గర్భవతులకు పొద్దున్నే ఇలా ఉంటే...

24-06-2019: స్త్రీ జీవితంలో గర్భం దాల్చడం ఒక ఆనందకర ఘట్టమే. కాకపోతే, ఆ వెంటనే వికారం, వాంతులు మొదలై, కొందరిని చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. సాధారణంగా ఇలా కావడం అన్నది పొద్దుటి పూటే ఎక్కువ. ఇదేదో ఒక అవాంఛనీయ పరిణామం అన్న భావనకు గురవుతుంటారు చాలా మంది. అయితే, ‘జామా ఇంటర్నల్‌ మెడిసిన్‌’ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఒక వ్యాసం, కొన్ని ఆసక్తికర విషయాల్ని బయటపెట్టింది. పొద్దుపొద్దున్నే ఇలా కావడం అన్నది ఆరోగ్యకరమైన గర్భమని, అది గర్భస్రావం జరిగే అవకాశం లేదని చెప్పే సూచన అన్న మూలాంశం ఆ వ్యాసంలో ఉంది. గర్భం దాల్చిన 8 వారాలకు వికారం, వాంతుల పాలయ్యే గర్భిణుల తాలూకు రిపోర్టులను పరిశోధకులు సేకిరించి పరిశీలించారు.

వారిలో 58 శాతం మంది వికారానికి, 27 శాతం మంది వికారంతోపాటు వాంతులకూ గురయ్యారు. ఈ లక్షణాల్లో ఏదో ఒకటి గానీ, రెండూ గానీ ఉండి పొద్దుపొద్దున్నే నలతగా ఉన్న వారిలో 75 శాతం మందికి గర్భస్రావాలు జరగలేదని తేలింది. వికారం, వాంతుల వంటి లక్షణాలేవీ లేని వాళ్లతో పోలిస్తే, ఆ లక్షణాలు ఉన్నవారి గర్భం ఆరోగ్యంగా ఉందని స్పష్టమైనట్లు వారు పేర్కొన్నారు. మొత్తానికి, గర్భం దాల్చిన తొలి రోజుల్లో వచ్చే వికారం, వాంతులకు, గర్భం సురక్షితంగా ఉండడానికి ఒక సహ సంబంధం ఉన్నట్లు తమ అధ్యయనాల్లో తేలినట్టు పరిశీలకులు ఆ వ్యాసంలో స్పష్టం చేశారు. కాబట్టి వేవిళ్లు, వికారం లాంటి లక్షణాలను గర్భిణులు ఆరోగ్య సూచకంగానే భావించాలనీ, ఈ లక్షణాల వల్ల ఆరోగ్యం దిగజారుతుందని అనుకోకూడదనీ పరిశోధకులు చెబుతున్నారు.