మేకప్‌తో ‘మెనోపాజ్‌’!

ఆంధ్రజ్యోతి: మేకప్‌ వేసుకునేందుకు వాడే ఉత్పత్తుల వల్ల రావాల్సిన దానికంటే ఓ నాలుగేళ్లు ముందుగానే మెనోపాజ్‌ దశకు చేరుకుంటున్నారట. మేకప్‌ ఉత్పత్తులకి, మెనోపాజ్‌కి సంబంధం ఏమిటి అంటున్నారా? ఆ ఉత్పత్తుల్లో వాడే రసాయనాలే ఈ ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్నాయి అంటున్నారు పరిశోధకులు. లిప్‌స్టిక్‌, ఫేస్‌క్రీం, నెయిల్‌ వార్నిష్‌ వంటి మేకప్‌ ఉత్పత్తులు వాడుతున్న 31వేల మంది పైగా మహిళలని పరిశీలించారు వాషింగ్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు. ‘‘ప్లాస్టిక్‌ను మెత్తపరిచేందుకు వాడే ఫ్తాలేట్స్‌ ఆహార పదార్ధాలను ప్యాక్‌ చేసే ఉత్పత్తులతోపాటు, పర్‌ఫ్యూమ్‌, లిప్‌స్టిక్‌, బాడీవాష్‌, హెయిర్‌కేర్‌ ఉత్పత్తులు, నెయిల్‌ వార్ని్‌షలలో కనిపించాయి. పరిశోధనలో పాల్గొన్న 31 వేల మంది మహిళల రక్త, మూత్ర నమూనాల్లో అధికస్థాయిలో రసాయనాలు కనిపించాయి. తక్కువ స్థాయి రసాయనాలు కలిగిన అంటే మేకప్‌ ఉత్పత్తులను ఎక్కువగా వాడని, అస్సలు వాడని మహిళలతో పోలిస్తే ఈ మహిళలు రెండు నుంచి నాలుగేళ్ల ముందుగా మెనోపాజ్‌ దశకు చేరుకున్నట్టు తెలిసింది. అండాశయ పనితీరు తగ్గడం వల్ల ఫెర్టిలిటీ మీదనే కాకుండా హృదయ సంబంధిత వ్యాధులు, ఆస్టియోపొరోసిస్‌, ఇతర ఆరోగ్య సమస్యలు బారిన పడుతున్నట్టు కూడా దీని ద్వారా వెల్లడైంది. అంతేకాదు కొన్ని రకాల క్యాన్సర్లు, మెటబాలిక్‌ సిండ్రోమ్‌ వంటి వాటి బారిన కూడా పడుతున్నారు. అమ్మాయిలు చిన్న వయసులో రజస్వల అవడానికి ఇది కూడా ఒక కారణమే. ఇన్ని రకాలుగా నష్టం వాటిల్లుతోంది కాబట్టి మహిళలు మేకప్‌ ఉత్పత్తులతో జాగ్రత్తగా ఉండాల్సిందే’’ అంటున్నారు పరిశోధనా బృందంలో సీనియర్‌ ప్రొఫెసర్‌ యాంబర్‌ కూపర్‌.