మహిళల్లో కొత్త సమస్య..

ఇది లోపిస్తే ప్రమాదమేంటున్న వైద్యులు

తాడేపల్లిగూడెం, 14-12-2018: అమ్మో ఎముకలు పట్టేస్తున్నాయి.. కాళ్లు పీకేస్తున్నాయ్‌.. నడుం పట్టేస్తుంది.. మీ శరీరంలో ఇటువంటి కనిపిస్తున్నాయా.. అయితే సూరీడు మీపై కోపగించుకున్నట్టే.. ఎందుకంటే డి విటమిన్‌ లోపం కారణంగా మహిళల్లో ఇటువంటి వ్యాధులన్నీ వస్తాయి.. నీరసించేలా చేస్తాయి.. మరి డి విటమిన్‌ కావాలంటే ఏం చేయాలంటారా.. ఉదయం సాయంత్రం సూరీడుకి ఎదురుగా నిలబడాల్సిందే.. ఆయన స్పర్శతో ఆరోగ్యంగా ఉండాల్సిందే..

డి విటమిన్‌ లోపం మహిళలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావం వృద్ధాప్యంలో మరింత తీవ్రమవుతోంది. మనిషిలో కోలి కాల్సిఫెరాల్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది శరీరంలో లేకపోతే ఎముకలు గట్టిగా ఉండకపోవడం, గుండె సరిగా పనిచేయకపోవడం, కండరాలు వదులుగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ యాసిడ్‌ శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎండలో ఉండడం వల్ల కోలి యాసిడ్‌ ఉత్పత్తి అవుతోంది. జన్యుపరమైన లోపం, కిడ్నీ జబ్బులు ఉంటే కోలి యాసిడ్స్‌ ఉత్తత్తికావు. ఇటువంటి లోపాన్నే డి విటమిన్‌ లోపంగా అభివర్ణిస్తారు. ఆహారంలో తీసుకున్న కాల్షియం(సున్నం) రక్తం ద్వారా ప్రతి ఎముక భాగానికి చేరుతుంది.ఈ రక్తంలో కలిసిన కాల్షియంను ఎముక పీల్చుకుని గట్టింగా ఉండే విధంగా తయారవుతుంది.
 
డి విటమిన్‌ లోపం వల్ల రికెట్స్‌ వంటి వ్యాధులు పిల్లల్లో వస్తాయి. దొడ్డికాళ్లు రావడం, ఊబకాయం, పొట్ట ఉబ్బరంగా ఉండ డం,డొప్ప చెవులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి తోడు నోటి నుంచి సొంగరావడం, నీరసంగా ఉండడం కనిపిస్తారు. మధ్య వయసు వారిలో ఈ లోపాన్ని ఆస్టియో మలేషియా అంటారు. దీని వల్ల కాళ్లు చేతులు వంకర్లు తిరుగుతాయి. నడుము వంగి పోతుంది. వెన్నుపూసలు అతుక్కుని పోయే లక్షణాలు కనిపిస్తాయి. ఇక వృద్ధాప్యంలో వచ్చే వాటిని ఆస్టియో పొరాసిస్‌ అని పిలుస్తారు. చిన్న దెబ్బకే ఎముకలు విరిగిపోతాయి. ఇది కాకుండా రక్తంలో కాల్షియం సడన్‌గా తగ్గితే కండరాలు బిగిసిపోతాయి(టెటని) వంటి లక్షణాలు వస్తాయి.
 
మహిళల్లోనే డి విటమిన్‌ లోపం ఎక్కువ...
మహిళల్లో యుక్త వయసు వచ్చిన సమయం నుంచి బహిష్టుద్వారా రక్తం బయటకు పోతోంది. పెళ్లయి గర్భం ధరించిన తరువాత తల్లి దగ్గర ఉన్న కాల్షియంను బిడ్డ కూడా తీసు కుంటుంది. ప్రససావనంతరం తల్లి బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లి శరీరంలో ఉన్న కాల్షియం బిడ్డకు వెళ్లిపోతోంది. ఇలా అన్ని విఽధాలుగా మహిళల్లో ఉన్న కాల్షియం ఎక్కువ మోతాదులో ఖర్చవుతోంది. దీని నివారణకు గతంలో తల్లికి కాల్షియంకు సంబంధించిన ఆహారాన్ని ఇచ్చే వారు. నేడు ఆ పరిస్థితుల్లేవు. దీంతో నడివయసు వచ్చేసరికే కండరాల బిగువు తగ్గడంతో పాటు, వెన్నునొప్పులు వస్తున్నాయి. ప్రసవించిన మహిళ ఎక్కువ శాతం కాల్షియం తీసుకుంటే ఆమె భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తవని వైద్యులు ధ్రువీకరిస్తున్నారు.
 
నివారణ ఎలాగంటే...
పుట్టినప్పటి నుంచి పిల్లలపై శ్రద్ధ పెట్టాలి. పుట్టిన పిల్లలను ఉదయం, సాయంత్రం సమయంలో ఒక అరగంట ఎండలో ఉంచితే డి విటమిన్‌ దాని అంతట అదే సమకూరుతుంది. డివిటమిన్‌ లోపాన్ని తగ్గించేందుకు సరైన ఆహార నియమాలు పాటించాలి. దీనికి తోడుగా సమతుల ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాల్షియం అధికంగా లభించే పాలు, పండ్లు, డ్రైప్రూట్స్‌, పాలకూర, గోంగూర, సపోట, సీతాఫలం, మునగ, టమోటా, బెల్లం తినాలి. ఇప్పుడు మార్కెట్లో కూడా కాల్షియం బిళ్లలు వచ్చాయి. ఇవి కూడా తక్కువ ధరకే దొరుకుతున్నాయి.అంతే కాకుండా మార్కెట్లో ఎముక సాంద్రతను పరీక్షించే పరికరాలు వచ్చాయి. ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఎముక సాంద్రతను గుర్తించి మందులు వాడుకోవచ్చు. ఇది కాకుండా ఎరాచిటాన్‌ అనే ఇంజక్షన్‌ డి విటమిన్‌ లోపాన్ని సరిచేస్తుంది.
 
మహిళలు అప్రమత్తంగా ఉండాలి: శివప్రసాద్‌, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌
డి విటమిన్‌ లోపం మహిళలోనే ఎక్కువగా వస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. బాలిక యుక్తవయసులో రజస్వల అవడం నుంచి రక్తం వృథా అవుతోంది. గర్భిణీ అయిన తరువాత కాల్షియం కూడా బిడ్డ తల్లి నుంచే తీసుకుంటుంది. దీని వల్ల మహిళలు ఎక్కువగా కాల్షియం సంబంధించిన ఆహారాన్ని తీసుకోవాలి.. లేదంటే ప్రమాదాల బారిన పడక తప్పదు. మహిళలు ముందస్తుగా మేల్కొనాలి.. ఎండ ఎక్కువగా తగిలేలా ఉదయం సాయంత్రం సమయంలో కాసేపు నిలబడితే సరిపోతోంది.