డెంగ్యూ, మలేరియాకు గుడ్‌బై

17-8-15

  డెంగ్యూ జ్వరం 
పగటి వేళ కుట్టే దోమలతో ‘డెంగ్యూ జ్వరం’
డెంగ్యూ వైర్‌సలలో నాలుగు రకాలున్నాయి. వీటిలో ఏదో ఒక రకం వైర్‌సతో ఇన్‌ఫెక్ట్‌ అయిన ఆడ దోమ మనల్ని కుట్టడంతో ఆ వైరస్‌ శరీరంలో వ్యాపించి వ్యాధిని కలిగిస్తుంది. డెంగ్యూ వైరస్‌ ‘ఈడిస్‌ ఎజిప్టై’ రకానికి చెందిన దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ దోమలు పగటివేళ చురుగ్గా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. డెంగ్యూ వ్యాధిగ్రస్తుడిని కుట్టి రక్తం పీల్చటం ద్వారా డెంగ్యూ వైరస్‌ దోమ పొట్టలోకి చేరుతుంది. ఈ వైరస్‌ అక్కడ 2 నుంచి 10 రోజులపాటు వృద్ధి చెంది పదవ రోజుకి దోమ లాలాజలంలోకి చేరుతుంది. అలా వైర్‌సతో ఇన్‌ఫెక్ట్‌ అయిన దోమ ఆరోగ్యవంతుడైన వ్యక్తిని కుట్టడంతో వైరస్‌ అతని శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా  డెంగ్యూ దోమల ద్వారా ఒకరి నుంచి వేరొకరికి తేలికగా సోకుతుంది. దోమ తన జీవితకాలం (నెల రోజులు)పాటు  డెంగ్యూ వైరస్‌ను శరీరంలో మోస్తున్నా దాని ఆరోగ్యానికి ఎటువంటి నష్టం కలగదు. కానీ అదే దోమ ఆ నెల రోజుల సమయంలో ఎంతమందిని కుడితే అంతమందిలోకి  డెంగ్యూ వైరస్‌ ప్రవేశించి వ్యాధిగ్రస్థుల్ని చేస్తుంది. పైగా ఈ దోమ జన సమూహం ఉండే ప్రదేశాల్లో సంచరిస్తూ అక్కడి నీటిలో గుడ్లు పెడుతూ, వాళ్ల రక్తాన్నే ఆహారంగా తీసుకుంటూ జీవిస్తుంది. కాబట్టి  డెంగ్యూ వ్యాధి నుంచి రక్షణ పొందాలంటే ఈడిస్‌ ఎజిప్టై దోమలను పరిసరాల నుంచి పారద్రోలాలి.  డెంగ్యూ జ్వరానికి ప్రధాన కారణం దోమ కాటే అయినా రక్తం, అవయవ మార్పిడి వల్ల కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు.
 డెంగ్యూ వ్యాప్తి ఇలా...
 డెంగ్యూ వైరస్‌ దోమ కాటుతో శరీరంలోకి ప్రవేశించినప్పుడు రక్తంలోని తెల్ల రక్త కణాలపై దాడి చేస్తాయి. ఆ కణాల్లోకి ప్రవేశించి శరీరం మొత్తం సంచరిస్తూ క్రమంగా తెల్ల రక్త కణాల్ని నాశనం చేస్తాయి. దాంతో ఈ వ్యాధికారక వైర్‌సను పారదోలడం కోసం సైటోకైన్స్‌, ఇంటర్‌ఫెరాన్స్‌ అనే సిగ్నలింగ్‌ ప్రొటీన్స్‌ ఉత్పత్తవుతాయి. ఫలితంగా ఒళ్లు నొప్పులు, జ్వరంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గటంతోపాటు రక్తంలోని ఇతరత్రా ద్రవాలు రక్త నాళాల్లోంచి బయటకు స్రవించి రక్తం చిక్కబడుతుంది. దాంతో రక్త ప్రసరణ మందగించి శరీరంలోని ప్రధాన అంతర్గత అవయవాలకు రక్త సరఫరా తగ్గి వాటి పనితీరు కుంటుపడుతుంది. 
సీరియస్‌ కండిషన్‌ ‘ డెంగ్యూ షాక్‌’
ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండటంతో కొన్నిసార్లు  డెంగ్యూ జ్వరాన్నే ఫ్లూ జ్వరంగా పొరపాటు పడుతూ ఉంటారు. అయితే మిగతా జ్వరాలలో కనిపించని తీవ్రమైన స్థితి  డెంగ్యూలో కనిపిస్తుంది. అదే ‘ డెంగ్యూ షాక్‌’. దీన్నే  డెంగ్యూ హెమరేజిక్‌ ఫీవర్‌ అని కూడా అంటారు.  డెంగ్యూ వైరస్‌ వల్ల లింఫ్‌, రక్త నాళాలకు తీవ్ర నష్టం జరిగి కాలేయం పెద్దదై, రక్త ప్రసరణ వ్యవస్థ ఫెయిల్‌ అయ్యే ఈ స్థితి ఎంతో ప్రమాదకరమైనది. అయితే  డెంగ్యూ వ్యాధికి గురయిన ప్రతి ఒక్కరూ ఈ స్థితికి చేరుకుంటారని చెప్పలేం. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు,  డెంగ్యూకు ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లు తోడయిన సందర్భాల్లోనే  డెంగ్యూ షాక్‌కు గురయ్యే అవకాశాలున్నాయి. 
చికిత్స
 డెంగ్యూ వైర్‌సని సమూలంగా నాశనం చేసే మందులు లేవు.  డెంగ్యూ ఇన్‌ఫెక్షన్‌ని హరించే ప్రత్యేకమైన మందులంటూ లేవు. కాబట్టి వైరస్‌ కలిగించిన నష్టం నుంచి కోలుకునే మందులు మాత్రమే వైద్యులు సూచిస్తూ ఉంటారు. జ్వరాన్ని, ఒళ్లు నొప్పుల్ని తగ్గించటం కోసం సపోర్టివ్‌ డ్రగ్స్‌ ఇస్తూ వీలైనన్ని ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటే ఇన్‌ఫెక్షన్‌ అదుపులోకొస్తుంది. అలాకాకుండా నాలుగు రోజుల్లో జ్వరం హఠాత్తుగా తగ్గిపోయి ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పరిస్థితిని తీవ్రంగా పరిగణించి ఇతరత్రా వైద్య పరీక్షలు చేయవలసి ఉంటుంది. రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గితే వాటిని భర్తీ చేయటం, యాంటిబయాటిక్స్‌తో ఇతర అవయవాలకు సోకిన రుగ్మతలను అదుపు చేయటం ద్వారా ప్రమాదకర పరిస్థితి నుంచి రోగిని రక్షించవచ్చు.
మలేరియా జ్వరం
రాత్రివేళ కుట్టే మలేరియా దోమ
మలేరియా ప్యారసైట్స్‌ దోమ కాటు ద్వారా మర శరీరంలోకి చేరతాయి. ఈ ప్యారసైట్స్‌కు ఆడ ఎనాఫిలి్‌సదోమలే అతిధేయులు. ఈ దోమలు రాత్రివేళల్లో చురుగ్గా ఉంటాయి. మలేరియా ప్యారసైట్లలో 100కు పైగా రకాలున్నా ప్రధానంగా 4 రకాల ప్యారసైట్లు మాత్రమే మనుషుల్లో ఇన్‌ఫెక్షన్లను కలిగించగలుగుతాయి. అవి..1. ప్లాస్మోడియం ఫాల్సిఫారం 2. ప్లాస్మోడియం వైవాక్స్‌ 3. ప్లాస్మోడియం ఓవేల్‌ 4. ప్లాస్మోడియం మలేరియే. అయితే ఈ నాలుగింట్లో ఫాల్సిఫారం, వైవాక్స్‌ అనే రెండు రకాల ప్యారసైట్లు మాత్రమే మన ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. 
మలేరియా ఫాల్సిఫారం: ఈ రకం ప్యారసైట్‌ త్వరితగతిన మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఈ రకం మలేరియా జ్వరం బారిన పడిన రోగులు తక్కువ సమయంలో తీవ్ర లక్షణాలు, ఇబ్బందులను కలిగి ఉంటారు.
మలేరియా వైవాక్స్‌: ఈ రకం ప్యారసైట్‌ కాలేయంలో నిద్రాణంగా ఉంటూ కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత మళ్లీ మళ్లీ వ్యాధిని కలిగిస్తూ ఉంటుంది. 
ఈ రెండు రకాల మలేరియా ప్యారసైట్లు దోమ శరీరంలో వృద్ధి చెందే తీరు ఆ దోమలు సంచరించే ప్రదేశంలోని తేమ, ఉష్ణోగ్రతల మీద ఆధారపడి ఉంటాయి. ఈ దోమ ఆరోగ్యవంతమైన వ్యక్తిని కుట్టినప్పుడు దాని లాలాజలం ద్వారా ప్యారసైట్లు వ్యక్తుల శరీరంలోకి ప్రవేశించి రక్త ప్రవాహం ద్వారా కాలేయానికి చేరుకుంటాయి. అక్కడ అవి తిష్టవేసిన 5 నుంచి 16 రోజుల మధ్య కాలంలో రోగిలో ఎలాంటి లక్షణాలు కనిపంచకపోయినా మలేరిమా ప్యారసైటు మల్టిప్లై అవుతూనే ఉంటుంది. అలా తయారైన కొత్త ప్యారసైట్‌ కాలేయం నుంచి రక్తంలోకి ప్రవేశించి రక్త కణాలని నాశనం చేస్తాయి. ఈ దశలో ఇన్‌ఫెక్ట్‌ కాని దోమ మలేరియా రోగిని కుట్టినప్పుడు తిరిగి ఈ ప్యారసైట్లు దోమలోకి చేరి వాటి ద్వారా ఆరోగ్యకరమైన వ్యక్తుల్లోకి ప్రవేశిస్తాయి. 
లక్షణాలు
మలేరియాలో ఫ్లూను పోలిన లక్షణాలే కనిపించినా వ్యాధి తీవ్రతను బట్టి లక్షణాల్లో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. అవేంటంటే...
చలి జ్వరం
స్పృహ లేకపోవటం
ఊపిరి పీల్చుకోవటంలో ఇబ్బందులు
రక్తహీనత
కామెర్లు
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ శాతం తగ్గటం
ప్రమాదకర మలేరియా ఇన్‌ఫెక్షన్‌ 
‘సెరెబ్రల్‌ మలేరియా’
కొన్ని సందర్భాల్లో ప్లాస్మోడియం ఫాల్సిపారం కారక మలేరియా మెదడుకు సోకి సెరెబ్రల్‌ మలేరియాగా పరిణమించవచ్చు. ఈ దశలో విపరీతమైన తలనొప్పి, కాలేయం వ్యాకోచించటం లక్షణాలు కనిపిస్తాయి. వీటితోపాటు రక్తస్రావం జరిగి పేషెంట్‌ షాక్‌కు గురయ్యే ప్రాణాంతక పరిస్థితి కూడా తలెత్తవచ్చు.
చికిత్స
మలేరియా జ్వరంతో రోగి బాధపడుతున్నప్పుడు ఆ జ్వరం కారక ప్యారసైట్‌ను గుర్తించి తదనుగుణ చికిత్సనందించటం ద్వారా చికిత్స చేయాల్సి ఉంటుంది. రక్తంలో ప్లేట్‌లెట్స్‌ శాతాన్ని పరీక్షించటం, ఇతర అంతర్గత అవయవాల పనితీరును పరీక్షించటం ద్వారా తగిన చికిత్సా విధానాన్ని వైద్యులు ఎంచుకుంటారు. ఇవన్నీ రక్త పరీక్ష సహాయంతో తెలుసుకోవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి ప్యారసైట్‌ను సంహరించే మందులను ఇవ్వటం రక్తంలో తగ్గిన ప్లేట్‌లెట్లను భర్తీ చేయటం ద్వారా సమర్ధ చికిత్సను అందించవచ్చు.
గృహ వైద్యం
ఒక గ్లాసు వేడి నీళ్లలో ఒక టీస్పూను దాల్చిన చెక్క పొడి, అర టీస్పూను మిరియాల పొడి, ఒక టీస్పూను తేనె కలిపి తాగాలి. 
ఒక గ్లాసు నీళ్లలో 4 టేబుల్‌స్పూన్ల నిమ్మరసం, కలిపి రోజుకు మూడు సార్లు తాగాలి.
గుప్పెడు తులసి ఆకుల్ని నూరి రసం తీసి అర టీస్పూను మిరియాల పొడి చేర్చి రోజుకి మూడుసార్లు తాగాలి.
రోగ నిరోధక శక్తి ప్రధానం
ఎంత జాగ్రత్తగా ఉన్నా దోమ కాటు నుంచి తప్పించుకోలేం. కాబట్టి దోమ కాటు ద్వారా వ్యాధికారక క్రిములు శరీరంలోకి చేరినా వాటి ప్రభావం ఉండకుండా చూసుకోవాలి. అలాంటి రక్షణ శరీరం పొందాలంటే వ్యాధికారక క్రిముల్ని శరీర రోగ నిరోధక వ్యవస్థ సమర్ధంగా సంహరించగలగాలి. ఇందుకోసం శరీర రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతంగా ఉండే ఆహారం తీసుకోవాలి. కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు రోగ నిరోధక వ్యవస్థకు బలం చేకూరుస్తాయి. అవేంటంటే...
పెరుగు: పెరుగులోని ప్రొబాయాటిక్స్‌ మన పేగులకు వ్యాధికారక బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పిస్తాయి. కాబట్టి రోజుకి రెండు కప్పుల పెరుగు తప్పనిసరిగా తినాలి.
ఓట్స్‌, బార్లీ: యాంటీ మైక్రోబియల్‌ ప్రాపర్టీస్‌ కలిగిన బీటా గ్లూకేన్‌ అనే ప్రత్యేకమైన పీచు ఈ పదార్థాల్లో ఉంటుంది. ఈ కాంపౌండ్‌ కలిగి ఉన్న ఆహారాన్ని జంతువులు తిన్నప్పుడు వాటికి ఇన్‌ఫ్లూయెంజా, యాంత్రాక్స్‌లాంటి జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గాయి. అంతేకాకుండా ఈ కాంపౌండ్‌ గాయాల్ని త్వరగా మాన్పుతుంది, యంటీబయాటిక్స్‌ పనితీరును మెరుగు పరుస్తుంది. కాబట్టి బీటా గ్లూటేన్‌ కలిగిన ఈ పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి.
వెల్లుల్లి: వీటిలోని అల్లిసిన్‌ అనే కాంపౌండ్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి రోజుకి రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినాలి.
        పుట్టగొడుగులు: ఇవి శరీరంలోని తెల్ల రక్త కణాల ఉత్పత్తిని, సామర్ధ్యాన్ని పెంచుతాయి. కాబట్టి ఇన్‌ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచాలంటే పుట్టగొడుగులు తరచుగా తింటూ ఉండాలి.
సి విటమిన్‌: రోగ నిరోధక శక్తిని బలపరచటంలో సి విటమిన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ విటమిన్‌ సమృద్ధిగా ఉండే నిమ్మ, ఉసిరి, నారింజ కాయల్ని తరచుగా తింటూ ఉండాలి.
 
 
అపోహలు - వాస్తవాలు
అపోహ : డెంగ్యూ ఒకసారి వస్తే మళ్లీ రాదు.
వాస్తవం : డెంగ్యూ ఎన్నిసార్లయినా రావచ్చు. ఒకసారి డెంగ్యూ బారినపడిన వారు మళ్లీ మళ్లీ పడే అవకాశం ఉంటుంది.
అపోహ : రెడ్డివారి ననబాలు(తవా తవా ప్లాంట్‌) మొక్క డెంగ్యూ వైర్‌సను అణచివేస్తుంది.
వాస్తవం : ప్లేట్‌లెట్లు పెరిగేలా చేయడంలో ఈ మొక్క ఉపయోగపడుతుంది. డెంగ్యూ వైరస్‌ ప్రభావాన్ని తగ్గిస్తుంది. 
అపోహ : ‘ఈడిస్‌ ఎజిప్టై’ దోమలు మురికి నీళ్లను ఆవాసంగా చేసుకుంటాయి?
వాస్తవం : ఇది కూడా నిజం కాదు. శుభ్రంగా ఉన్న, నిలిచి ఉన్న నీటిపైనే ‘ఈడిస్‌ ఎజిప్టై’ దోమలు ఎక్కువగా ఉంటాయి.
అపోహ : డెంగ్యూ దోమలు పగటి వేళ మాత్రమే కుడతాయి?
వాస్తవం : పగటి పూట మాత్రమే కాకుండా రాత్రివేళ కూడా యాక్టివ్‌గా ఉంటాయి.
 
 
దోమ కుట్టగానే చర్మం చురుక్కుమంటుంది. వెంటనే దురద మొదలవుతుంది. దాంతో కుట్టిన చోట అర చేత్తో ఒక్కటి చరిచి దోమను చంపేసి ఊపిరి పీల్చుకుంటాం. మన బెంగంతా దోమ కాటుతో మొదలయ్యే దురదల గురించే! కానీ దాన్ని మించిన డెంగ్యూ, మలేరియాలాంటి జ్వరాలకు కారణమైన వైరస్‌, బ్యాక్టీరియాలు అదే దోమ కాటుతో మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయని గ్రహించాలి. వర్షాకాలంలో విజృంభించే 
జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.