స్త్రీలు వాడితే?

ఆంధ్రజ్యోతి: యంటీబయాటిక్స్‌ వాడకం వల్ల స్త్రీలలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.  ఆ వివరాలు..

ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు: యంటీబయాటిక్స్‌ వాడితే శరీరంలోని పీహెచ్‌ బ్యాలెన్స్‌ క్రమం తప్పుతుంది. దాంతో స్త్రీలల్లో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌తో వైద్యుల్ని కలిసే స్త్రీలు అప్పటికే ఏవైనా యాంటీబయాటిక్స్‌ వాడుతుంటే ఆ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. 

కుటుంబ నియంత్రణా సాధనాలు: యాంటీబయాటిక్స్‌ కుటుంబ నియంత్రణ మందుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా కొన్ని సందర్భాల్లో ఆ మాత్రలు పనిచేయక స్త్రీలు గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి యాంటీబయాటిక్స్‌ వాడే సమయంలో నోటి మాత్రలకు బదులుగా ఇతర కుటుంబ నియంత్రణా పద్ధతులను కూడా పాటించాలి.
గర్భిణులు, పాలిచ్చే తల్లులు: ఈ కోవకు చెందిన స్త్రీలు యాంటీబయాటిక్స్‌ వాడితే ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. అందుకే వీరి కోసం వైద్యులు ‘సేఫ్‌ యాంటీబయాటిక్స్‌’ సూచిస్తారు. కాబట్టి గర్భిణిలు, పాలిచ్చే తల్లులు దగ్గు, జలుబులాంటి సాధారణ రుగ్మతలకు గురైనప్పుడు సొంతంగా మందులు కొనుక్కుని వాడేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. అప్పుడే ఆ తల్లితోపాటు, బిడ్డ ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది.
 ప్రొబయాటిక్‌ బ్యాక్టీరియా: పెరుగు, వెల్లుల్లిలాంటి పదార్థాల్లో ఆరోగ్యకరమైన ప్రొబయాటిక్‌ బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ఈ పదార్థాలు తినటం ద్వారా యాంటీబయాటిక్స్‌ వాడే పని లేకుండానే చిన్న చిన్న రుగ్మతలను నయం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ మందులు తప్పనిసరిగా వాడాల్సివస్తే ఆ సమయంలో ఈ పదార్థాలు ఎక్కువగా తినే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే ఆ మందుల దుష్ప్రభావాలు శరీరంపై తక్కువగా ఉంటాయి.