రుతుశూలకి విరుగుడు

ఆంధ్రజ్యోతి(20/05/15): కొంతమంది స్త్రీలకు రుతు సమయానికి రెండు రోజులు ముందుగానే పొత్తికడుపులో విపరీతమైన నొప్పి ప్రారంభమై రుతుస్రావం జరుగుతుంది. ఈ రకంగా విపరీతమైన నొప్పితో రుతుస్రావం జరగడాన్ని ఆయుర్వేదంలో కష్టావర్తమని, రజోకృచ్ఛమని, రుతుశూల అని పిలుస్తారు. కొన్ని గ్రామాల్లో కొంతమంది దీనినే ముట్టునొప్పి అని కూడా పిలుస్తారు. త్రిదోషాలైన వాత, పిత్త, కఫాలు ప్రకోపించడం వల్ల ఈ రకమైన నొప్పి వస్తుందనేది ఆయుర్వేద సిద్ధాంతం. ఇవి రెండు రకాలు. మొదటిది యుక్త వయసులోని ఆడపిల్లలకు వచ్చేది, రెండవది 30 సంవత్సరాల లోపు స్త్రీలలో వచ్చేది.
మొదటిరకం రుతుశూల
 ఇది కండరాల సంకోచంతో కలుగుతుంది.
 రుతుస్రావానికి కొద్ది గంటల ముందు వస్తుంది.
 ఈ నొప్పి వచ్చినపుడు అరుదుగా నడుం నొప్పి, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, రుచి లేకపోవడం మొదలైన లక్షణాలు ఉంటాయి.
 రెండవరకం నొప్పి
 కటివలయం (పెల్విక్‌ గర్డిల్‌ ) లోని గర్భాశయం, అండాశయం, ఫెలోపియన్‌ ట్యూబుల వాపు, నొప్పి వల్ల ఏర్పడుతుంది.
 పొత్తి కడుపు దిగువ భాగంలో నొప్పి ఎక్కువ సేపు వస్తుంటుంది. 
 రుతు సమయానికి రెండు లేక అయిదు రోజుల ముందుగానే వస్తుంది.
 మలబద్ధకం ఉండే స్త్రీలలో తరచుగా ఈ నొప్పి వస్తుంటుంది.
 ఈ రెండు రకాల రుతునొప్పులతో బాధపడే స్త్రీలు, మలబద్ధకంతో బాధపడకుండా జాగ్రత్తపడాలి. దీని వల్ల కటి వలయంలో ఉన్న అపాన వాయువులు, మలమూత్రాలతో పాటు బయటకు వెళ్లిపోవడం వల్ల గర్భాశయంపైన, ఇతర అవయవాలపైన ఏమాత్రం ఒత్తిడి ఏర్పడదు. తర్వాత మూలికా చికిత్స వల్ల ఈ అనారోగ్య పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చు.
కలబందలోని గుజ్జ్జుకి పంచదార కలిపి ఉదయాన్నే ఒక టేబుల్‌ స్పూన్‌ తీసుకుంటే ఈ నొప్పి తగ్గుతుంది.
 ఇంగువను పొడిచేసి 1 టీ స్పూన్‌ పొడిని ఉదయం, రాత్రి భోజనం తర్వాత వేడి నీటిలో గాని, పాలు, ఇతర ఆహారపదార్థాలతో గాని కలిపి వాడుతుంటే రుతుశూల తగ్గిపోతుంది.
రావిచెట్టు బెరడు, చింత చెట్టు బెరడు సమంగా కలిపి మెత్తగా నీటితో నూరి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును  రోజూ ఉదయం, రాత్రి, భోజనం ముందు ఒక టీ స్పూన్‌ కప్పు నీటిలో కలిపి వాడితే రుతు నొప్పి తగ్గుతుంది.
ఉమ్మెత్త ఆకులను మరుగుతున్న నీటిలో వేసి నానబెట్టి తీసి పొత్తి కడుపు క్రింది భాగంలో కాపడం పెట్టిన తర్వాత ఆకులను తీసి సరిపడినంత వేడిగా ఉన్నపుడు పొత్తి కడుపు క్రింది భాగంపై వేసి ఉంచితే నొప్పి త్వరగా తగ్గుతుంది.
గుప్పెడు మేడి చెట్టు ఆకులను లీటరు నీటిలో వేసి అర లీటరు మిగిలేట్టు మరిగించి ఆ నీటితో మర్మావయాన్ని శుభ్రపరచుకుంటే వెంటనే రుతు నొప్పి తగ్గుతుంది.
20 మిల్లీ లీటర్ల తురకవేపాకు రసంలో అంతే సమంగా గేదె పెరుగు కలిపి ఉదయాన్నే పరగడుపున తాగితే నొప్పి తగ్గిపోతుంది.
 
 
 
 డాక్టర్‌ కందమూరి ఆయుర్విజ్ఞాన కేంద్రం