే డెంగ్యూను ఆహ్వానించినట్టే. ఈ దోమ మిగతా అన్ని దోమల్లా రాత్రిపూట కాకుండా సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో తిరుగుతుంది. కాబట్టి ఆ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
ఎవరికైనా రావచ్చు
అన్నివయసుల వారికీ డెంగ్యూ రావచ్చు. నాలుగు రకాల సైరో తరహా వైరస్‌లు ఉండటమే ఇందుకు కారణం. మొదటిసారి వచ్చిన డెంగ్యూ జ్వరం కన్నా ఆ తరువాత వచ్చే ప్రతి సారీ జ్వరం తీవ్రత, లక్షణాలు మరింతగా పెరుగుతుంటాయి. వేడి శరీరం గల వారిలో రోగ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 
లక్షణాలు
 101-105 డిగ్రీ జ్వరం ఉంటుంది. తలనొప్పి, నడుము కింది భాగంలో తీవ్రనొప్పి, కళ్లు మండటం, ఒళ్లు నొప్పులు, కడుపులో తిప్పడం, వాంతులు, కుడి ఉదరభాగం వైపున నొప్పి, ఉష్ణోగత్ర పెరిగినప్పుడు నీరసం ఎక్కువ కావడం, కూర్చున్నా, నిల్చున్నా తల తిరగడం,ముక్కు నుంచి రక్తం కారడం, నల్లని మలం రావడం వంటి లక్షణాలు ఏర్పడుతుంది. 
నిర్ధారణ
సహజంగా డెంగ్యూ జ్వరం ప్రత్యేక లక్షణాలు తెలియడం వల్ల దాన్ని అనుమానించవచ్చు. అయితే పరీక్షల ద్వారానే నిర్ధారించాలి. రక్త పరీక్షలో తక్కువ సంఖ్యలో తెల్ల రక్తకణాలు, తక్కువ స్థాయిలో ప్లేట్లెట్లు, బ్లడ్‌ స్మియర్‌ మీద ఎటిపికల్‌ సెల్స్‌తో డెంగ్యూను నిర్ధారిస్తారు. అంతేకాదు ఎస్‌.ఎస్‌. యాంటిజన్‌, యాంటీ డెంగ్యూ, యాంటీ బాడీస్‌ ఐజీఎమ్‌ పరీక్షలతో రోగ నిర్ధారణ చేస్తారు.
డెంగ్యూతో పాటు డెంగ్యూ హెమరేజ్‌ ఫీవర్‌, రక్తపోటు అతి తక్కువకు పడిపోవడం, డెంగ్యూ షాక్‌ సిండ్రోమ్‌ కనిపిస్తే ప్రాణాంతకమే. అయితే అంత తీవ్రస్థాయిలో డెంగ్యూ వచ్చేవారు 5శాతానికి మించరని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
కొన్ని కేసుల్లోనే ఇది అధిక ఖర్చుతో కూడుకున్న చికిత్స. బ్లడ్‌ ప్లేట్‌లెట్లు 10,000 స్థాయికి పడిపోయినప్పుడు, తీవ్ర రక్తస్రావం వున్నప్పుడు, ఇచ్చే సింగిల్‌ డోనార్‌ ప్లేట్‌లెట్స్‌ లేదా యాంటీ ఆర్‌.హెచ్‌.డి. ఇంజక్షన్‌ మాత్రమే ఖరీదైనవి. అయితే 95శాతం మంది రోగులకు రక్తపోటును గమనించటం, ఇట్రావీనస్‌ ఫ్లూయిడ్స్‌ ఇవ్వటం చేస్తారు కాబట్టి అంత ఖరీదుతో కూడినవి కావనే చెప్పవచ్చు.
చికిత్స
డెంగ్యూ జ్వరానికి చికిత్సా విధానం పరోక్ష పద్ధతిలో సాగుతుంది. రోగులకు నోటి ద్వారా లేదా రక్తనాళాల ద్వారా ద్రవాలను ఎక్కిస్తారు. అప్పుడప్పుడు ప్లేట్‌లెట్స్‌ ఎక్కిస్తారు. వీటి సంఖ్య 10,000కన్నా తక్కువ స్థాయికి పడిపోతే ఇంట్రావీనస్‌ కొల్లాయిడ్స్‌ ఎక్కిస్తారు. జ్వరం తీవ్రమైనప్పుడు సింగిల్‌ డోనార్‌ ప్లేట్‌లెట్లని, యాంటీ ఆర్‌.హెచ్‌.డి. ఇంజక్షన్‌ ఇస్తారు. 
డెంగ్యూ జ్వర పీడితులకు ర్తకపోటు బాగా పడిపోయినా, తీవ్రంగా వాంతులు చేసుకుంటూ, నోటి ద్వారా ద్రవాలు తీసుకోవటం కష్టంగా ఉన్నా లేదా ప్లేట్‌లెట్స్‌ సంఖ్య 50,000 కన్నా తక్కువ స్థాయికి పడిపోయినా వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి. ప్లేట్‌లెట్లు 30,000కన్నా తగ్గినా, త్రీవ రక్తస్రావమైనా రోగిని ఇన్సెంటివ్‌ కేర్‌లో చేర్చాల్సి ఉంటుంది.
రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య క్రమంగా పెరిగే వరకు రోగి ఆస్పత్రిలో వుండాలి. జ్వరం తగ్గిన తర్వాత మూడు రోజులు రోగిని పరిశీలనలో ఉంచి ప్లేట్‌లెట్ల సంఖ్య యాభై వేలు లేదా ఆ పైన చేరిన తరువాత డిశ్చార్జి చేయవచ్చు.
జాగ్రత్తలు
ఈ జ్వరానికి టీకా మందు లేదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే డెంగ్యూని నివారించగలం. డెంగ్యూ జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పండ్ల రసాలు లేదా కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్‌ కలుపుకుని తాగాలి. పూర్తిగా విశ్రాంతిలో ఉండటం అవసరం. రాత్రిపూట బాగా నిద్రపోవాలి. దోమ తెరలను, దోమలను పారదోలే రసాయనాలను వాడాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని నిలువ నీరు లేకుండా చూసుకోవటం తప్పనిసరి.