డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే...

26-10-2018: నాకు మూడేళ్ల పాప ఉంది. డెలివరీ అయిన తర్వాత నుంచి బరువు పెరిగాను. ప్రెగ్నెన్సీకి ముందు 70 కిలోలు ఉండేదాన్ని. ఇప్పుడు 84 కిలోలున్నాను. బరువు తగ్గాలనుకుంటున్నా. అందుకోసం ఎలాంటి డైట్‌ తీసుకోవాలి... ఏం చేయాలో చెప్పండి.
- సరిత, వరంగల్‌
 
ప్రెగ్నెన్సీలో 6 నుంచి 12 కిలోల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత క్రమేపి బరువు తగ్గుతారు. దీనికి 12 నెలల నుంచి 18 నెలల వరకు సమయం పడుతుంది. అయితే చాలామంది తగ్గడానికి బదులు బరువు పెరుగుతుంటారు. దీనికి కారణం సరైన కేర్‌ తీసుకోకపోవడమే. డెలివరీ అయిన తర్వాత బరువు తగ్గాలంటే ఏం చెయ్యాలంటే...
పాలకు తల్లిపాలు ఇస్తున్నంతకాలం బరువు తగ్గే ప్రణాళికలు చేయకూడదు. పై పాలు మొదలెట్టి, ఘనాహారం కూడా ఇవ్వడం మొదలైనప్పుడు బరువు తగ్గే డైట్‌ ఫాలో అవ్వొచ్చు. అయితే పాలు ఇస్తున్నప్పుడు ఆటోమేటిగ్గా బరువు నియంత్రణ అవుతుంటుంది. ఈ సమయంలో చిన్నపాటి వ్యాయామం మొదలెట్టవచ్చు. పాపాయికి పాలు ఇవ్వడం మానేసిన తర్వాత ఈ కింది విధంగా ఆహార నియంత్రణ చేసుకోవాలి.
ఉదయమే ఒక గ్లాస్‌ రాగి జావా కొద్దిగా పాలు తీసుకోవచ్చు. పండు కూడా తినొచ్చు.
బ్రేక్‌ఫాస్ట్‌గా పల్లి చట్నీతో రెండు ఇడ్లీలు. వెజ్‌ సలాడ్‌
 మధ్యలో ఆకలి వేస్తే మజ్జిగ లేదా సూప్‌ తీసుకోవాలి.
 మధ్యాహ్నం భోజనంలోకి వెజ్‌ సలాడ్‌, కప్పు రైస్‌, ఆకుకూర పప్పు, మజ్జిగ
మూడు గంటలకు ఒక పండు
సాయంత్రం ఐదు గంటలకు గుప్పెడు రోస్టెడ్‌ పల్లీలు, టీ
 రాత్రి భోజనంలోకి వెజ్‌ సలాడ్‌, రెండు పుల్కాలు, అలసందల కూర, మజ్జిగ రెగ్యులర్‌గా బరువు చెక్‌ చేసుకుంటూ దానికి తగినట్టుగా ఆహార ప్రణాళిక మార్చుకుంటూ ఉండాలి. ఇలా చెయ్యడం వల్ల బరువు తగ్గుతారు.
డాక్టర్‌ బి. జానకి
న్యూట్రిషనిస్ట్‌