పండంటి పాపాయి కోసం...

మాతృత్వం ఆడజన్మకు ఓ వరం. అమ్మతనం కోసం ప్రతి స్ర్తీ తపిస్తుంది. గర్భవతి అని తెలిసిన క్షణం నుంచి పుట్టబోయే బిడ్డను గూర్చి ఎన్నో కలలు కంటుంది. మరెన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రతి స్ర్తీ అమ్మగా మారి తన జన్మను సార్థకం చేసుకోవాలని ఆరాటపడుతుంది. బిడ్డ తల్లిలో అంతర్భాగం. గర్భావధికాలంలో బిడ్డ తల్లి ద్వారానే ఆహారాన్ని, ఆయువుని పొందుతుంది. మొదటిసారి గర్భం దాల్చిన స్ర్తీకి ఎన్నో సందేహాలు, అనుమానాలు ఉంటాయి. గర్భవతులకు అమ్మలు, అమ్మమ్మలు, స్నేహితులు వారి అనుభవంతో, ఆ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూనే ఉంటారు. పండంటి పాపాయి కోసం గర్భణీలు ఆహారం, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

పరీక్షలు తప్పనిసరి!

పుట్టబోయే బిడ్డ ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే వైద్యులు నిర్దేశించిన సమయాల్లో సూచించిన రక్త, మూత్ర పరీక్షల్ని చేయించుకోవాలి. ముఖ్యంగా రక్తహీనత పరీక్షల్ని తప్పకుండా చేయించుకోవాలి. రక్తంలో హీమోగ్లోబిన్‌ స్థాయిని పెంచే ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌ ఉండే ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మొలలు, అధికస్రావం, మలేరియా వంటి సమస్యలు వస్తే సత్వరమే వైద్యుల్ని సంప్రదించాలి. కాన్పు తర్వాత కూడా మూడు నెలల వరకు ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఎటువంటి సమస్య వచ్చినా వైద్యుని సలహా తీసుకోకుండా మాత్రలు వేసుకోకూడదు. గర్భధారణ సమయంలో మొదటి మూడు నెలల్లో నెలకొకసారి, తర్వాతి మూడు నెలల్లో నెలకు రెండుసార్లు, చివరి మూడు నెలల్లో వారానికొకసారి వైద్యుల్ని సంప్రదించి తగిన సలహాలు, సూచనలు పాటించాలి.

పోషకాహారం

తల్లి తీసుకునే ఆహారమే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేస్తుంది. గర్భధారణ సమయంలో శరీరానికి విటమిన్లు, మినరల్స్‌ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తగిన ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా పొందవచ్చు. ఆహారపదార్థాల ద్వారా తీసుకోలేకపోతే విటమిన్‌ సప్లిమెంట్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, మాత్రలకన్నా అన్నిరకాల విటమిన్లు, సూక్ష్మపోషకాలు అందేలా పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది. తాజా కూరగాయలు, పండ్లు, పండ్లరసాలు, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు మొదలైన వాటిలో గర్భిణీ స్ర్తీలకు కావలసిన పోషకాలు లభ్యమవుతాయి. ఫోలిక్‌ యాసిడ్‌ లోపం వల్ల పుట్టబోయే పిల్లల్లో వెన్నెముకకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. దంపుడు బియ్యం, ఆకుకూరలను తీసుకోవడం ద్వారా ఫోలిక్‌ యాసిడ్‌ను ఎక్కువ మోతాదులో పొందవచ్చు. తద్వారా పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. 

నిద్రలేమి

గర్భం దాల్చి్న సమయంలో హార్మోన్లలో మార్పు, శారీరక అసమానత వల్ల నిద్రలేమి సమస్య మొదలవుతుంది. కొంతమంది గర్భవతులకు నీరసం, అతినిద్ర వంటి సమస్యలు కూడా బాధిస్తాయి. అయితే అతిగా నిద్రపోవడం కూడా మంచిదికాదు. నెలలు నిండినకొద్దీ బ్లాడర్‌పై ఒత్తిడి పెరిగి తరచూ మూత్రానికి వెళ్ళాల్సివస్తుంది. మొదటి మూడు నెలల్లో శారీరక మార్పులు నిద్రసమస్యల్ని కలిగిస్తే తర్వాతి మూడు నెలలు మానసిక ఒత్తిడి వల్ల సరైన నిద్ర పట్టదు. తద్వారా బిడ్డ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల మధ్యాహ్న సమయంలో నిద్రపోకుండా జాగ్రత్తపడుతూ రాత్రుళ్ళు కంటి నిండా నిద్రపోవడం మంచిది. ఉదయాన్నే నిద్రలేవడం కష్టమైనప్పటికీ అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు వైద్యులు. 

వ్యాయామం, విశ్రాంతి

గర్భధారణ సమయంలో శరీరానికి విశ్రాంతి అవసరం. యోగ, వ్యాయామం, ధ్యానం వంటి మార్గాల ద్వారా మనసునీ, శరీరాన్నీ ఉత్తేజితం చేయవచ్చు. వేడినీళ్ళతో స్నానం, దీర్ఘమైన శ్యాస తీసుకోవడం, పడుకునే ముందు కాసేపు నడవడం వంటివి చేస్తుండాలి. గర్భిణీలకు వ్యాయామం ఎంతో అవసరం. వ్యాయామం చేయడం వల్ల మనసుకీ, శరీరానికీ, ఉల్లాసం, ఉత్తేజం కలుగుతుంది. మానసిక, శారీరక ఒత్తిడి నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అయితే గర్భం దాల్చినపుడు శరీరం బాగా అలసిపోయే వ్యాయామం చేయకూడదు. క్రమం తప్పకుండా కొద్దిసమయంపాటు మాత్రమే వ్యాయామం చెయ్యాలి. వ్యాయామం ఏదైనా డాక్టరు సలహాతో చేయడం మంచిది.

ఇతర మందుల వాడకం

గర్భధారణ సమయంలో ఇతర ఆరోగ్య సమస్యలకోసం వాడే మందులను వాడడం మంచిది కాదు. వాటి ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఎక్కువగా ఉంటుంది. కడుపులోని బిడ్డ ఎదుగుదలపై కూడా ప్రభావం ఉంటుంది. అంతేకాక కొన్ని మందులు ముఖ్యంగా హెర్బల్‌ ప్రోడక్ట్స్‌, యాంటీ బయాటిక్స్‌ వంటి వాటివల్ల గర్భస్రావమయ్యే అవకాశం కూడా ఉంది. అయితే రక్తపోటు, డయాబెటిస్‌, థైరాయిడ్‌ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మాత్రం డాక్టర్ల సలహాతో మందులు వాడవచ్చు. 

ప్రయాణాలు చేయడం

గర్భం దాల్చిన సమయంలో ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. హైబీపీ, మధుమేహవ్యాధి ఉన్నప్పుడు, తల తిరగడం, వికారం, వాంతులవడం, రక్తస్రావం అయినప్పుడు -ఎట్టిపరిస్థితుల్లో ప్రయాణం చేయకూడదు. మూడు నెలలు నిండినప్పటినుంచీ ఎనిమిది నెలలలోపు తప్పనిసరి అయితేనే డాక్టరు సలహాతో ప్రయాణం చేయవచ్చు. గర్భస్థ శిశువుకు, గర్భవతికి సుఖంగా ఉండేలా, ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రయాణం చేయాలి. ఇరుకుగా ఉన్న సీట్లల్లోనూ, కుదుపులు ఎక్కువగా ఉన్న రోడ్ల మీదా ప్రయాణం చేయకూడదు. ప్రయాణ సమయంలో అనారోగ్యం కలిగితే డాక్టర్‌ సలహా లేకుండా యాంటీ బయాటిక్‌ మాత్రలను వేసుకోవడం గర్భిణి ఆరోగ్యానికే కాక గర్భస్థ శిశువుకు కూడా మంచిది కాదు. ప్రయాణం చేసే సమయంలో కడుపునొప్పి వచ్చినా, నడుమునొప్పి వచ్చినా, రక్తస్రావం కనబడినా వెంటనే డాక్టరును సంప్రదించాలి. సాధ్యమైనంతవరకూ, ఏడు నెలలు దాటిన తర్వాత, గర్భవతి ప్రయాణం చేయకపోవడమే మంచిది. ప్రయాణం ప్రమాదాన్ని కలిగించకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటూ, వైద్య సలహా పాటిస్తూ, ఒంటరిగా కాకుండా ప్రయాణం చేయడం మంచిది.

లైంగిక జీవనం

గర్భం దాల్చినప్పుడు లైంగికజీవనాన్ని కొనసాగించాలా, వద్దా? అనేది చాలామందిలో ఉండే అనుమానమే. తొలిసారి గర్భం ధరించినవారైతే ఈ విషయంలో మరీ ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. మగవారికి కూడా దీనిపై అంతగా అవగాహన ఉండదు. ఆరోగ్య సమస్యలు ఉన్న గర్భవతులు సంసార జీవనంలో పాల్గొనకపోవడమే మంచిదంటున్నారు వైద్యులు. అయితే ఈ విషయంలో భార్యాభర్తలమధ్య అవగాహన అవసరం. ఆరోగ్యవంతమైన గర్భిణీలు కూడా ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గర్భం ధరించిన మొదటి మూడు నెలలు, చివరి రెండు నెలలు సంసార జీవనానికి దూరంగా ఉండాలి. మొదటి మూడు నెలలు భార్యాభర్త కలిస్తే అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చివరి రెండు నెలలు కలవడం వలన రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో కాన్పుకావడం కష్టంకావచ్చు. అలాగే నిర్ణీత సమయానికన్నా ముందే ప్రసవం జరగవచ్చు. ఇది తల్లికీ, బిడ్డకీ క్షేమం కాదు. అందుకే సంసారజీవనం విషయంలో ఒక నిబంధన ప్రకారం ఉండడం శ్రేయస్కరం.

ఒత్తిడి తగదు

గర్భిణి తీవ్రమైన మానసిక ఒత్తిడి అనుభవిస్తే ఆ ప్రభావం కడుపులోని బిడ్డ పైనా పడుతుందా? అనే అంశంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. తాజాగా వెల్లడైన అంశమేమంటే- గర్భం దాల్చిన తర్వాత తొలి మూడు మాసాల్లో తల్లి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైతే ఆమెకు పుట్టే బిడ్డకు రక్తహీనత, ముఖ్యంగా ఐరన్‌ లోపం బారినపడే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదల ప్రభావితమవుతుందని ఇజ్రాయెల్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఐరన్‌ బిడ్డ శారీరక అవయవాల ఎదుగుదలకు, ముఖ్యంగా మెదడు వికాసానికి చాలా కీలకం. తల్లుల్లో ఐరన్‌ లోపం, మధుమేహం, గర్భం దాల్చిన తర్వాత పొగ తాగటం వంటివి పిల్లల్లో ఐరన్‌ లోపాన్ని పెంచుతాయి. అలాగే నెలలు నిండకముందే పుట్టిన బిడ్డల్లో కూడా ఐరన్‌ లోపించే అవకాశాలు ఎక్కువ. వీటన్నింటికి తోడు- గర్భిణి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనా కూడా పిల్లల్లో ఐరన్‌ లోపం తలెత్తవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో గర్భిణులంతా, చక్కటి పోషకాహారం, మానసిక ప్రశాంతత... ఈ రెండు అంశాలమీదా ప్రత్యేక శ్రద్ధ పెట్టటం చాలా అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.

గర్భవతులు తినకూడనివి

• విటమిన్‌ ‘ఎ’ ఎక్కువగా ఉండే మాంసాహారం అనగా లివర్‌ వంటివి తినకూడదు. బీటా కెరోటిన్‌ ఉండే విటమిన్‌ ‘ఎ’ (కారెట్స్) తినవచ్చును 
• ఉడకని మాంసం తినకూడదు. ముఖ్యముగా పందిమాంసము తినకూడదు. దీనివల్ల టోక్సోప్లాస్మోసిస్‌ (toxoplasmosis) అనే ఇన్ఫెక్షన్‌ వచ్చి బిడ్డ మెదడు పెరుగుదలను దెబ్బతీస్తుంది. పిల్లలకు అంధత్వం కూడా రావచ్చు. 
• కాయకూరలు బాగా కడిగి తినాలి. కడగని ఆకుకూరలు, కాయలు, పండ్ల పైన టోక్సోప్లాస్మోసిస్‌ కలుగజేసే బాక్టీరియా ఉంటుంది. గర్భస్థ శిశువుకు ఇది చాలా ప్రమాదకరమైంది. 
• పాశ్చరైజేషన్‌ చేయని పాలతో తయారుచేసిన జున్ను వంటి పదార్థాలు తినకూడదు. పాశ్చరైజేషన్‌ చేయని పాలలో లిస్టీరియా(Listeria), బొవైన్‌ టి.బి (Bovine T.B) అనే బాక్టీరియా ఉంటుంది. దానివలన గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది.
• శరీరంలో వేడిని పెంచే పదార్థాలు అంటే ఆవకాయ, మామిడికాయ, ఆవపెట్టిన కూరలు, నువ్వులు, బొప్పాయి వంటివి తొలి మూడు నెలల్లో తినకూడదు.
• పచ్చిగుడ్డు, ఉడకని గుడ్లతో చేసిన పదార్థాలను తినకూడదు. పచ్చిగుడ్డులో ఉండే సాల్మోనెల్లా(Solmonella) అనే బాక్టీరియా వల్ల టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.
• ఫాస్ట్‌ఫుడ్‌, పీజా, బర్గర్‌ వంటి జంక్‌ఫుడ్‌ జోలికి పోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే వీటి తయారీలో ఉపయోగించే అజినమోటో(టేస్టింగ్‌ సాల్ట్‌) శిశువు ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ర్పభావం చూపుతుంది. అందువల్ల వీలైనంత వరకు వీటికి దూరంగా ఉంటే బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
• గర్భం దాల్చినప్పుడు ఎట్టిపరిస్థితుల్లో మద్యపానం, ధూమపానం వంటి వాటి జోలికి పోకూడదు. ఈ రెండింటి వల్ల పుట్టబోయే పిల్లల్లో కాలేయ, శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ.