మోనోపాజ్‌ తరువాత మూత్రాశయ సమస్యలు

ఆంధ్రజ్యోతి(14-07-13): మూత్రాశయ సమస్యలు స్త్రీలను ఎక్కువగా వేధిస్తాయి. ముఖ్యంగా మెనోపాజ్‌ దాటిన మహిళల్లో  ఈ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యలతో బాధపడుతున్నా చాలా మంది డాక్టర్‌కు చూపించుకోవడానికి వెనుకంజ వేస్తుంటారు. మరికొందరు ఎవరికి చూపించుకోవాలో తెలియక లోలోపల మదనపడుతుంటారు. నిజానికి ఆధునిక చికిత్సలతో ఈ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుందని అంటున్నారు సీనియర్‌ యూరోగైనకాలజిస్ట్‌ డాక్టర్‌ లలిత. 
 
స్త్రీలలో మెనోపాజ్‌ తరువాత అంటే రుతుక్రమం ఆగిపోయిన తరువాత మూత్ర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో సాధారణంగా కనిపించే సమస్య మూత్రంలో చీము రావడం (యూరినరీ ఇన్‌ఫెక్షన్‌). దీనికి కారణం ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ లోపం. ఈ హార్మోన్‌ లోపించడం వల్ల మూత్రనాళం, మూత్రాశయం లోపలి పొరలో రోగ నిరోధక శక్తి తగ్గి, మూత్రంలో సూక్ష్మక్రిములు చేరే ప్రమాదం ఉంటుంది. మెనోపాజ్‌ తరువాత స్త్రీలలో కనిపించే మరో సమస్య యురెథ్రల్‌ స్టినోసిస్‌. వీరిలో మూత్రనాళం సన్నగా అవుతుంది. దీనికి కారణం హార్మోన్‌ లోపమే. మూత్రం సన్నగా రావడం, మధ్యలో ఆగిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఒక్కోసారి మూత్రాశయంలో మూత్రం నిండిపోయి మూత్రపిండాలు ఉబ్బిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దీనిని బైలాటరల్‌ హైడ్రోనెఫ్రోసిస్‌ లేదా అబ్‌స్ట్రక్టివ్‌ యూరోపతి అంటారు. ఈ సమస్య ఏర్పడినప్పుడు యురెథ్రల్‌ డైలటేషన్‌ అనే మైనర్‌ ఆపరేషన్‌ ద్వారా కిడ్నీలు చెడిపోకుండా కాపాడవచ్చు. 
హార్మోన్‌ లోపం కావచ్చు
కొంతమంది స్త్రీలలో హార్మోన్‌ లోపం వల్ల పోస్ట్‌మెనోపాజల్‌ యురెథ్రల్‌ సిండ్రోం అనే సమస్య ఉత్పన్నమవుతుంది. మూత్రంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, అర్జెంట్‌గా మూత్ర విసర్జనకు వెళ్లాలనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే వీరిలో మూత్రనాళం సన్నబడటం, మూత్రంలో ఇన్‌ఫెక్షన్స్‌ వంటివి ఏమీ ఉండవు. వీరికి ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ సప్లిమెంట్‌ ఇవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. దీన్ని హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ(హెచ్‌.ఆర్‌.టి) అంటారు. రక్తపోటు అధికంగా ఉన్న వారిలో మెదడులో రక్తనాళాలు చిట్లి పారాలైటిక్‌ స్ట్రోక్‌ (పక్షవాతం) వస్తుంది. వీరిలో మూత్రాశయానికి సంబంధించిన నాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల మూత్రం ఆగిపోవడం లేదా మూత్ర విసర్జనపై నియంత్రణ లేకపోవడం జరగవచ్చు. దీనినే న్యూరోజెనిక్‌ బ్లాడర్‌ అంటారు. 
ప్రసవం కష్టమయితే 
ప్రసవం కష్టమయిన వారిలో పెల్విక్‌ లిగమెంట్స్‌ అంటే మూత్రాశయం, గర్భసంచిని సరైన స్థానంలో ఉంచే కండరాలు బలహీనమవుతాయి. వీరిలో మెనోపాజ్‌ తరువాత  కండరాలలో మిగిలి ఉన్న పటుత్వం కూడా తగ్గి గర్భసంచి, మూత్రాశయం కిందకు జారే అవకాశం ఉంది. దీనిని యుటిరైన్‌ ప్రొలాప్స్‌, సిస్టోసీల్‌ అంటారు. దీనివల్ల మూత్రవిసర్జనపై నియంత్రణ తప్పడం, ఒక్కోసారి మూత్రం ఆగిపోవడం జరగవచ్చు. ఈ సమస్య ఆరంభ దశలో ఉన్నప్పుడు వ్యాయామం వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ సమస్య తీవ్రమైతే శస్త్రచికిత్స తప్ప మరో మార్గం ఉండదు. 
మూత్రంలో రక్తం పడితే...!
మూత్రంలో రక్తం పడటానికి చాలా కారణాలుంటాయి. మూత్రపిండాలలో రాళ్లు, యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌, కిడ్నీలో లేదా మూత్రాశయంలో కేన్సర్‌, కిడ్నీలో టీబీ, పాలిసిస్టిక్‌ కిడ్నీ(జన్యుసంబంధ వ్యాధి), గ్లొమెర్యులో నెఫ్రైటిస్‌, సైక్లికిల్‌ హిమట్యూరియా(నెలసరి సమయంలో రక్తం పోవడం) వంటి కారణాల వల్ల మూత్రంలో రక్తం పడుతుండవచ్చు. కారణం ఏమై ఉంటుందనే విషయాన్ని పరీక్షల ద్వారా తెలుసుకుని చికిత్స చేయాలి. 
వ్యాధి నిర్ధారణ 
మూత్రపరీక్ష(యూరిన్‌ ఎనాలసిస్‌), యూరిన్‌ కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ, టీబీ పీసీఆర్‌, యూరినరీ సైటాలజీ, అలా్ట్రసౌండ్‌/ సీటీస్కాన్‌, సిస్టోస్కోపి వంటి పరీక్షలు చేయించడం ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు.
చికిత్స
వ్యాధి నిర్ధారణ తరువాత దానికనుగుణంగా చికిత్స అందించాలి. ఇన్‌ఫెక్షన్స్‌ కారణమైతే యాంటీబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది. 
గర్భిణీలలో ఎక్కువే
 గర్భిణీలలో తరచుగా మూత్రాశయ సమస్యలు వస్తుంటాయి. ఇన్‌ఫెక్షన్స్‌ ఎక్కువగా ఉన్నట్లయితే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయి. నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గర్భిణీలు తప్పకుండా నెలకొకసారి మూత్ర పరీక్ష చేయించుకోవాలి. ఒక్కోసారి మూత్రాశయం నుంచి ఇన్‌ఫెక్షన్‌ కిడ్నీలకు వ్యాపించి సెప్టిసీమియా పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అత్యవసర పరిస్థితిలో చికిత్స అందించాల్సి రావచ్చు. 
కిడ్నీలో వాపు (హైడ్రోనెఫ్రోసిస్‌)
ఇది చాలా సాధారణం. శిశువు ఎదుగుతున్నప్పుడు మూత్రనాళంపై ఒత్తిడిపడి కిడ్నీలో వాపు వస్తుంటుంది. 90 శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. లక్షణాలు ఏమీ లేనప్పుడు చికిత్స అందించాల్సిన అవసరం ఉండదు. చలిజ్వరం, వాంతులు అవుతుంటే కనుక చికిత్స అందించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మూత్రనాళంలో రాయి ఉండటం మూలంగా కూడా సమస్య రావచ్చు. యాంటీబయాటిక్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌ వల్ల నొప్పి తగ్గకపోతే స్టెంట్‌ వేయాల్సి ఉంటుంది. ఏమైనా మూత్రాశయ సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవడం చాలా                అవసరం. 
 
డాక్టర్‌ లలిత
సీనియర్‌ యూరోగైనకాలజిస్ట్‌
యశోదా హాస్పిటల్‌
సోమాజిగూడ, హైదరాబాద్‌
ఫోన్‌ : 96184 09384