తెల్లబట్ట నుంచి విముక్తి

ఆంధ్రజ్యోతి(27/05/15): అతిగా బలహీనపడి, చిక్కిపోయిన స్త్రీలలో జననాంగ మార్గం ద్వారా తెల్లని ద్రవం స్రవిస్తుంది. దీనినే ఆయుర్వేదంలో శ్వేత ప్రదరం అని, తెల్లబట్ట వ్యాధి అని అంటారు. ఆధునిక వైద్యులు ల్యుకోరియా అని అంటారు. సహజంగా రక్తహీనతతో బాధపడే స్త్రీలలో ఈ వ్యాధి తరుచుగా కనిపిస్తుంది. ఆయుర్వేద రీత్యా వాత, పిత్త కఫ దోషాలలోని కఫ దోష ప్రకోపమే ఈ వ్యాధికి మూల కారణంగా చెబుతారు. ఈ వ్యాధిలో తెల్లని ద్రవం స్రవించడంతో పాటు నడుం నొప్పి, కాళ్లు, పిక్కల భాగంలో నొప్పి వంటి లక్షణాలు కనబడతాయి. మలబద్ధకంతో పాటు మంట కలుగుతుంది. 

సులభమైన చికిత్సా మార్గాలు..

1 టీ స్పూన్‌ మర్రిచెట్టు బెరడు చూర్ణం, 1 టీ స్పూన్‌ మేడి చెట్టు బెరడు చూర్ణం ఒక లీటర్‌ నీటిలో కలిపి.. అర్ధ లీటర్‌కు అయ్యేవరకు మరిగించి       గోరువెచ్చగా ఉన్నపుడు క్రమం తప్పకుండా ఉదయం, రాత్రి మర్మాంగాన్ని కడుగుతుండాలి. ఈ కషాయంలో పటిక పొడిని అర చెంచాడు కలిపితే గుణం త్వరగా కనిపిస్తుంది.

ఒక కప్పు బియ్యం కడిగిన నీటిని ఉదయం, రాత్రి తాగడం వల్ల ఈ వ్యాధి తగ్గుతుంది.
కలబంద గుజ్జును 20 గ్రాములకు రెండు టీ స్పూన్ల తేనె కలిపి ఉదయం తీసుకోవడం వల్ల వ్యాధి త్వరగా తగ్గిపోతుంది.
సొరకాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి.. బాగా ఎండబెట్టి మెత్తని చూర్ణంగా చేసుకోవాలి. దీనికి చెక్కర, తేనె కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి         ఉదయం, రాత్రి తీసుకుంటే వ్యాధి తగ్గిపోతుంది.
ఒక టీ స్పూన్‌ ఉసిరికాయల చూర్ణం, ఒక టీ స్పూన్‌ తేనె కలిపి రోజూ ఉదయం, రాత్రి తింటే తెల్లబట్ట తగ్గుతుంది.
అరటి పళ్లను నేతిలో ముంచి తింటుంటే తీవ్రంగా ఉన్న వ్యాధి సైతం తగ్గుతుంది.
ఒక టీ స్పూన్‌ ఎండిన రేగుపళ్ల చూర్ణాన్ని రెట్టింపు బెల్లం కలిపి తినడం వల్ల గుణం కనిపిస్తుంది.
వెలగాకును నీటిలో చిక్కగా నూరి ఒక టీ స్పూన్‌ తీసుకుని, దానికి సమంగా నెయ్యి చేర్చి తినాలి.
10గ్రా. ధనియాలు కొద్దిగా నలగ్గొట్టి 100 ఎం.ఎల్‌ నీటిలో రాత్రి నానబెట్టి ఉదయం తాగాలి.
దర్భ వేళ్లను నీటితో మెత్తగా నూరి, దీన్ని ఒక టేబుల్‌ స్పూన్‌ పరిమాణంలో తీసుకుని.. దీనికి బియ్యం కడిగిన నీటితో (ఒక కప్పు) కలిపి తాగాలి.
పది లేక పన్నెండు మందార మొగ్గలను పాలతో నూరి ప్రతి రోజూ ఉదయాన్నే తాగుతూ, పాలన్నం తినడం మంచిది.
నాగకేసరాల చూర్ణాన్ని సమంగా చెక్కర, వెన్నెలను కలిపి తింటూ, మజ్జిగన్నం తీసుకుంటే శ్వేత ప్రదరం దూరమవుతుంది.

 

 డాక్టర్‌ కందమూరి 

ఆయుర్విజ్ఞాన కేంద్రం

[email protected]