ఆంధ్రజ్యోతి(16/12/14): ఆడవాళ్ల రొమ్ముల ఆకారం, పరిమాణం, బిగువుల్లో తేడాలు సంభవించడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. వయసు, వ్యాధులు, జీవనశైలి ప్రభావం వల్ల రకరకాల రొమ్ము సమస్యలు వీరికి ఎదురవుతుంటాయి. కొన్ని సందర్భాలలో రొమ్మును సైతం వీళ్లు కోల్పోవాల్సి వస్తుంది. దీంతో ఆడవాళ్లు శారీరకంగా, మానసికంగా ఎంతో కుంగిపోతారు. ఇలాంటి ఎన్నో రొమ్ము సమస్యలకు ప్లాస్టిక్ సర్జరీ ఒక్కటే పరిష్కారమార్గమంటున్నారు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డా.ఙ్ఞానేశ్వర్.
రొమ్ము సమస్యలు
రొమ్ములకు సంబంధించి రకరకాల సమస్యలు ఉన్నాయి. కొందరికి పుట్టుకతోనే రొమ్ముల ఆకారంలో తేడాలుండొచ్చు. ఇంకొందరికి రొమ్ముల పరిమాణంలో తేడాలు కనిపించవచ్చు.. మరికొందరు వ్యాధుల కారణంగా రొమ్ములో కొంత భాగాన్ని లేదా పూర్తి రొమ్మునే కోల్పోవలసి రావచ్చు. ఈ సమస్యలన్నింటికీ ప్లాస్టిక్ సర్జరీలో ఎన్నో ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
రొమ్ము చికిత్సలు
రొమ్ములకు సంబంధించి చికిత్సలు ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి.
బ్రెస్ట్ అగ్మెంటేషన్: కొందరికి రెండు రొమ్ములూ ఒకే ఆకారంలో ఉండవు. వీటి పరిమాణాల్లో కూడా హెచ్చుతగ్గులుంటాయి. వంశపారంపర్యంగా లేదా ‘పోలాండ్ సిండ్రోమ్’ వైకల్యం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. వయోభారం వల్ల కూడా స్త్రీల రొమ్ముల్లో తేడాలు సంభవిస్తుంటాయి. రొమ్ములకి కుదురైన రూపాన్నిచ్చే చికిత్సే ‘బ్రెస్ట్ అగ్మెంటేషన్’. రొమ్ముకు ఎలాంటి ఆకారాన్ని ఇవ్వాలన్నదాన్ని బట్టి బ్రెస్ట్ అగ్మెంటేషన్లో రెండు రకాల పద్ధతులను అనుసరిస్తారు.
బ్రెస్ట్ ఇంప్లాంట్స్: 30 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న స్త్రీలందరూ బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌కు అర్హులే! రొమ్ముల తీరైన ఆకారం కోసం ఈ చికిత్సలో ‘సెలైన్ ఫిల్డ్ సిలికాన్, సిలికాన్ జెల్’ అనే రెండు రకాల ఇంప్లాంట్స్ అమరుస్తారు. రొమ్ము అడుగున లేదా బాహుమూలల్లో కోత పెట్టి వీటిని రొమ్ము ప్రదేశంలోకి జొప్పించి రొమ్ముకు ఆకారాన్నిస్తారు. రొమ్ములో ఎత్తు అవసరమైన ప్రదేశం వంటి వాటి బట్టి రొమ్ములోని కండరం, కొవ్వు ప్రదేశం అడుగున లేదా పైభాగాన ఈ ఇంప్లాంట్స్‌ను అమరుస్తారు. ఈ చికిత్స ఒక సర్జరీతోనే పూర్తవుతుంది. రొమ్ములు మరీ చిన్న పరిమాణంలో ఉండి, ఛాతీ చర్మం బిగుతుగా ఉన్న సందర్భంలో ముందుగా ‘సెలైన్ ఎక్స్పాండర్’ సహాయంతో చర్మాన్ని సాగదీసి ఆ తర్వాత ఇంప్లాంట్స్ అమరుస్తారు. అలాగే రొమ్ముల పరిమాణం పెంచేందుకు ఇంప్లాంట్స్ అమర్చే సందర్భంలో కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తారు.
దుష్ప్రభావాలు: శరీరంలో అమర్చే ఇతర ఇంప్లాంట్స్లాగే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వల్ల కూడా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. 5 నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి ఉండే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వల్ల కలిగే దుష్ఫలితాలు ఎన్నో ఉన్నాయి. అవి
శరీరం ఇంప్లాంట్స్‌ను స్వీకరించకపోవచ్చు.
సర్జరీ వల్ల ఇన్ఫెక్షన్లు తలెత్తవచ్చు.
ఇంప్లాంట్ అమర్చిన 5 ఏళ్ల తర్వాత దాని చుట్టూ తయారైన కవచం కుంచించుకుపోయి ఇంప్లాంట్ రూపు మారిపోవచ్చు.
అవసరానికి మించిన పరిమాణం వల్ల, ప్రమాదాల వల్ల ఇంప్లాంట్స్ దెబ్బతినొచ్చు. ఇలాంటి సందర్భాలలో మరోసారి సర్జరీ చేసి సమస్యను పరిష్కారించాల్సి ఉంటుంది. ఇంప్లాంట్స్ ఎక్కువకాలం మన్నాలంటే స్త్రీలు సరైన బ్రాలు ధరించాలి. అలాగే ఇంప్లాంట్స్ అమర్చిన రొమ్ములకు ప్రమాదాల్లో దెబ్బలు తగలకుండా చూసుకోవాలి.
ఫ్యాట్ గ్రాఫ్టింగ్
తొడలు, లేదా పొత్తి కడుపు నుంచి సేకరించిన కొవ్వును రొమ్ములో అమర్చటమే ఫ్యాట్ గ్రాఫ్టింగ్. ఇంప్లాంట్స్‌తో పోలిస్తే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఎంతో మేలైనది. శాశ్వత ఫలితాన్నిచ్చే ఈ చికిత్స వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే...
శరీరం నుంచి సేకరించిన కొవ్వునే రొమ్ములోనూ అమర్చటం జరుగుతుంది కాబట్టి శరీరం వ్యతిరేకించదు.
అవసరానికి సరిపడినంత కొవ్వును శరీరం నుంచి సేకరించే వీలుంటుంది.
ఇన్ఫెక్షన్లు తలెత్తే అవకాశాలు తక్కువ.
ఫ్యాట్ గ్రాఫ్టింక్ సర్జరీకి ఉన్న ఒకే ఒక ప్రతికూల అంశమేమిటంటే ఒక సిటింగ్‌లోనే ఈ ప్రొసీజర్ని పూర్తిచేయలేకపోవటం. ఇతర శరీర భాగాల నుంచి కొవ్వు సేకరించటానికి, కొవ్వును రొమ్ముకు అమర్చటానికి రెండు నుంచి మూడు సర్జరీలు చేయాల్సివస్తుంది. ఇందులో శాశ్వత ప్రయోజనాలు పొందే అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది స్త్రీలు ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చికిత్స మీదే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
బ్రెస్ట్ రిడక్షన్: కొందరి రొమ్ములు అసాధారణంగా పెరిగిపోతుంటాయి. ఈమధ్య కాలంలో యువతుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. రొమ్ము సమస్యలతో వైద్యుల్ని కలిసే రోగుల్లో 80 శాతం ఈ కోవకు చెందినవారే! ఇలా అవసరానికి మించి పెరిగిపోయే రొమ్ముల పరిమాణాన్ని ‘బ్రెస్ట్ రిడక్షన్’ సర్జరీతో తగ్గించవచ్చు. ఈ చికిత్సలో చనుమొనల నుంచి రొమ్ము కిందకు కోత పెట్టి కొవ్వును తొలగిస్తారు.
బ్రెస్ట్ లిఫ్ట్: బ్రెస్ట్ రిడక్షన్లో చేసే మరో సర్జరీ ‘మాస్టోపెక్సీ’. వయసు పెరిగే కొద్దీ రొమ్ములు పటుత్వాన్ని కోల్పోతాయి. స్థానభ్రంశం చెంది కిందకి జారిపోతాయి. శరీర కొవ్వును తొలగించే లైపోసక్షన్ సర్జరీ వల్ల కూడా రొమ్ములు వదులుగా తయారవుతాయి. ఇలాంటి రొమ్ములను బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీతో సరిచేయవచ్చు. ఇందుకోసం చనుమొన నుంచి రొమ్ము కింద వరకు కోత పెట్టి , రొమ్ము దాని చుట్టుపక్కలుండే కణజాలాన్ని దగ్గరికి లాగి రొమ్ముకు రూపాన్నిస్తారు.
బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్: వ్యాధి మూలంగా రొమ్ములో కొంత భాగం లేదా పూర్తి రొమ్మునే కోల్పోయిన సందర్భంలో ఈ చికిత్సను అనుసరిస్తారు. సాధారణంగా రొమ్ములు రెండు రకాల వ్యాధులకు గురవుతుంటాయి. వీటిలో ప్రధానమైనది క్యాన్సర్ అయితే, రెండవది ‘బ్రెస్ట్ ఆబ్సెస్’. ఈ రెండు రకాల వ్యాధుల్లో రొమ్ములోని కొంత భాగాన్ని లేదా పూర్తి రొమ్మును సర్జరీతో తొలగిస్తారు. రొమ్ములో కొంత భాగాన్ని మాత్రమే తొలగించినప్పుడు శరీరంలోని వేరే ప్రదేశం నుంచి సేకరించిన కండరంతో రొమ్ముల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. దీన్ని ‘ఫిల్లింగ్’ అంటారు. రొమ్ము మొత్తాన్ని తొలగించినప్పుడు బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చికిత్సతో రొమ్ములను పునర్నిర్మిస్తారు. ప్రధానంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్థుల బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చికిత్సలో ‘ఇమ్మీడియట్ రీకన్స్ట్రక్షన్’, ‘డిలేయ్డ్ రీకన్స్ట్రక్షన్’ అనే రెండు రకాల చికిత్సా పద్ధతులను అనుసరిస్తారు.
ఇమ్మీడియెట్ రీకన్స్ట్రక్షన్: క్యాన్సర్ తొలిదశలో రొమ్ములో కొంత భాగాన్ని తొలగించిన వాళ్లకు, క్యాన్సర్ రొమ్మునుంచి పక్కలకు వ్యాప్తి చెందకుండా పూర్తిగా నయమైనవాళ్లకు ఈ సర్జరీ చేస్తారు. ఈ సర్జరీలో రొమ్ములో ఏర్పడిన ఖాళీని కండర ఫిల్లింగ్‌తో భర్తీ చేస్తారు.
డిలేయ్డ్ రీకన్స్ట్రక్షన్: క్యాన్సర్ వల్ల పూర్తి రొమ్మును కోల్పోయిన వాళ్లకు, లేజర్ థెరపీ, కీమో తీసుకుని క్యాన్సర్‌నుంచి పూర్తిగా కోలుకున్నవాళ్లకు తొలగించిన రొమ్ము స్థానంలో కొత్త రొమ్మును పునర్నిర్మిస్తారు. ఇందుకోసం పొత్తికడుపు దగ్గరి కండరంలో కొంత భాగాన్ని చర్మంతో సహా తీసి రొమ్ము స్థానంలో అమరుస్తారు. దీన్ని ‘ట్రామ్ ఫ్లాప్’ అంటారు.
స్కిన్ స్పేరింగ్ మాస్టెక్టమీ: రొమ్ము పైచర్మం దెబ్బ తినకుండా రొమ్ము లోపలి భాగాన్ని మాత్రమే తొలగించే వారికి అనుసరించే సర్జరీ ఇది. వీళ్లకు ఇంప్లాంట్స్ అమర్చవచ్చు. అవసరాన్నిబట్టి ఇంప్లాంట్‌తోపాటు కొంత కొవ్వును లేదా కండరాన్ని కలిపి రొమ్మును పునర్నిర్మించవచ్చు.
అందమైనవక్షోజాల కోసం గుండ్రంగా, బిగుతుగా రొమ్ములు ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.
రొమ్ముల పరిమాణం, ఆకారానికి తగిన బ్రాలు ధరించాలి.
ఆటలాడే సమయంలో ‘స్పోర్ట్స్ బ్రా’ ధరించటం తప్పనిసరి.
పాలిచ్చే తల్లులు బరువు పెరిగిన రొమ్ములకు తగ్గట్టుగా సపోర్ట్‌నిచ్చే బ్రాలు ధరించాలి.
రొమ్ములు ఒత్తుకుపోయేలా బోర్లా పడుకోకూడదు.
భుజాలు, ఛాతీ కండరాలకు బలం చేకూర్చే వ్యాయామాలు చేయాలి.
కోతలు కనిపించని ఆధునిక సర్జరీ
సర్జరీలో కోతలు, మచ్చలు ఏర్పడటం సహజం. ఇంతకుముందు రొమ్ము అడుగు భాగంలో , చనుమొనల నుంచి కిందికి నిలువుగా పెద్ద కోతలు పెట్టి సర్జరీ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు సర్జరీ కోసం పెట్టే కోత, ప్రదేశం, పరిమాణాల్లో మార్పులొచ్చాయి. ప్రస్తుతం బ్రెస్ట్ సర్జరీ కోసం రొమ్ము అడుగున, చనుమొనల దగ్గర లేదా బాహుమూలల్లో కేవలం అర సెంటీమీటరు నుంచి మూడున్నర సెంటీమీటర్ల కోతతో సర్జరీ పూర్తి చేస్తున్నారు. ఒక్క బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీలో మాత్రం చనుమొన నుంచి రొమ్ము కిందకి నిలువు కోత పెట్టక తప్పట్లేదు.
డాక్టర్.జి.ఎస్.ఙ్ఞానేశ్వర్
ప్లాస్టిక్ సర్జన్
కేర్ హాస్పిటల్
హైదరాబాద్