రుతుక్రమం అటూ ఇటైతే?

ఆంధ్రజ్యోతి(07/02/13): అమ్మాయిల్లో యవ్వనదశ చాలా కీలకం. ఈ దశలోనే అనేక సమస్యలు చుట్టుముడుతాయి. ఈ సమయంలోనే తల్లి పాత్ర చాలా కీలకం. గైనకాలజీకి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిపై ఉంటుంది. సాధారణంగా అమ్మాయి రజస్వల కావడం దగ్గర నుంచి ఎదురయ్యే సమస్యలు వాటిని ఎదుర్కోవాల్సిన తీరును వివరిస్తున్నారు గైనకాలజిస్ట్‌ అండ్‌ లాప్రోస్కోపిక్‌ సర్జన్‌ డా. మంజుల అనగాని.

 గతంతో పోల్చితే ఇప్పుడు అమ్మాయిలు చాలా చిన్న వయసులో రజస్వల అవుతున్నారు. ఒకప్పుడు పదకొండు, పన్నెండు ఏళ్లకు అయ్యేవారు కానీ ఇప్పుడు 10 ఏళ్ల పిల్లలు కూడా రజస్వల అవుతున్నారు. అందుకే 10 నుంచి 18 ఏళ్లలోపు రజస్వల అయితే ఏ సమస్య లేనట్లుగానే భావించాలి. 

 చిన్న వయసులో రజస్వల అయితే...
ఏడు, ఎనిమిది ఏళ్ల వయస్సున్న పిల్లలు రజస్వల అయినట్లయితే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే చిన్న వయసులో రజస్వల అయితే ఎముకలలో పెరుగుదల ఆగిపోతుంది. ఫిజికల్‌ గ్రోత్‌ తగ్గిపోతుంది. మానసికంగా తీవ్రప్రభావం పడుతుంది. చాలా త్వరగా పీరియడ్స్‌ ప్రారంభం అయినా, పీరియడ్స్‌ ఆలస్యంగా ఆగిపోయినా హార్మోన్స్‌కి శరీరం ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ అయి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎండోమెట్రియాసిస్‌, ఎండోమెట్రియాసిస్‌ కేన్సర్‌, పీసీఓడి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జంక్‌ఫుడ్‌, చికెన్‌ ఎక్కువగా తినడం, ఈస్ట్రోజన్‌ లెవెల్స్‌ పెరగడం వల్ల పిల్లలు త్వరగా రజస్వల అవుతున్నారు. 
 
18 ఏళ్లు దాటినా రజస్వల కాకపోతే...
ఈ సమస్యను డిలేడ్‌ ప్యూబర్టీ అంటారు. ఇందులో రెండు కెటగిరీలుంటాయి. కొందరిలో ప్యూబర్టీకి సంబంధించి ఎటువంటి లక్షణాలు కనిపించవు. మరి కొందరిలో ఛాతీ పెరగడం, ఇతర లక్షణాలు సాధారణంగానే ఉన్నా రజస్వల కాకపోవడం జరుగుతుంది. 
ఏం చేయాలి?
రజస్వల కావడానికి ముందు ఎడ్రినలిన్‌ గ్రంధి నుంచి కొన్ని హార్మోన్లు విడుదలయి మెదడుని ఉత్తేజితం చేస్తాయి. అక్కడి నుంచి ఇతర హార్మోన్లు విడుదలవుతాయి. ఈ సమయంలో మొదటగా ఛాతీ పెరుగుదల జరుగుతుంది. ఆ తరువాత ఏడాదికి ప్యూబిక్‌ హెయిర్‌ డెవలప్‌ అవుతుంది. ఈ లక్షణాలను గమనించి డాక్టర్‌ను సంప్రదించినట్లయితే చిన్న వయసులో రజస్వల కావడాన్ని ఆపే అవకాశం ఉంటుంది. ఇక 18 ఏళ్లు వచ్చినా రజస్వల కానట్లయితే జెనెటిక్‌ ప్రాబ్లమ్స్‌ ఏమైనా ఉన్నాయా పరిశీలించాలి. టెస్టిక్యులార్‌ ఫెమినైజేషన్‌ సిండ్రోమ్‌, హోమోపరడైజ్‌ సమస్యలు కూడా కారణం కావచ్చు. అందుకే వాటిని గమనించాలి. అండాశయాలు, గర్భాశయం ఎలా ఉన్నాయో పరిశీలించాలి. 
పీరియడ్స్‌ సమస్యలు
చాలా మందికి పీరియడ్స్‌ సమయంలో వచ్చే రక్తస్రావంపై అపోహలుంటాయి. నిజానికి ఒక్కరోజు రక్తస్రావం అయినా వారం రోజులు అయినా సాధారణంగా ఉన్నట్లే భావించాలి. 21వ రోజు నుంచి 35 రోజుల మధ్యలో ఎప్పుడు పీరియడ్స్‌ వచ్చినా నార్మల్‌గా ఉన్నట్లే పరిగణించాలి. దీనికి భిన్నంగా ఉంటే సమస్య ఉన్నట్లుగా భావించాలి. 
పరీక్షలు
రక్తస్రావం ఎక్కువగా ఉన్నట్లయితే బ్లీడింగ్‌ అబ్‌నార్మాలాటిస్‌ ఉన్నాయేమో పరిశీలించాలి. రక్తం క్లాట్‌ అయ్యే సిస్టమ్‌కు సంబంధించి ఏమైనా సమస్య ఉందా తెలుసుకోవాలి. స్కాన్‌ చేసి గర్భాశయం, ఓవరీస్‌లో ప్రాబ్లం ఉందా? తెలుసుకోవాలి. హార్మోనల్‌ పరీక్షలు చేయాలి. థైరాయిడ్‌ పరీక్షలు చేయించాలి. 
పీసీఓడి
ఈ మధ్యకాలంలో పీసీఓడి(పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌) సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో అండాశయం చుట్టూ పొర చిక్కగా అయిపోయి అండాలు విడుదల కావు. ఫలితంగా హార్మోన్లలో మార్పు చోటు చేసుకుంటుంది. బాగా లావవుతారు. మెడ చుట్టూ నల్లగా తయారవుతుంది. అవాంఛిత రోమాలు వస్తాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే యుటెరస్‌ కేన్సర్‌, డయాబెటిస్‌ వచ్చే అవకాశం పెరుగుతుంది. పీసీఓడి ఉన్నట్లయితే రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌ చేయాలి. తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రొటీన్లు ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. హార్మోనల్‌ ఇన్‌బ్యాలెన్స్‌ను కంట్రోల్‌ చేయాలి. థైరాయిడ్‌ సమస్య ఉన్నట్లయితే సంబంధిత డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. కొందరిలో రక్తస్రావం అవుతుంది. కానీ రక్తం బయటకు రాదు. ఈ సమస్యను క్రిప్టొమెనోరియా అంటారు. ఇటువంటి వారిలో రక్తస్రావానికి అడ్డుగా ఉన్న పొరను తొలగిస్తే సరిపోతుంది. 
స్పాస్‌మోడిక్‌ డిస్‌మెనోరియా 
పీరియడ్స్‌ సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. స్కూల్‌కు, కాలేజికి వెళ్లలేకపోతారు. వీరిలో గర్భాశయంలో ఒత్తిడి పెరిగి ముఖద్వారం తెరుచుకునే వరకు నొప్పి ఉంటుంది. ముఖద్వారం తెరుచుకుని రక్తస్రావం మొదలుకాగానే నొప్పి తగ్గిపోతుంది. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఒకటి రెండు రోజుల మందులు వేసుకుంటే సరిపోతుంది. సాధారణంగా ఈ సమస్య 90 మందికి పెళ్లయిన తరువాత తగ్గిపోతుంది. మిగతా 9 మందికి డెలివరీ తరువాత తగ్గిపోతుంది. ఒకరిలో మాత్రం ఈ సమస్య తీవ్రంగా బాధపెడుతుంది. వీరికి చిన్న సర్జరీ చేయాల్సి వస్తుంది. 
కంజెస్టివ్‌ డిస్‌మెనోరియా
పీరియడ్స్‌కు ముందు రెండు రోజుల నుంచి రక్తం అంతా వచ్చి పేరుకుపోవడం వల్ల నొప్పి మొదలవుతుంది. రక్తస్రావం మొదలయిన తరువాత నొప్పి క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ సమస్య నాలుగు నుంచి వారం రోజుల పాటు ఉంటుంది. ఎండోమెట్రియాసిస్‌, ఎడినోమైసిస్‌, ఫైబ్రాయిడ్స్‌, ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఈ సమస్య వస్తుంటుంది. అందుకే కారణం కనుక్కుని దానికనుగుణంగా చికిత్స అందించాలి. 
వైట్‌డిశ్చార్జ్‌
అండాశయం నుంచి అండాలు విడుదలయినపుడు కొద్దిగా తెల్లగా ద్రవాలు రిలీజ్‌ కావడం సాధారణంగా జరుగుతుంది. దీనిపై ఆందోళన అవసరం లేదు. ఒకవేళ దుర్వాసన వస్తున్నా, తెల్లబట్ట గ్రీన్‌ కలర్‌లో వస్తున్నా, చిక్కగా ఉన్నా డాక్టర్‌కు చూపించుకోవాలి. 
హెచ్‌పీవీ వాక్సిన్‌
రజస్వల కాకముందే ఈ వాక్సిన్‌ ఇప్పించడం ద్వారా గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ నుంచి, ఇతర ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించవచ్చు. 
 
డా. మంజుల అనగాని
గైనకాలజిస్ట్‌ అండ్‌ లాప్రోస్కోపిక్‌ సర్జన్‌, బీమ్స్‌ హాస్పిటల్‌, జూబ్లీహిల్స్‌,          రోడ్‌నెం 1, హైదరాబాద్‌,
ఫోన్‌: 8886112222, 040- 39417700